రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు | ||||
---|---|---|---|---|
భారత స్వాతంత్ర్య పోరాటం లో భాగం | ||||
తేదీ | 18–23 February 1946 | |||
స్థలం | బ్రిటిషు ఇండియా | |||
లక్ష్యాలు | మెరుగైన పని పరిస్థితుల కోసం | |||
పద్ధతులు | సమ్మె | |||
పౌర ఘర్షణల్లో పాల్గొన్న పక్షాలు | ||||
| ||||
ముఖ్య నాయకులు | ||||
| ||||
Number | ||||
|
రాయల్ ఇండియన్ నేవీకి చెందిన భారత నావికులు 1946 ఫిబ్రవరి 18 న బొంబాయి నౌకాశ్రయంలోని స్థావరాల్లోను, నౌకలపైనా చేసిన తిరుగుబాటును రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అని పిలుస్తారు. దీన్ని బాంబే తిరుగుబాటు అని కూడా అంటారు. బొంబాయిలో రాజుకున్న తిరుగుబాటు, కరాచీ నుండి కలకత్తా వరకు బ్రిటిష్ ఇండియా అంతటా వ్యాపించింది. చివరికి 78 నౌకల్లోను, తీర స్థావరాలలోనూ ఉన్న 20,000 మంది నావికులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు.[1] [2]
ఈ తిరుగుబాటును బ్రిటిష్ దళాలు, రాయల్ నేవీ యుద్ధ నౌకలు బలవంతంగా అణచివేసాయి. మొత్తం 8 మంది మరణించారు, 33 మంది గాయపడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే పోరాటంలో పాల్గొన్నవారికి మద్దతు ఇచ్చింది; ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్ దీన్ని ఖండించాయి.
పని చేసే చోట్ల ఉన్న సాధారణ పరిస్థితులకు నిరసనగా ఫిబ్రవరి 18 న రాయల్ ఇండియన్ నేవీ రేటింగులు (నౌకాదళంలో పనిచేసే అతి తక్కువ స్థాయి నావికులు) చేసిన సమ్మెతో ఈ తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటుకు కారణమైన తక్షణ సమస్యలు జీవన పరిస్థితులు, ఆహారం.[3] ఫిబ్రవరి 19 న సంధ్యా సమయంలో, నౌకదళ కేంద్ర సమ్మె కమిటీని ఎన్నుకున్నారు. ప్రముఖ సిగ్నల్‌మన్ లెఫ్టినెంట్ ఎంఎస్ ఖాన్, పెట్టీ ఆఫీసర్ టెలిగ్రాఫిస్ట్ మదన్ సింగ్‌లు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.[4] స్వాతంత్ర్య సాధన దగ్గర పడిన దశలో ఈ సమ్మె చేటు చేస్తుందని భావించిన రాజకీయ నాయకత్వం దానికి మద్దతు ఇవ్వలేదు. కానీ సామాన్య ప్రజల్లో కొంత మద్దతు లభించింది.[5] తిరుగుబాటుదారుల మద్దతుగా బొంబాయిలో ఒకరోజు సార్వత్రిక సమ్మెతో సహా ప్రదర్శనలు చేసారు. ఈ సమ్మె ఇతర నగరాలకు వ్యాపించింది. రాయల్ ఇండియన్ వైమానిక దళం, స్థానిక పోలీసు దళాల్లోని కొందరు కూడా ఇందులో చేరారు.
భారత నావికాదళ సిబ్బంది తమను "ఇండియన్ నేషనల్ నేవీ" అని పిలవడం ప్రారంభించారు. బ్రిటిష్ అధికారులకు ఎడమచేత్తో సెల్యూట్ చెయ్యడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని ఎన్‌సిఓలు బ్రిటిష్ ఉన్నతాధికారుల ఆదేశాలను విస్మరించి, ధిక్కరించారు. మద్రాస్, పూనా (ఇప్పుడు పూణే ) లో, బ్రిటిష్ దండులు భారత సైన్యం యొక్క శ్రేణులలో కొంత అశాంతిని ఎదుర్కోవలసి వచ్చింది. కరాచీ నుండి కలకత్తా వరకు విస్తృతంగా అల్లర్లు జరిగాయి. తిరుగుబాటు చేసే ఓడలు మూడు జెండాలను - కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) - ఒక్కటిగా కట్టి ఎగరవేసాయి. తిరుగుబాటుదారులలో ఐక్యతను సూచిస్తూ, మతపరమైన విభేదాలను తగ్గిస్తూ ఇలా చేసారు.
