వాణి విలాస సాగర జలాశయం ವಾಣಿ ವಿಲಾಸ ಸಾಗರ ಜಲಾಶಯ | |
---|---|
ప్రదేశం | చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | వేదావతి హగరి నది |
వాణి విలాస సాగర, (మారి కనివె గా సుపరిచితం) కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో హిరియుత్ తాలూకాలో నిర్మించబడిన ఆనకట్ట. ఇది రాష్ట్రంలో పురాతన ఆనకట్ట.
ఈ ఆనకట్టను మైసూరు మహారాజులు భారత స్వాంత్ర్యానికి పూర్వం వేదావతి నదిపై నిర్మించారు. ఈ మనోరంజకమైన నిర్మాణం ఆ కాలంలో ఇంజనీరింగ్ లో ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. మధ్య కర్ణాటక దక్కన్ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములైన పరిసర నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఇది నీటిని అందిస్తుంది.
ఈ ఆనకట్ట హిరియూర్, చిత్రదుర్గ ప్రాంతాల వారికి దేశీయ నీటి వనరుగా ఉంది. ఈ ఆనకట్ట కుడి, ఎడమ కాలువల ద్వారా హిరియూర్, చల్లకెరె తాలూకాలలోని 100 చదరపు కిలోమీటర్ల భూమి సాగు అవుతుంది. ఈ ఆనకట్ట స్థలం బెంగళూరు నుండి 160 కి.మీ దూరంలో 4వ నెంబరు జాతీయ రహదారి వద్ద కలదు. అదే విధంగా చిత్రదుర్గ నుండి 40 కి.మీ దూరంలో కలదు. ఈ ఆనకట్టను కీ.శే మహారాజా చామరాజ వొడయార్ సతీమణి రాజప్రతినిధిగా ప్రారంభించింది. ఆమె అనేక శ్రేష్టమైన సామాజిక కార్యక్రమాలు చేసేది. ఈ ఆనకట్ట నిర్మాణానికి ధనం చాలనందున మైసూరు మహారాజ కుటుంబాలు తమ ఆభరణాలను తాకట్టు పెట్టి డబ్బును సమకూర్చారు. కనుక ఈ ఆనకట్టకు "వాణి విలాస సాగర" అని పేరు వచ్చింది. "వాణి విలాస" అప్పటి మైసూరు మహారాజు చిన్న కుమార్తె. ఇది మైసూరులోని కె.ఆర్.ఎస్ ఆనకట్ట కంటే ఎత్తైనది.
మైసూరులో బ్రిటిష్ ప్రతినిధి సర్. మార్క్ కుబ్బన్ చే "మరి కనివె" నీటిపారుదల ప్రాజెక్టు ప్రారంభించబడినది. [1] 1897లో మైసూరు మహారాజు శ్రీ కృష్ణరాజ వొడయార్-4 ఆదేశాల ప్రకారం దివాన్ శేషాద్రి అయ్యర్ ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించాడు. [2]
ఈ ఆనకట్ట అనేక సంవత్సరముల నుండి పర్యాటకులకు ఆకర్షణగా నిలిచింది. కానీ ప్రధాన పర్యాటక కేంద్రంగా నిర్లక్ష్యం చెయ్యబడింది. ఇటీవల అటవీ శాఖ ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకొని అడవులను పురరుద్ధరించడం, పాత భారతీయ సాంస్కృతిక నేపథ్యానికి చెందిన ఒక ఔషధ మొక్కలను అభివృద్ధి చేసే "పంచవటి" తోటలను పెంచడం వంటి కార్యక్రమాలను చేసింది. దీనిని వారాంతపు పిక్నిక్ స్పాట్ గా మలచారు. ఔషథ మొక్కలు కల "పంచవటి" గార్డెన్స్ లో సాంస్కృతిక నేపథ్యాలకు ప్రాతినిధ్యం వహించే "ఋషులు", "సప్త స్వరాలు" వంటి అనేక రకాల మొక్కలు ఉన్నాయి.
చిత్రదుర్గ, హోస్‌దుర్గ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులు తప్పనిసరిగా అదే మార్గంలో ఉన్న "మరి కనివె" ఆనకట్టను సందర్శిస్తారు. చారిత్రిక నేపధ్యం గల మారికాంబ దేవాలయం కూడా ఇక్కడ ఉంది. ఇది పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆనకట్ట బెంగళూరు-ముంబై జాతీయ రహదారి లో ఉన్న హిరియూర్ పట్టణం నుండి 20 కి.మీ దూరంలో ఉంటుంది.
వాణివిలాస్ ఆనకట్ట కర్ణాటక ముఖ్యపట్టణం బెంగళూరు నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సుందరమైన ప్రదేశాన్ని చిత్రదుర్గతో కలిపి చూడటమే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రహదారిలో స్పష్టమైన సైన్ బోర్డులు లేవు. కానీ బెంగళూరు- పూణె హైవే మార్గంలో హిరియూర్ బైపాస్ వద్ద గల క్రాస్ రోడ్లలో కుడివైపు సుగర్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. దీనికి ఎదురుగా ఉన్న రోడ్డులో ఎడమవైపు నుండి నేరుగా 18 కి.మీ వెళ్తే మనం సులువుగా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. హిరియూర్ చేరిన తరువాత తరువాత 5 కి.మీ నెమ్మదిగా వెళ్ళి స్థానికులకు అడిగితే సరియైన మార్గాన్ని సూచిస్తారు. ఒకసారి ఈ మార్గంలోనికి మళ్ళిన తరువాత స్పష్టమైన సైన్ బోర్డులు కనిపిస్తాయి. హైవే నుండి ప్రక్కకు మళ్ళిన ప్రదేశం నుండి 20 కి.మీ దూరం వెళితే ఈ స్థలం వస్తుంది.