లక్ష్మీ ఛాయా | |
---|---|
జననం | |
మరణం | 2004 మే 9 | (వయసు 56)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1958–1986 |
లక్ష్మీ ఛాయా (1948 జనవరి 7 - 2004 మే 9) మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, నర్తకి, నాట్య గురువు. హిందీ సినిమాలలో తన విలక్షణమైన పాత్రలలో నటించింది.
బాలనటిగా అనేక సినిమాలలో నటించిన లక్ష్మీ 1965లో వచ్చిన గుమ్నామ్ అనే హారర్ చిత్రం సినిమా మహమ్మద్ రఫీ పాడిన "జాన్ పెహెచాన్ హో"లో ముసుగు వేసుకున్న నర్తకిగా నటించి గుర్తింపు పొందింది. తీస్రీ మంజిల్ (1966), దునియా (1968), అయా సావన్ ఝూమ్ కే (1969), మేరా గావ్ మేరా దేశ్ (1971), రాస్తే కా పత్తర్ (1972) మొదలైన సినిమాలలో నటించింది.
1958 నుండి 1986 వరకు దాదాపు 100 సినిమాలలో నటించింది. ఆ తర్వాత డ్యాన్స్ టీచర్‌గా పనిచేసింది.
లక్ష్మీ ఛాయా 1948 జనవరి 7న మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది.
1958లో తలాక్ అనే సినిమాలో పాఠశాల బాలికగా నటించి సినిమారంగంలోకి ప్రవేశించింది. 1962లో నాటీ బాయ్ సినిమాలో బేలాగా నటించింది. 1965లో గుమ్నామ్ సినిమాలోని పాట ద్వారా భారతదేశం, అమెరికా అంతటా ఒక కల్ట్ ఫాలోయింగ్ పొందింది.[1] 1966లో తీస్రీ మంజిల్ సినిమాలో మీనాగా నటించింది.[2] 1967లో రామ్ ఔర్ శ్యామ్, బహరోన్ కే సప్నే, ఉపకార్, రాత్ ఔర్ దిన్ వంటి అనేక సినిమాలలో నటించి ప్రశంసలు పొందింది.
1968లో దునియా సినిమాలో లక్ష్మిగా నటించింది. 1969లో నటించిన అయా సావన్ ఝూమ్ కే సినిమా కమర్షియల్‌గా విజయం సాధించింది.[3] అదే సంవత్సరంలో, ప్యార్ కా మౌసమ్ అనే సినిమాలో కూడా నటించింది. 1971లో మేరా గావ్ మేరా దేశ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.[4] ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది, లక్ష్మీ ఉత్తమ నటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది.[5]
1972లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి రాస్తే కా పత్తర్ సినిమాలో నటించింది, "మెయిన్ షరాబ్ బెచ్టీ హూన్" పాటలో నృత్యానికి ప్రశంసలు అందుకుంది.[6] అదే సంవత్సరంలో దో చోర్, బిండియా ఔర్ బందూక్ అనే సినిమాలలో నటించింది. తరువాత దో ఫూల్ (1973), ధోతీ లోటా ఔర్ చౌపటీ (1975), షరాఫత్ చోడ్ డి మైనే (1976), హైవాన్ (1977) వంటి సినిమాలలో ఎక్కువ అతిథి పాత్రలు చేసింది. 1979లో పైజ్జెచా విదా సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది.
1987లో పరాఖ్ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన తర్వాత చిత్ర పరిశ్రమ నుండి విరమించుకుంది. స్వంతంగా ఒక డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించి, నిరుపేద పిల్లలకు డ్యాన్స్ నేర్పింది.
ఛాయా 56 సంవత్సరాల వయస్సులో 2004 మే 9న క్యాన్సర్ వ్యాధి కారణంగా ముంబయి నగరంలో మరణించింది.[7][8]