సంక్షోభాన్ని పరిష్కరించడానికి కాంగ్రెసు, వల్లబ్ భాయ్ పటేల్ను బొంబాయికి పంపింది. నావల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ (ఎన్‌సిఎస్‌సి) అధ్యక్షుడు ఎంఎస్ ఖాన్‌కు, పటేల్‌కూ చర్చలు జరిగాక, ఈ తిరుగుబాటును విరమించుకున్నారు. సమ్మెను ముగించాలని పటేల్ పిలుపునిచ్చాడు. తరువాత ముస్లిం లీగ్ తరపున మొహమ్మద్ అలీ జిన్నా కలకత్తాలో జారీ చేసిన ఒక ప్రకటన ద్వారా దీన్నే ప్రతిధ్వనించాడు. ఈ గణనీయమైన ఒత్తిళ్లకు సమ్మె చేసేవారు తలొగ్గారు. అరెస్టులు జరిగాయి. కోర్టు మార్షళ్ళు జరిగాయి. 476 మంది నావికులను రాయల్ ఇండియన్ నేవీ నుండి తొలగించారు. తొలగించబడిన వారిలో ఎవరినీ కూడా స్వాతంత్ర్యం తరువాత భారత, పాకిస్తాన్ నావికాదళాలలో తిరిగి నియమించలేదు.
రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా రాయల్ ఇండియన్ నేవీ (RIN) ని వేగంగా విస్తరించారు. 1945 లో దాని పరిమాణం, 1939 నాటి కంటే 10 రెట్లు పెద్దది. యుద్ధం కారణంగా, సైన్యం నియామకం ఇకపై యోధ జాతులకే పరిమితం కానందున, వివిధ ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని నియమించారు. 1942, 1945 మధ్య, నాజీ జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధ ప్రయత్నాల కోసం భారతీయులను ముఖ్యంగా కమ్యూనిస్ట్ కార్యకర్తలను బ్రిటిష్ భారత సైన్యంలోకి, నౌకాదళం లోకీ భారీగా నియమించడంలో సిపిఐ నాయకులు సహాయం చేశారు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత, కొత్తగా నియమించబడిన సైనికులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మారారు. [6]
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, "చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధం" చేసినందుకు ఇండియన్ నేషనల్ ఆర్మీకి (ఐఎన్ఎ) చెందిన జనరల్ షా నవాజ్ ఖాన్, కల్నల్ ప్రేమ్ సహగల్, కల్నల్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్ అనే ముగ్గురు అధికారులను ఢిల్లీలోని ఎర్రకోట వద్ద విచారించారు. ఈ విచారణలో ముద్దాయిలు ముగ్గురినీ జవహర్‌లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్ తదితరులు సమర్థించారు. ఈ విచారణలు ప్రజల్లో నిరసనలు, అసంతృప్తిని రగిలించాయి. ప్రజలు ఈ ముగ్గురినీ తమ దేశం కోసం పోరాడిన విప్లవకారులుగా చూశారు. 1946 జనవరి లో, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వైమానికులు 1946 నాటి రాయల్ ఎయిర్ ఫోర్స్ తిరుగుబాటులో పాల్గొన్నారు. ప్రధానంగా వారిని వెనక్కి బ్రిటన్ పంపించడంణ్లో జరుగుతున్న జాప్యం పైన, కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ పాలనకు మద్దతుగా వాడటాన్ని వ్యతిరేకిస్తూనూ వారు ఈ తిరుగుబాటుకు పాల్పడ్డారు. ఆ సమయంలో వైస్రాయ్, లార్డ్ వేవెల్, బ్రిటిష్ వైమానికుల చర్యలే రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ ఇండియన్ నేవీ సినికుల తిరుగుబాట్లను ప్రేరేపించాయని పేర్కొన్నాడు, "రాయల్ ఎయిర్ ఫోర్స్ చేసిన తిరుగుబాటే ఉదాహరణగా నిలిచింది - నిజానికి అదొక తిరుగుబాటే అయినా వాళ్ళు శిక్ష తప్పించుకున్నారు - ప్రస్తుత పరిస్థితిలో దానికి కొంత బాధ్యత ఉంది. "
1946 ఫిబ్రవరి 18 న రాయల్ ఇండియన్ నేవీ రేటింగులు ఈ తిరుగుబాటును మొదలు పెట్టారు. రేటింగుల పట్ల చూపిస్తున్న వ్యవహారం ముఖ్యంగా సౌకర్యాలు లేకపోవడంపై ప్రతిచర్యే ఈ తిరుగుబాటు 1946 జనవరి 16 న, ఫోర్ట్ ముంబై, మింట్ రోడ్‌లోని కాజిల్ బ్యారక్స్ వద్దకు వివిధ శాఖలకు చెందిన 67 గురు రేటింగులు చేరుకున్నారు. సాయంత్రం 4:00 గంటలకు బొంబాయి శివారు ప్రాంతమైన థానే వద్ద ఉన్న ప్రాథమిక శిక్షణా సంస్థ హెచ్‌ఎంఐఎస్ అక్బర్ నుండి ఈ బృందం వచ్చింది. వారిలో ఒకరు, సయ్యద్ మక్సూద్ బొఖారీ, విధుల్లో ఉన్న అధికారి వద్దకు వెళ్లి శిక్షణా సంస్థలో గాలీ (వంటగది) సిబ్బందికి సంబంధించిన సమస్యల గురించి తెలియజేశారు.
