లాల్‌మోహన్ ఘోష్, (1849 -1909 అక్టోబరు 18 ) పదహారవ రాష్టపతి, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, బెంగాలీ న్యాయవాది, భారత జాతీయ కాంగ్రెస్ సహ వ్యవస్థాపకుడు.[1] ఘోష్ 1849లో వెస్ట్ బెంగాల్ లోని కృష్ణనగర్ పట్టణంలో పెద్దమనిషి రామలోచన్ ఘోష్ రెండవ కుమారుడుగా జన్మించాడు.ఘోష్ ప్రవేశ పరీక్షలో మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణుడైన తరువాత, 1869లో న్యాయవాదిగా అర్హత సాధించడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు. అతను 1870 నవంబరు 19న న్యాయవిద్య అభ్యసించటానికి మిడిల్ టెంపుల్‌లో చేరాడు.1873 జూన్ 7న న్యాయవాద వృత్తికి అర్హత పొందాడు.[2] అదే సంవత్సరంలో కలకత్తా బార్‌లో చేరాడు. అతని అన్నయ్య మన్మోహన్ ఘోస్ కూడా న్యాయవాది, భారతదేశంలో ప్రసిద్ధ రాజకీయ నాయకుడు.[3] బెంగాలీలకు సహజంగా ఘోష్ ఇంటిపేరుగా ఉంటుంది.
ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ మద్రాస్ సెషన్ (1903) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతని సామాజిక, రాజకీయ ఆదర్శాలు ఎక్కువగా విక్టోరియన్ ఇంగ్లాండ్ ఉదారవాద మానవతావాదం నుండి సంక్రమించాయి.అతను భారతదేశ ప్రజలకు పాశ్చాత్య విద్య ప్రాముఖ్యతను గట్టిగా విశ్వసించాడు. ప్రజలను ఒక దేశంగా ఏకం చేసే శక్తిగా అతను కాంగ్రెస్ మద్రాస్ సెషన్‌లో, తన రాష్ట్రపతి ప్రసంగంలో భారతదేశంలో తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అభ్యర్థించాడు. ఘోష్ ఇంగ్లాండ్, భారతదేశం మధ్య సంబంధాన్ని తెంచుకోవాలని ఎన్నడూ ఆలోచించలేదు, కానీ రాజ్యాంగ పద్ధతుల ద్వారా, భారతీయులకు బ్రిటీష్ రకం చట్టాలు, న్యాయం, హక్కులు, స్వేచ్ఛగా అభిప్రాయం వ్యక్తం చేయడం, వాణిజ్య అవకాశాల ద్వారా హక్కులు పొందడం అవసరమని, సేవ, ప్రజాస్వామ్య శాసన సంస్థలకు స్వతంత్రత ఉండాలని అతను గట్టిగా విశ్వసించాడు.[1]
1885లో, ఘోష్ లండన్‌లో కొత్తగా సృష్టించిన డిప్ట్‌ఫోర్డ్ పార్లమెంటరీ నియోజకవర్గం, లిబరల్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు.అయితే అతను తన ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికలలో నిలబడ్డ మొదటి భారతీయుడుగా గుర్తించబడ్డాడు. [4]
లాల్మోహన్ ఘోష్ 1909 అక్టోబరు 18న కోల్‌కతాలో మరణించాడు. [3]