వాసిరెడ్డి ప్రదీప్ శక్తి సినిమా నటుడు, దర్శకుడు, వ్యాపారవేత్త. నాయకుడు(1987) సినిమాలో కరడుగట్టిన పోలీస్ అధికారి పాత్రతో పాపులర్ అయిన ఈయన పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలలోను, హాస్య పాత్రలలోను రాణించాడు. సినిమా రంగంలో అవకాశాలు బాగానే ఉన్న తరుణంలో 1993లోనే నటనకు స్వస్తిచెప్పి అమెరికాలోని న్యూయార్క్ లో హోటల్ వ్యాపారం ప్రారంభించాడు
ఇతడు గుంటూరులోని లక్ష్మీపురానికి చెందినవాడు.ఇతని తల్లి దండ్రులు సీతాదేవి, నాగేశ్వరరావు[1]. తండ్రి గుంటూరులో డాక్టర్‌గా పనిచేశాడు. ఇతడు పి.యు.సి వరకు చదువుకున్నాడు. మద్రాసులోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి బ్యాచ్‌లో నటనలో శిక్షణ పొందాడు. అంతులేని కథ సినిమాలో బస్ కండక్టర్‌గా మొదటిసారి తెరమీద కనిపించాడు. తరువాత కొన్ని సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. నాయకుడు సినిమాలో క్రూరమైన ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించడంతో అతనికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో వరుసగా ఇన్‌స్పెక్టర్ పాత్రలే లభించాయి. దానితో విసుగు చెంది వంశీ లేడీస్ టైలర్ చిత్రంతో హాస్యపాత్రలను ధరించడం మొదలు పెట్టాడు. ఇతడు సుమారు 170 చిత్రాలలో నటించాడు. రొటీన్ పాత్రలతో విసుగు చెంది నటనారంగాన్ని వదలుకొని 1990లలో అమెరికాలోని న్యూజెర్సీలో హోటల్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. చింతకాయల రవితో సినిమాలలో పునఃప్రవేశం చేశాడు. ఇతడు చివరగా సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో నటించాడు. ఇతడు కలియుగ విశ్వామిత్ర సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు.
ఇతడు 2016, ఫిబ్రవరి 20న అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశాడు[2].