ఆ రోజు సాయంత్రం నావికులు, తమకు ప్రామాణికమైన నాణ్యత లేని ఆహారాన్ని ఇచ్చారని ఆరోపించారు. కేవలం 17 రేటింగులు మాత్రమే భోజనం చేసారు. మిగతా వారు బహిరంగ ధిక్కారం చూపిస్తూ తినడానికి ఒడ్డుకు వెళ్ళారు. రేటింగుల పట్ల ఇటువంటి నిర్లక్ష్య చర్యలు ఎప్పటి నుండో జరుగుతున్నాయని, అక్కడ ఉన్న సీనియర్ అధికారులకు చెప్పిన ఎవరూ పట్టించుకునేవారు కాదనీ తెలిసింది. వారిలో అసంతృప్తి పెరగడానికి ఇది కచ్చితంగా ఒక కారణం. ఒడ్దున ఉన్న కార్యాలయం, హెచ్ఎంఐఎస్ తల్వార్ లోని కమ్యూనికేషన్ బ్రాంచ్ లోని రేటింగులకు (సమాజంలోని ఉన్నత వర్గాలకు చెందినవారు ఇక్కడ ఉంటూంటారు) అధికారుల పట్ల తిరస్కార భావం మరింత ఎక్కువగా ఉంటుంది. వారు కూడా తమ సౌకర్యాల పట్ల ఫిర్యాదు చేసారు గానీ ఫలితమేమీ లేదు. సుభాస్ చంద్రబోస్కు చెందిన ఐండియన్ నేషనల్ ఆర్మీ సైనికులపై చేపట్టిన విచారణలు, "నేతాజీ" కథలు, అలాగే ఇంఫాల్ ముట్టడి సమయంలో, బర్మాలో ఐఎన్ఎ పోరాటాల కథలు ఆ సమయంలో ప్రజల దృష్టిలో పడ్డాయి. ఈ కథలు వైర్‌లెస్ సెట్లు, మీడియా ద్వారా నావికుల దాకా చేరి, వారిలో అసంతృప్తిని కలిగించాయి. చివరికి సమ్మె చేయడానికి ప్రేరేపించాయి. కరాచీలో, మనోరా ద్వీపానికి దూరంగా ఉన్న రాయల్ ఇండియన్ నేవీ షిప్, హెచ్ఎంఐఎస్ హిందుస్తాన్లో తిరుగుబాటు జరిగింది. ఓడను, అలాగే తీర స్థావరాలను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత, ఇది HMIS బహదూర్కు వ్యాపించింది. ఎంఎస్ ఖాన్, మదన్ సింగ్ నేతృత్వంలో 1946 ఫిబ్రవరి 19 న నావికా సమ్మె కేంద్ర కమిటీని ఏర్పాటు చేశారు. మరుసటి రోజు, బొంబాయిలోని కాజిల్, ఫోర్ట్ బ్యారక్స్ నుండి వచ్చిన రేటింగులు, తిరుగుబాటులో చేరారు. ఆ సమయంలో HMIS తల్వార్ లోని రేటింగులపై కాల్పులు జరిగాయని పుకార్లు (అవాస్తవాలే) వ్యాపించాయి.
రేటింగులు వారి పోస్టులను వదిలి, సుంబాస్ చంద్రబోస్, లెనిన్ చిత్రాలను కలిగి ఉన్న జెండాలను ఊపుతూ లారీలలో బొంబాయిలో తిరిగారు. సమ్మెను వ్యతిరేకించి, బ్రిటిష్ వారి పక్షాన నిలిచిన అనేక మంది భారత నావికాదళ అధికారులను రేటింగులు ఓడల నుండి తోసేశారు. త్వరలోనే, బొంబాయి, కరాచీ, కొచ్చిన్, విశ్శాఖపట్నాల నుండి వేలాది అసంతృప్త రేటింగులు తిరుగుబాటుదారులతో చేరారు. హెచ్‌ఎంఐఎస్ తల్వార్‌లో అందుబాటులో ఉన్న వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్ల ద్వారా వివిధ తిరుగుబాటుల మధ్య కమ్యూనికేషన్ నిర్వహించారు. ఆవిధంగా, మొత్తం తిరుగుబాటును సమన్వయం చేసారు. నావల్ రేటింగుల సమ్మె త్వరలో తీవ్రమైన రూపు తీసుకుంది. బొంబాయిలోని స్లోప్స్, మైన్ స్వీపర్లు, తీర స్థావరాల నుండి వందలాది మంది స్ట్రైకర్లు VT కి సమీపంలో ఉన్న హార్న్‌బై రోడ్ వెంట రెండు గంటల పాటు ప్రదర్శన జరిపారు. (ఇప్పుడు CST సమీపంలో చాలా బిజీగా ఉండే DN రోడ్). రక్షణ దళాల్లోని బ్రిటిష్ సిబ్బందిని సుత్తి, క్రౌబార్లు, హాకీ కర్రలతో దాడి చేసారు. ఓడలపై ఎగరేసే బ్రిటను జెండాలను దించేసారు.
