లక్ష్మీపతి బాలాజీ (జననం 1981 సెప్టెంబరు 27) భారతీయ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. అతను రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్. 2016 నవంబరులో ఫస్ట్-క్లాస్, లిస్ట్ A క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[1] ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని మాజీ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు అతను బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.
లక్ష్మీపతి బాలాజీ 1981 సెప్టెంబరు 27 న మద్రాసులో జన్మించాడు. 2013 లో మాజీ మిస్ చెన్నై పోటీల్లో పాల్గొన్న ప్రియా తాలూర్‌ను వివాహం చేసుకున్నాడు [2]
బాలాజీ 2003 లో ఫాస్ట్ మీడియం బౌలర్‌గా భారత క్రికెట్ జట్టులో చేరాడు. 2001 నుండి తన రాష్ట్ర జట్టుకు ఆడుతూ 2003 లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై తన తొలి టెస్టు ఆడాడు. 2004 ఇండియా పాకిస్తాన్ సిరీస్‌లో ప్రదర్శన తర్వాత అతను గుర్తింపు పొందాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.[3] కానీ గాయం కారణంగా, అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఆగిపోయింది. 2005 లో పాకిస్తాన్ జరిపిన భారత పర్యటనలో పునరాగమనం చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. మళ్ళీ గాయం కారణంగా తర్వాతి 3 సంవత్సరాల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. బాలాజీ 2007లో మళ్ళీ దేశీయ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు. 2008 లో తమిళనాడు జట్టు రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో బాలాజీ కీలకపాత్ర పోషించాడు. గజ్జ గాయంతో గాయపడిన మునాఫ్ పటేల్ స్థానంలో బాలాజీని జనవరి 2009 లో అంతర్జాతీయ జట్టులోకి పిలిచారు.[4] శ్రీలంకతో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో బాలాజీని ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు. [5] ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. తదుపరి ట్వంటీ-20 మ్యాచ్‌లో బాలాజీకి విశ్రాంతి ఇచ్చారు. ఫిబ్రవరిలో BCCI న్యూజిలాండ్‌లో పర్యటించే ODI జట్టు నుండి బాలాజీని తొలగించినట్లు ప్రకటించింది. అయితే అతను టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. [6] ఆ విధంగా 2004లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో చివరిసారిగా టెస్టు ఆడాక, ఐదు సంవత్సరాల విరామం తర్వాత బాలాజీ తిరిగి టెస్ట్ జట్టులోకి వచ్చాడు.
2012 జూలై 18 న అతన్ని 2012 సెప్టెంబరులో శ్రీలంకలో జరిగే ప్రపంచ T20 టోర్నమెంట్ కోసం 30 ప్రాబబుల్స్‌లో చేర్చారు. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన తుది జట్టులోకి ఎంపికయ్యాడు. చెన్నైలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ T20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. [7]
బాలాజీ 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడాడు. 2008 మే 10 న, అతను చెన్నైలో కింగ్స్ XI పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో IPL టోర్నమెంట్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసాడు. టోర్నమెంట్ చివరి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో షేన్ వార్న్, సోహైల్ తన్వీర్‌లకు బౌలింగ్ చేయడంతో ఆ టోర్నమెంటు యాత్ర చేదు జ్ఞాపకాలతో ముగిసింది. ఇంగ్లాండ్‌లో ప్రొఫెసర్. జాన్ డోవెల్ అతని వెన్నెముకకు ఆపరేషన్ చేసిన తరువాత మళ్ళీ పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. IPL చెన్నై సూపర్ కింగ్స్‌లోని అన్ని T20 మ్యాచ్‌లలో బాలాజీ మంచి ఎకానమీ రేట్ సాధించాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో అతను పెద్దగా రాణించలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్‌లో, 2009 ఏప్రిల్ 30 న రాజస్థాన్ రాయల్స్‌పై నాలుగు వికెట్లు పడగొట్టి బాలాజీ, చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయపథంలో నడిపించాడు.
ఐపీఎల్ 3వ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు. టోర్నమెంట్ గెలిచిన తర్వాత, ACLT20 ఆడిన తర్వాత, బాలాజీ టోర్నమెంట్‌లో చాలా ఆటలను ఆడాడు. అతని పొదుపైన బౌలింగ్‌ను భారత జట్టు కెప్టెన్ MS ధోనీ ప్రశంసించాడు. టోర్నమెంటులో CSK విజయానికి కారణాలలో అది కూడా ఒకటిగా అతను భావించాడు.
IPL నాల్గవ సీజన్లో, అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
IPL ఏడవ సీజన్‌లో, అతన్ని కింగ్స్ XI పంజాబ్ కొనుగోలు చేసింది.
బాలాజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ కోచ్, మెంటార్‌గా నియమితుడయ్యాడు. [8]
2018 IPL ఎడిషన్ కోసం, అతను చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు. [9] వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ 2022లో ఆ పోస్టు నుండి ఒక సంవత్సరం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే సూపర్ కింగ్స్ అకాడమీకి అందుబాటులోనే ఉన్నాడు. [10]