విజయలక్ష్మి 1960 ఆగస్టు 2న ఎర్నాకుళం జిల్లా ములంతురుతి గ్రామంలో కుఴిక్కట్టిల్ రామన్ వేలాయుధన్, కమలాక్షి కుమార్తెగా జన్మించింది. ఆమె చోట్టానిక్కర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎర్నాకుళం లోని సెయింట్ తెరెసా కళాశాల, మహారాజాస్ కళాశాల నుండి తన విద్యను పూర్తి చేసింది. ఆమె జీవశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, కేరళ విశ్వవిద్యాలయం నుండి మొదటి ర్యాంక్తో మలయాళ సాహిత్యం మాస్టర్స్ పట్టా పొందారు. ఆమె ప్రముఖ మలయాళ కవి బాలచంద్రన్ చుల్లిక్కాడు వివాహం చేసుకుంది.[1]
ఆమె కవిత మొట్టమొదట 1977లో కలకాముడి వారపత్రికలో ప్రచురితమైంది. గ్రాడ్యుయేషన్ కాలంలో కేరళ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ లో కథా రచన, కవిత్వంలో బహుమతులు గెలుచుకుంది.[2]
మలయాళంలో ఆమె అనేక కవితలను ప్రచురించింది. కేరళ సాహిత్య అకాడెమీ కార్యనిర్వాహక కమిటీ, జనరల్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. అకాడమీలో అడ్వైజరీ బోర్డు మెంబర్ గా, పబ్లికేషన్ కమిటీ కన్వీనర్ గా పలు ఇతర పదవులు నిర్వహించింది. ఆమె సమస్త కేరళ సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసింది.
విజయలక్ష్మి రాసిన అనేక కవితలు లింగ సమానత్వాన్ని స్థాపించడానికి, మహిళలపై ఉన్న వైరుధ్యాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాయి. మలయాళ కవి బాలమణి అమ్మ యొక్క స్త్రీవాదానికి కొనసాగింపుగా విజయలక్ష్మిలో స్త్రీవాదం అనే భావనను సాహిత్య విమర్శకుడు ఎం. లీలావతి ప్రశంసించారు.