ఫ్లోరా ఫౌంటెన్‌లో, మెయిల్‌ను తీసుకెళ్ళే వాహనాలను ఆపి, మెయిల్‌ను కాల్చేసారు. కార్లు, బగ్గీల్లో వెళుతున్న బ్రిటిషు పురుషులు మహిళలను దింపేసి, వాళ్ళ చేత "జై హింద్" అని నినాదాలు చేయించారు. తాజ్ మహల్ హోటల్, యాట్ క్లబ్, ఇతర భవనాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు తుపాకీలను ఎక్కుపెట్టారు. తిరుగుబాటు ప్రారంభమైన తరువాత, తిరుగుబాటుదారులు చేసిన మొదటి పని, బిసి దత్ (జనరల్ ఆచిన్లెక్ సందర్శనకు వచ్చినపుడు ఇతడు అరెస్టయ్యాడు) ను విడిపించడం. ఆ తరువాత వారు బుచర్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు (ఇక్కడ బాంబే ప్రెసిడెన్సీ కోసం ఉద్దేశించిన మందుగుండు సామగ్రి మొత్తం నిల్వ చేసేవారు).
మెరైన్ డ్రైవ్, అంధేరి శిబిరాలకు చెందిన 1,000 మంది RIAF సైనికులు కూడా సానుభూతితో తిరుగుబాటులో చేరారు.
త్వరలోనే సమ్మె భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. కలకత్తా, మద్రాస్, కరాచీ, విశాఖల్లోని రేటింగులు కూడా "బొంబాయి కోసం సమ్మె", "11,000 మంది ఐఎన్‌ఎ ఖైదీలను విడుదల చేయాలి", " జై హింద్ " వంటి నినాదాలతో సమ్మెకు దిగాయి.
ఫిబ్రవరి 19 న, చాలా నౌకలు, స్థావరాలపై రేటింగులు త్రివర్ణాన్ని ఎగురవేశారు. ఫిబ్రవరి 20 నాటికి, మూడవ రోజు, సాయుధ బ్రిటిష్ డిస్ట్రాయర్లు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద నిలబడ్డాయి. RIN తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వానికి తీవ్రమైన సంక్షోభంగా మారింది. అప్రమత్తమైన బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ, తిరుగుబాటును అణిచివేసేందుకు రాయల్ నేవీని ఆదేశించాడు. RIN ను ఆదేశించే ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ జెహెచ్ గాడ్ఫ్రే "లొంగిపోండి లేదా నశించండి" అనే తన ఆదేశాన్ని ప్రసారం చేశాడు. ఆ సమయానికి ఈ ఉద్యమం, దేశభక్తి ఉత్సాహంతో దేశాన్ని కదిలించింది, రాజకీయ మలుపు తీసుకుంది.
నావికాదళ రేటింగులు సమ్మె కమిటీ కొంత గందరగోళంగా, HMIS కుమావున్ బొంబాయి నౌకాశ్రయాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించింది. HMIS కతియవార్ అప్పటికే అరేబియా సముద్రంలో తిరుగుబాటు చేసిన రేటింగుల నియంత్రణలో ఉంది. సుమారు 10:30 గంటలకు హఠాత్తుగా కుమావున్ ఒడ్డు తాడులను వదిలేసారు. ఓడల గ్యాంగ్ వేను తొలగించలేదు కూడా. అధికారులు బయటి బ్రేక్ వాటర్ జెట్టీపై శాంతిభద్రతల పరిస్థితి గురించి చర్చిస్తున్నారు. అయితే, రెండు గంటల్లోనే సమ్మెదారుల కంట్రోల్ రూమ్ నుండి తాజా సూచనలు వచ్చాయి. ఓడ తిరిగి అదే బెర్త్‌కు చేరుకుంది.
పరిస్థితి వేగంగా మారుతోంది. ఆస్ట్రేలియా కెనడా సాయుధ బెటాలియన్లను లయన్ గేట్, గన్ గేట్ ల బయట మోహరించి ఉంచినట్లు, చాలా ఓడలు లంగరేసి ఉన్న ఉన్న డాక్ యార్డును చుట్టుముడతారనీ పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ సమయానికి, ఓడలు స్థావరాల లోని ఆయుధాలన్నిటినీ రేటింగులు స్వాధీనం చేసుకున్నారు. సిలోన్ (శ్రీలంక) లోని ట్రింకోమలీ నుండి వచ్చిన బ్రిటిష్ డిస్ట్రాయర్లను అడ్డుకోవటానికి అందుబాటులో ఉన్న ఓడ యొక్క గుమాస్తాలు, క్లీనర్లు, వంటవారు, వైర్‌లెస్ ఆపరేటర్లూ అందుబాటులో ఉన్న ఆయుధాలతో సిద్ధమయ్యారు.
తాజా భావోద్వేగాలతో మూడవ రోజు తెల్లవారింది. బాంబే, ఆర్‌ఐఎన్, ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ ఆర్థర్ రులియన్ రాట్రే, నల్ల జెండాలను ఊపి, బేషరతుగా లొంగిపోవాలని రేటింగులును ఆదేశించాడు. రాయల్ వైమానిక దళానికి చెందిన బాంబర్‌ల స్క్వాడ్రన్ బాంబే నౌకాశ్రయం మీదుగా బల ప్రదర్శన చేస్తూ ఎగిరింది.
