విక్రమోర్వశీయము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. ఇది పురూరవుడు అను రాజు, దేవేంద్రుని ఆస్థాన నర్తకి అయిన ఊర్వశి ల ప్రణయగాథ. ఈ నాటకములోని నాయకుడు పురూరవుడు అయినప్పటికీ, చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నములలో ఒకడైన కాళిదాసు ఆయనపై గల ప్రేమ, గౌరవ భావముచే ఈ కృతికి ఆ పేరు పెట్టెనని కొందరి భావన. అయితే, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. విక్రమను "శౌర్యం" అనే అర్థంలో రాసాడని వాదన ఉంది. [1]
ప్రాథమిక కథాంశాన్ని ఋగ్వేదం లోని సంవాద సూక్తాలు, [2] మహాభారతం వంటి మూలాల నుండి అంశాలను తీసుకున్నప్పటికీ, కాళిదాసు తన రచనను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, నాటకకర్తగా తన ప్రజ్ఞను శేముషినీ వినియోగించి, గణనీయమైన అనుసరణలను చేశాడు.
కాళిదాసు రాసిన మూడు నాటకాల్లో విక్రమోర్వశీయం రెండవది. మొదటిది మాళవికాగ్నిమిత్రం, మూడవది అభిజ్ఞాన శాకుంతలం.
ఒకసారి ఊర్వశి, కుబేరుడి భవనం నుంచి తిరిగి వెళ్తూ తన కుమారుడు ఋష్యశృంగుణ్ణి విభాండక మహర్షి వద్ద వదలిపెడుతుంది. ఆమె చిత్రలేఖ, రంభ వంటి ఇతర అప్సరసలతో పాటు ఉంది. కేశిన్ అనే రాక్షసుడు ఊర్వశి, చిత్రాలేఖలను అపహరించి ఈశాన్య దిశలో వెళ్ళాడు. అప్సరసల బృందం సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించగా అది విన్న పురూరవుడు వారిద్దరినీ రక్షిస్తాడు. మొదటి చూపులోనే ఊర్వశి, పురూరవుడు ప్రేమలో పడతారు. అప్సరసలను వెంటనే తిరిగి స్వర్గానికి పిలుస్తారు.
పురూరవుడు తన పనిపై దృష్టి పెట్టలేక పోతాడు. అతను ఊర్వశి ఆలోచనలతో మునిగిపోతాడు. తనది అనాలోచిత ప్రేమ కాదుగదా అని అనుకున్నాడు. రాజును చూడటానికి అదృశ్య రూపంలో వెళ్ళిన ఊర్వశి, తన ప్రేమను ధ్రువీకరిస్తూ, భూర్జ పత్రంపై సందేశం పంపుతుంది.
దురదృష్టవశాత్తు, ఆ ఆకును గాలికి తీసుకువెళ్ళి, కాశీ యువరాణి, పురూరవుని భార్య అయిన రాణి ఔషినారి పాదాల వద్ద చేరుతుంది. రాణికి అది చదివి మొదట కోపం వస్తుంది, కాని తరువాత ఆమె ప్రేమికుల మార్గంలో అడ్డురానని ప్రకటిస్తుంది. ఊర్వశి పురూరవులు మాట్లాడుకోటాని కంటే ముందే, ఒక నాటకంలో ప్రదర్శన ఇవ్వడానికి ఊర్వశిని మళ్ళీ స్వర్గానికి పిలిచారు. ఆమె ఆ ప్రదర్శనను చాలా అన్యమనస్కంగా చేస్తుంది. పురుషోత్తముడి అని అనడానికి బదులు పురూరవుడు అని పొరపాటున అంటుంది. అందుకు శిక్షగా, ఊర్వశిని స్వర్గం నుండి బహిష్కరిస్తారు. ఇంద్రుడు, ఆమె ప్రియుడు బిడ్డను చూసుకున్న తరువాత శాప విమోచనం కలుగుతుందని దాన్ని సవరిస్తాడు. చివరికి పురూరవుడు జీవించినంత కాలం ప్రేమికులు భూమిపై కలిసి ఉండటానికి అనుమతి లభిస్తుంది.