విజయ్ శేఖర్ శర్మ (జ. జూన్ 7, 1978) భారతీయ వ్యాపారవేత్త. ఇతను 1997 లో వన్97 కమ్యూనికేషన్స్ అనే పేరుతో ఒక సంస్థ ప్రారంభించాడు. దీని తరఫున 2010 లో పేటిఎం అనే డిజిటల్ చెల్లింపుల సంస్థను ప్రారంభించాడు.[1][2][3][4]
విజయ్ శేఖర్ శర్మ జూన్ 7, 1978 న ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జన్మించాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయుడు సులోమ్ ప్రకాష్, గృహిణి ఆశా శర్మ దంపతుల నలుగురు సంతానంలో మూడవవాడు.[5][6] అలీఘర్ సమీపంలోని హర్దుగాంజ్ అనే చిన్న పట్టణం నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు.[7] అతను ఒక బాలమేధావి గా పేరు పొందాడు. 15 సంవత్సరాల వయస్సులో కళాశాల విద్య పూర్తి చేసి 19 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ) నుండి B.Tech డిగ్రీతో ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యాడు.[8][9][10]