కరాచీలో, భారతీయ నావికులకు వ్యతిరేకంగా భారత సైనికులనే ఉపయోగించడం సైనికుల స్థైర్యం, క్రమశిక్షణలపై ఒత్తిడి కలుగుతుందని గ్రహించి, బ్లాక్ వాచ్ యొక్క 2 వ బెటాలియన్‌ను పిలిపించారు. మనోరా ద్వీపంలో తిరుగుబాటును ఎదుర్కోవడమే వారి మొదటి ప్రాధాన్యత. వారు హిందూస్తాన్ ఓడ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఓడను పట్టుకుని తమ అదుపులో పెట్టుకున్న రేటింగులు కాల్పులు జరిపారు. తీరస్థ సంస్థలైన హెచ్ఎంఐఎస్ బహదూర్, చమక్, హిమాలయాలను స్వాధీనం చేసుకున్న భారత నావికా రేటింగులు నుండి, ద్వీపంలోని రాయల్ నావల్ యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ స్కూల్ నుండి ప్రతిఘటన వస్తుందని ఆశించి, అర్ధరాత్రి, 2 వ బెటాలియన్ మనోరాకు వెళ్లాలని ఆదేశించారు. బెటాలియన్‌ను లాంచీలు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లలో నిశ్శబ్దంగా చేరవేసారు. ముందుగా దాటినది D కంపెనీ. వారు వెంటనే ద్వీపం యొక్క దక్షిణ చివర ఉన్న చమక్ వరకు వెళ్లారు . బెటాలియన్ యొక్క మిగిలిన భాగం ద్వీపపు దక్షిణ కొసన ఉంది. ఉదయాని కల్లా, బ్రిటిష్ సైనికులు ఈ ద్వీపాన్ని స్వాధీనపరచు కున్నారు.
4-అంగుళాల తుపాకులు కలిగి ఉన్న డిస్ట్రాయర్, హిందుస్తాన్. దానిలో ఉన్న భారత నావికాదళ రేటింగులను ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం సమయంలో రాయల్ ఆర్టిలరీ సి. ట్రూప్ నుండి మూడు తుపాకులు (క్యాలిబర్ తెలియదు) ఈ ద్వీపానికి వచ్చాయి. రాయల్ ఆర్టిలరీ బ్యాటరీని హిందుస్తాన్ నుండి పాయింట్ బ్లాంక్ పరిధిలో డాక్ వైపున ఉంచారు. హిందూస్తాన్లో ఉన్న తిరుగుబాటుదారులకు అల్టిమేటం ఇచ్చారు:10:30 కల్లా వారు ఓడను ఆయుధాలను విసర్జించి, ఓడను విడిచిపెట్టకపోతే పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. గడువు వచ్చింది, గడిచింది. ఓడ నుండి ఏ సందేశమూ లేదు. ఏ కదలికా లేదు.
10:33 కి కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చారు. గన్నర్ల మొదటి రౌండ్ గురి సరిగ్గానే ఉంది. హిందూస్తాన్ బోర్డులో భారత నావికాదళ రేటింగులు ఎదురు కాల్పులు మొదలు పెట్టారు. అనేక షెల్‌లు రాయల్ ఆర్టిలరీ తుపాకులను రాసుకుంటు వెళ్ళాయి. భారతీయ రేటింగులు కాల్చిన షెల్స్‌లో ఎక్కువ భాగం ప్రమాదమేమీ కలిగించకుండా పోయి కరాచీపైనే పడిపోయాయి. వారు సిద్ధంగా లేరు కాబట్టి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, తిరుగుబాటుదారులు నిలబడలేకపోయారు. 10:51 కల్లా తెల్ల జెండా ఎత్తేసారు. దెబ్బతిన్నవారినీ, మిగిలిన తిరుగుబాటు సిబ్బందినీ తొలగించడానికి బ్రిటిష్ నావికాదళ సిబ్బంది ఓడలో ఎక్కారు. హిందూస్తాన్ యొక్క సూపర్ స్ట్రక్చర్కు విస్తృతమైన నష్టం జరిగింది. భారత నావికులలో చాలా మందికి గాయాలయ్యాయి.
హెచ్‌ఎంఐఎస్ బహదూర్ ఇంకా తిరుగుబాటుదారుల నియంత్రణలోనే ఉంది. తిరుగుబాటును ఆపాలని ప్రయత్నించిన లేదా వాదించిన పలువురు భారతీయ నావికాదళ అధికారులను రేటింగులు ఓడ నుండి విసిరేసారు. బహదూర్‌ను ముట్టడించాలని, ఆపై మనోరా ద్వీపంలోని తీరస్థ కార్యాలయాలను ముట్టడించాలనీ 2 వ బెటాలియన్‌ను ఆదేశించారు. సాయంత్రానికల్లా AA పాఠశాల, చమాక్ లు D కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. B కంపెనీ హిమాలయను అదుపు లోకి తీసుకుంది. మిగతా బెటాలియన్ బహదూర్ను స్వాధీనం చేసుకుంది. కరాచీలో తిరుగుబాటును అణిచివేసారు.
