ఐఎస్ఎస్ఎఫ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్
రిథమ్ సాంగ్వాన్ (జననం 2003 నవంబరు 29) హర్యానాకు చెందిన భారతీయ పిస్టల్ షూటర్.[1] ఆమె సాధారణంగా 10మీ ఎయిర్ పిస్టల్, 25 మీ పిస్టల్‌లలో పోటీపడుతుంది.[2] ఆమె జూనియర్, సీనియర్ స్థాయిలో షూటింగ్ ప్రపంచ కప్‌లు, షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలుచుకుంది.
మను భకర్, ఈషా సింగ్‌లతో కలిసి ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టులో భాగంగా ఆమె స్వర్ణాన్ని గెలుచుకుంది.[3][4]
ఆసియా క్వాలిఫయర్స్ మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్‌లో ఆమె 2024 జనవరి 11న కాంస్య పతకం సొంతం చేసుకుంది. దీంతో, ఆమె మూడు పతకాలు నెగ్గి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్టయింది.[5]
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న తండ్రి నరేందర్ కుమార్, తల్లి నీలం ఆమెను పిస్టల్ షూటింగ్ క్రీడలో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఫరీదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. 12 సంవత్సరాల వయస్సులో, రిథమ్ సాంగ్వాన్ మొదటిసారిగా న్యూ ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌ని సందర్శించి తన అభ్యాసాన్ని ప్రారంభించింది.[6] ఆమె మొదట్లో వినీత్ కుమార్ వద్ద శిక్షణ పొందింది.
తిరువనంతపురంలో జరిగిన 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మొదటిసారి ఆమె జాతీయ స్తాయి ఈవెంట్‌లో పాల్గొని, మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది.[7]
2023లో, ఆమె మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో జరిగిన భోపాల్ ప్రపంచ కప్‌లో పాల్గొంది.
మే 2023లో, ఆమె 1996 అట్లాంటా ఒలింపిక్ గేమ్స్ రజత పతక విజేత డయానా ఇర్గోవా నెలకొల్పిన 29 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.[8] రిథమ్ సాంగ్వాన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కూడా భారత్‌కు కాంస్యం సాధించిపెట్టింది.[9]