రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ | |
---|---|
స్థాపకులు | టిపి చంద్రశేఖరన్ |
స్థాపన తేదీ | 2008 |
రద్దైన తేదీ | 2016 |
ప్రధాన కార్యాలయం | ఒంచియం , వటకర |
రాజకీయ విధానం | సోషలిజం కమ్యూనిజం మార్క్సిజం-లెనినిజం |
రాజకీయ వర్ణపటం | వామపక్ష రాజకీయాలు |
రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ అనేది కేరళలోని రాజకీయ పార్టీ. దీనిని టిపి చంద్రశేఖరన్ స్థాపించాడు. ఇది నిజమైన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను సమర్థిస్తుందని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నిర్వహిస్తుందని పేర్కొంది.[1] 2008లో మాజీ సిపిఐ (ఎం) నాయకుడు టిపి చంద్రశేఖరన్‌ను అతని పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత ఇది స్థాపించబడింది.[2]
పార్టీ సిద్ధాంతాలను పలచన చేయడంపై రాష్ట్ర నాయకత్వంతో ఒంచియం ప్రాంతానికి చెందిన సీపీఐ (ఎం) సభ్యులు అనేక సంవత్సరాల తరబడి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆర్‌ఎంపీ పుట్టుకొచ్చింది. ఎర్రమల పంచాయతీలో సీపీఐ (ఎం) అధికార బృందం జనతాదళ్ (లౌకిక) పాలనకు మొగ్గు చూపడంతో విభేదాలు తీవ్రమయ్యాయి.[3]
2008లో, అధికారిక బృందం టిపి చంద్రశేఖరన్‌తో సహా సభ్యులను పార్టీ నుండి బహిష్కరించింది, దాని ఫలితంగా రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఏర్పడింది.[4] 2012 మే 4న సిపిఐ (ఎం) మద్దతుదారులుగా భావిస్తున్న కొందరు దుండగులు అతన్ని నరికి చంపారు. ఆ తర్వాత ఎన్.వేణు పార్టీ నాయకత్వాన్ని స్వీకరించాడు; టిపి భార్య కెకె రెమా కూడా పార్టీ ప్రధానపాత్రలో ఉంది.[5]
చంద్రశేఖరన్ 2009 లోక్‌సభ ఎన్నికలలో దాని అభ్యర్థిగా పోటీ చేశారు. అతని అభ్యర్థిత్వం, క్రియాశీలత ఫలితంగా 2009లో సిపిఐ (ఎం) వటకర లోక్‌సభ నియోజకవర్గాన్ని కోల్పోయింది.[6] కెకె రెమా 2016 కేరళ శాసనసభ ఎన్నికలలో వడకర అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.[7] 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో వారు యుడిఎఫ్ అభ్యర్థి కె. మురళీధరన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఎల్డిఎఫ్ అభ్యర్థి పి. జయరాజన్‌కి వ్యతిరేకంగా నిలిచారు. 2021 కేరళ శాసనసభ ఎన్నికలలో, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా కెకె రెమా వడకర నుండి ఎన్నికలలో గెలుపొందింది.[8]