బొంబాయిలో, పాత ఓడలో అమర్చిన 25-పౌండ్ల తుపాకీ సిబ్బంది రోజు చివరిలో కాజిల్ బ్యారక్‌ల వైపు వరుసబెట్టి కాల్పులు జరిపింది. పటేల్ చర్చల్లో నిమగ్నమై ఉన్నాడు. అతడిచ్చిన హామీల వల్ల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. అయితే, తిరుగుబాటు ఊపందుకుని దానంతట అదే ఉద్యమంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టమైంది. ఈ సమయానికి, ట్రింకోమలీ నుండి బ్రిటిష్ డిస్ట్రాయర్లు గేట్వే ఆఫ్ ఇండియాకు సమీపంలో నిలిపి ఉంచారు. పరిస్థితి యొక్క తీవ్రమైన సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు వేగంగా జరిగాయి. నాల్గవ రోజు సమ్మె చేసిన వారి డిమాండ్లు చాలావరకు సూత్రప్రాయంగా అంగీకరించబడ్డాయి.
రేటింగుల వంటగదిలో వడ్డించే ఆహార నాణ్యతను, వారి జీవన పరిస్థితులనూ మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. భారత జాతీయ సైన్యానికి చెందిన ఖైదీలందరినీ విడుదల చేయడానికి అనుకూలంగా `పరిశీలిస్తామని జాతీయ నాయకులు హామీ ఇచ్చారు.
ఈ తిరుగుబాటు నుండి సంభవించిన మొత్తం మరణాలు -ఏడుగురు RIN నావికులు, ఒక అధికారి.. ముప్పై మూడు RIN సిబ్బంది, బ్రిటిష్ సైనికులు గాయపడ్డారు. [7] తిరుగుబాటు ఫలితంగా మొత్తం 476 మంది నావికులను RIN నుండి పంపించేసారు.
హెచ్‌ఎంఐఎస్ తల్వార్‌లోని చాలా మంది నావికులకు కమ్యూనిస్టుల మద్దతు ఉన్నట్లు తెలిసింది. హెచ్‌ఎంఐఎస్ న్యూ ఢిల్లీలో అరెస్టయిన 38 మంది నావికులపై జరిపిన అన్వేషణలో 15 మంది సిపిఐ సాహిత్యానికి చందాదారులని గుర్తించారు. ఈ తిరుగుబాటు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొదలుపెట్ట నప్పటికీ, దాని సాహిత్యంతో ప్రేరణ పొందిందని బ్రిటిష్ వారికి తరువాత తెలిసింది. [8]
సాయుధ దళాలలో తిరుగుబాటుదారులకు జాతీయ నాయకుల నుండి మద్దతు లభించలేదు. వాళ్ళకు నాయకత్వం లేదు. మహాత్మా గాంధీ, వాస్తవానికి, అల్లర్లను, రేటింగుల తిరుగుబాటునూ ఖండించాడు. 3 మార్చి 1946 న ఆయన చేసిన ప్రకటనలో సమ్మె చేసినవారు "సిద్ధంగా ఉన్న విప్లవాత్మక పార్టీ" పిలుపు లేకుండా, "తమకు నచ్చిన రాజకీయ నాయకుల" మార్గదర్శకత్వం, జోక్యం లేకుండా తిరుగుబాటు చేశారని విమర్శించాడు. [9] తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చిన ప్రముఖ కాంగ్రెసు నాయకురాలు అరుణ అసఫ్ అలీని ఆయన విమర్శించాడు. రాజ్యాంగపరంగా కాకుండా హిందువులను, ముస్లింలను బారికేడ్లపై ఆమె ఏకం చేస్తుందని ఆయన విమర్శించారు. [10]
తిరుగుబాటుపై ముస్లిం లీగ్ ఇలాంటి విమర్శలే చేసింది. నావికుల సమస్య ఎంత తీవ్రమైనదైనా తమ అశాంతిని ప్రదర్శించాల్సింది వీధుల్లో కాదని లీగ్ విమర్శించింది. ఏ ఉద్యమానికి చట్టబద్ధత దక్కేది, దాన్ని రాజకీయ నాయకత్వం నడిపించినపుడు మాత్రమే. రేటింగుల తిరుగుబాటు లాంటి ఆకస్మికమైన, అదుపు లేని తిరుగుబాట్లు, రాజకీయ స్థాయిలో ఉన్న ఏకాభిప్రాయానికి అంతరాయం కలిగిస్తాయి అంతే. మహా అయితే నాశనం చెయ్యగలవు. 1942 లోని క్విట్ ఇండియా ఉద్యమం నుండి గాంధీ నేర్చుకున్నది ఇదే కావచ్చు. ఆ ఉద్యమంలో బ్రిటిష్ అణచివేత వలన కేంద్ర నియంత్రణ త్వరగా సడలిపోయింది. విధ్వంస చర్యలతో సహా స్థానిక కార్యక్రమాలు 1943 వరకు బాగానే కొనసాగాయి. నావికులకు మద్దతుగా తీవ్రవాద సామూహిక ప్రదర్శనలు వేగంగా అందుకోవడంతో, అధికార బదిలీ జరిగే వేళకు కేంద్ర రాజకీయ నాయకత్వం బలహీనపడి పోతుందనే నిశ్చయానికి వచ్చి ఉండవచ్చు. ముస్లిం లీగ్ "క్విట్ ఇండియా" ఉద్యమానికి మద్దతు ఇవ్వనప్పటికీ, తన మద్దతుదారులలో ఉద్యమం పట్ల నిష్క్రియాత్మక మద్దతు ఉండడం గమనించింది. మత ఘర్షణలు కూడా లేవు. అధికారం బదిలీ చేయబడినప్పుడు, అస్థిరత ఉండే సంభావ్యతను లీగ్ కూడా గ్రహించి ఉండవచ్చు. సమ్మెలో పాల్గొన్న నావికుల అభిప్రాయంపై ఇది కచ్చితంగా ప్రతిబింబిస్తుంది.[11] బ్రిటీష్ భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విజయం సాధించలేకపోతున్న సమయంలో, ప్రజల్లో తిరుగుబాటు పట్ల పెల్లుబికిన సానుభూతిని బట్టి, ప్రజల్లో తమకున్న పట్టు బలహీన పడుతున్నట్లు పార్టీలకు అర్థమైంది. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల లోని ఈ అసౌకర్యాన్ని తరువాతి కాలపు చరిత్రకారులు నిర్ధారించారు. [12]
