విఏకే రంగారావు

రావు వెంకట ఆనందకుమార కృష్ణ రంగారావు ప్రసిద్ధ సంగీత రికార్డుల సేకర్త. విఏకే రంగారావుగా ప్రసిద్ధుడైన ఆయన సంగీతవేత్త, కళా విమర్శకుడు కూడా. బొబ్బిలి జమిందారీ వంశీయులైన వీఏకేఆర్ సొంతూరు చిక్కవరం.1930 లో మద్రాసులో పుట్టారు. చిన్నతనం నుంచీ నాట్యకళపై ఆసక్తి పెంచుకున్న వీఏకే ఆర్ 1960లో వళువూర్ రామయ్యపిళ్లై దగ్గర శిష్యునిగా చేరారు. అడయార్ కె.లక్ష్మణ్, శాంతా ధనుంజయ్ దంపతులతో పాటు కళానిధి నారాయణన్ నుంచి నాట్యకళ, అభినయాన్ని నేర్చుకున్నారు. తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం దగ్గర భరతశాస్త్రం నేర్చుకున్నారు. పుట్టింది రాజకుటుంబం కావడం వల్ల అప్పట్లో సామాన్యుల సహవాసం చేయొద్దని తల్లిదండ్రుల నుంచి ఆంక్షలు ఉండేవి. రాజమందిరంలో పనిచేసే దేవదాసీల వల్ల నాట్య కళ రుచి తెలిసింది. అనతికాలంలోనే ఆయన నాట్యంలో ఎంతో అనుభవమున్న నాట్యాచార్యునిగా, కళా విమర్శకుడిగా ఎదిగారు. 41 ఏళ్లనుండి తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో ఆషాఢ శుద్ధ సప్తమికి, పుత్తూరు సమీపంలోని కార్వేటి నగరం వేణుగోపాలస్వామి కృష్ణాష్టమి ఉత్సవాల్లో గజ్జెకట్టి అన్నమయ్య కీర్తనలతో జావళీలతో స్వామివార్లకు నృత్య కైంకర్యం చేస్తుంటారు. మరో ఆలాపన, త్రివేణి గ్రంథాలు రచించారు. 40 భారతీయ భాషలూ, 30 విదేశీ భాషలవీ మొత్తం 42 వేల గ్రామఫోను రికార్డులను సేకరించారు. ఈయనకు గుంటూరులో 24.7.2012న అయ్యంకి-వెలగా పురస్కారం ప్రకటించారు. 2022లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి విశిష్ట పురస్కారం - 2021 అందుకున్నాడు.[1]

బయటి లింకులు, వనరులు

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-12-02). "ఘనంగా తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం". www.ntnews.com. Archived from the original on 2022-12-03. Retrieved 2022-12-06.