ఆ సమయంలో మూడవ అతిపెద్ద రాజకీయ శక్తి అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నావికాదళ రేటింగులకు పూర్తి మద్దతునిచ్చి, కార్మికులను తమకు మద్దతుగా సమీకరించింది. బ్రిటిష్ పాలనను చర్చల ద్వారా కాకుండా విప్లవం ద్వారా అంతం చేయాలని ఆశించింది. [13] బ్రిటిష్ ఇండియా యొక్క రెండు ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లు రేటింగులకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. సామూహిక తిరుగుబాటు యొక్క వర్గభావన వారిని భయపెట్టింది. రేటింగులను లొంగిపొమ్మని కోరారు. మత విభజన యొక్క ఇద్దరు ప్రతినిధుల ముఖాలు అయిన పటేల్, జిన్నాలు ఈ అంశంపై ఏకమయ్యారు. గాంధీ కూడా 'తిరుగుబాటుదారులను' ఖండించాడు. ఫిబ్రవరి 22 న సాధారణ సమ్మెకు కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. దానికి అపూర్వమైన ప్రతిస్పందన లభించింది. కలకత్తా, కరాచీ, మద్రాసుల్లో లక్ష మందికి పైగా విద్యార్థులు, కార్మికులు వీధుల్లోకి వచ్చారు. ఎర్ర జెండాలు మోస్తున్న కార్మికులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ వీధుల్లో కవాతు చేశారు. 'రేటింగుల డిమాండ్లను అంగీకరించండి', 'బ్రిటిష్ పోలీస్ జులుం నశించాలి' అంటూ నినదించారు. లొంగిపోయిన తరువాత, రేటింగులు కోర్ట్ మార్షళ్ళు, జైలు శిక్షలు, వేధింపులనూ ఎదుర్కొన్నారు. 1947 తరువాత కూడా, స్వతంత్ర భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలు వారిని తిరిగి తీసుకోవడానికి గాని, పరిహారం ఇవ్వడానికి గానీ నిరాకరించాయి. వారికి మద్దతు ఇచ్చిన ఏకైక నాయకురాలు కాంగ్రెస్‌కు చెందిన అరుణా అసఫ్ అలీ. అనేక విషయాలపై కాంగ్రెస్ పార్టీ పురోగతిపై నిరాశ చెందిన అరుణ అసఫ్ అలీ 1950 ల ప్రారంభంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) లో చేరింది.[14]
భారత జాతీయ కాంగ్రెస్‌తో పోటీపడి జాతీయ రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు కమ్యూనిస్ట్ పార్టీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చిందని ఊహించారు. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాలో (తరువాత ఇది భారతదేశ సుప్రీంకోర్టుగా మారింది) న్యాయమూర్తిగా ఉన్న ఎంఆర్ జయకర్ ఒక వ్యక్తిగత లేఖలో ఇలా రాశాడు [15]
ఇప్పటికీ తిరుగుబాటు గురించి ప్రస్తావించే ఏకైక ప్రధాన రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లు. కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యం RIN తిరుగుబాటును భారతదేశ విభజనను నిరోధించే శక్తిని కలిగి ఉన్న ఒక స్వయంచాలక జాతీయవాద తిరుగుబాటుగా చిత్రీకరిస్తుంది. జాతీయవాద ఉద్యమ నాయకులు ఈ తిరుగుబాటు నాయకులను మోసగించారని కూడా చెబుతుంది. [16]
ఇటీవల, RIN తిరుగుబాటుకు నావల్ తిరుగుబాటు అని పేరు మార్చారు. భారత స్వాతంత్ర్యంలో వారు పోషించిన పాత్రకు గాను తిరుగుబాటుదారులను సత్కరించారు. ముంబైలో విశాలమైన తాజ్ వెల్లింగ్‌డన్ మ్యూస్‌కు ఎదురుగా ఉన్న విగ్రహంతో పాటు, ఇద్దరు ప్రముఖ తిరుగుబాటుదారులు, మదన్ సింగ్, బిసి దత్ ల పేర్లను భారత నావికాదళ ఓడలకు పెట్టారు.
భారతీయ చరిత్రకారులు తిరుగుబాటును బ్రిటిష్ రాజ్కు, వలస పాలనకూ వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుగా చూశారు. సైన్యంలో ఇంతటి అశాంతి లేదని బ్రిటిష్ పండితులు అంటారు. నేవీలోని అంతర్గత పరిస్థితులే దీనికి కేంద్రంగా ఉన్నాయని తేల్చారు. నాయకత్వం పేలవంగా ఉంది. వారి సేవ యొక్క చట్టబద్ధతపై ఎటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ఇంకా, అధికారులకు (తరచుగా బ్రిటీష్), చిన్న అధికారులకు (ఎక్కువగా పంజాబీ ముస్లింలు), జూనియర్ రేటింగులకూ (ఎక్కువగా హిందూ) మధ్య ఉద్రిక్తతలు ఉండేవి. అలాగే యుద్ధకాల సేవ నుండి చాలా నెమ్మదిగా విడుదల చేసినందుకు కోపం కూడా ఉండేది.[17] [18]
నెమ్మదిగా జరుగుతున్న డీమొబిలైజేషనుపైనే ఫిర్యాదులున్నాయి. బ్రిటీష్ యూనిట్లు తిరుగుబాటుకు దగ్గర్లో ఉన్నాయి. భారతీయ యూనిట్లు దీనిని అనుసరిస్తాయని భయపడింది. [19] 1946 మార్చి 25 న విడుదల చేసిన వారపు ఇంటెలిజెన్స్ సారాంశం భారత సైన్యం, నేవీ, వైమానిక దళం యూనిట్లు ఇకపై నమ్మదగినవి కాదనీ, ఆర్మీకి సంబంధించి, "స్థిరత్వం గురించి రోజువారీ అంచనాలు మాత్రమే చేయగలం" అనీ అంగీకరించింది. [20] ఈ విధంగా పరిస్థితిని " పాయింట్ ఆఫ్ నో రిటర్న్ "గా పరిగణించారు. [21] [22]
1948 లో బ్రిటిష్ వారు 1946 ఇండియన్ నావల్ తిరుగుబాటును "బ్రిటిష్ కిరీటానికి వ్యతిరేకంగా మధ్యప్రాచ్యం నుండి దూర ప్రాచ్యం వరకు జరిగిన పెద్ద కమ్యూనిస్ట్ కుట్ర"గా ముద్రవేశారు. [23]
అయితే, తిరుగుబాటు కొనసాగితే భారతదేశ అంతర్గత రాజకీయాలకు ఎలాంటి చిక్కులు ఉండేవి అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. భారతీయ జాతీయవాద నాయకులు, ముఖ్యంగా గాంధీ, కాంగ్రెస్ నాయకత్వం, ఈ తిరుగుబాటు వలన చర్చల ద్వారా స్వాతంత్ర్యానికి రాజ్యాంగ పరిష్కారం సాధించాలనే వ్యూహం బెడిసి కొడుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తిరుగుబాటును బెంగాల్ లోని మార్క్సిస్ట్ సాంస్కృతిక కార్యకర్తలు అభిమానించారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఎ) తరపున సలీల్ చౌదరి 1946 లో ఒక విప్లవ గేయం రాశాడు. తరువాత, ఐపిటిఎ యొక్క మరొక అనుభవజ్ఞుడైన హేమంగా బిస్వాస్ స్మారక నివాళి అర్పించారు. ఈ సంఘటన ఆధారంగా బెంగాలీ నాటకం, రాడికల్ నాటక రచయిత ఉత్పల్ దత్ రాసిన కల్లోల్ ఒక ముఖ్యమైన రాజ్య వ్యతిరేక ప్రకటనగా మారింది. దీన్ని 1965 లో మొదటిసారి కలకత్తాలో ప్రదర్శించారు. ఇది ప్రదర్శించబడుతున్న మినర్వా థియేటర్‌కు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు; త్వరలోనే దీనిని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించింది. రచయిత చాలా నెలలు జైలు శిక్ష అనుభవించాడు. [24] [25]
జాన్ మాస్టర్స్ రాసిన భౌవానీ జంక్షన్ తిరుగుబాటు నేపథ్యంలో సాగుతుంది. పుస్తకంలోని అనేక భారతీయ, బ్రిటిష్ పాత్రలు తిరుగుబాటును, దాని చిక్కులను చర్చిస్తాయి.
అమల్ నీరద్ దర్శకత్వం వహించిన 2014 మలయాళ చిత్రం అయోబింటే పుస్తకం, కథానాయకుడు అలోషి ( ఫహద్ ఫాసిల్ ) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుదారుడుగా, తోటి తిరుగుబాటుదారుడుతో కలిసి ఇంటికి తిరిగి వస్తాడు.