విజయ్ సి. కుమార్ | |
---|---|
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా సినిమాటోగ్రాఫర్ |
తల్లిదండ్రులు |
|
విజయ్ సి. కుమార్ తెలుగు సినిమా సినిమాటోగ్రాఫర్. 2008లో గోదావరి సినిమాకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు.[1] వినూత్నమైన లైటింగ్ వాడకం, సబ్జెక్ట్ స్పెసిఫిక్ విజువలైజేషన్, తెరపై సహజ రంగుల వాడకం, టెలి-ఫోకస్ షాట్స్ వంటి మరెన్నో పద్ధతులలో పేరుగాంచాడు. వివాహ భోజనంబు (1988), అమ్మోరు (1995), ఆగ్రహం (1991), డాలర్ డ్రీమ్స్ (1999), ఆనంద్ (2004), హ్యాపీ డేస్ (2007) మొదలైన సినిమాకు ఛాయాగ్రహణం అందించాడు.
విజయ్ కుమార్ తండ్రి సి. నాగేశ్వరరావు కూడా పేరొందిన సినిమాటోగ్రాఫర్. నాగేశ్వరరావు పాండవ వనవాసం, పరమానందయ్య శిష్యుల కథ, గుడిగంటలు, ఆస్తులు అంతస్తులు (1969), ఆరాధన మొదలైన సినిమాకు ఛాయాగ్రహణం చేశాడు. విజయ్ తల్లిపేరు సి. సనాధన.[2] తన తండ్రి అడుగుజాడల్లో కొనసాగాలన్న ఉద్దేశంతో పదమూడేళ్ళ వయసులో అప్రెంటిస్‌గా శారదా ఎంటర్‌ప్రైజెస్ (ప్రస్తుతం ఆనంద్ సినీ సర్వీసెస్ అని పిలుస్తారు) ఔట్ డోర్ విభాగంలో చేరాడు.[3]
ఎస్. వెంకటరత్నం, వి. ఎస్. ఆర్. స్వామి, రవికాంత్ నాగాఇచ్, ఎస్.ఎస్. లాల్, ఎస్. గోపాలరెడ్డి తదితర సినిమాటోగ్రాఫర్స్ దగ్గర విజయ్ కుమార్ పనిచేశాడు. అలాగే ఎనిమిది సంవత్సరాలపాటు హిందీ సినిమారంగంలో షోమందర్ రాయ్, ఇషాన్ ఆర్య, బాబా అజ్మీ, బెహ్రాన్ ముఖర్జీ మొదలైనవారి దగ్గర ప్రావీణ్యం సంపాదించారు. 1984లో లోక్ సింగ్ ఆధ్వర్యంలో కొన్ని సినిమాలకు విజయ్ ఆపరేటివ్ కెమెరామెన్‌గా చేరాడు. నిర్మాత జయకృష్ణ నిర్మాణంలో జంధ్యాల దర్శకత్వం వహించిన వివాహ భోజనంబు (1988) సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విజయ్ కుమార్ కు అవకాశం వచ్చింది. తరువాత టీంతో నీకు నాకు పెళ్ళంట సినిమాకి కూడా పనిచేశాడు.
నిర్మాత శ్యామ్ ప్రసాద్ నిర్మించిన అంకుశం (1990) సినిమాకి (అధికారిక సినిమాటోగ్రాఫర్ కె.ఎస్. హరి) మిగిలిన భాగంకోసం విజయ్ పనిచేశాడు. ఆ తరువాత ఆగ్రహం (1991), అమ్మోరు (1995) సినిమాలకు పనిచేశాడు. అమ్మోరు సినిమా టెక్నికల్ గా పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. తరువాత బాచిలర్స్, సంపంగి, శ్రీవారంటే మావారే, జై భజరంగబలి వంటి అనేక విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు.
డాలర్ డ్రీం కోసం పనిచేసినప్పుడు శేఖర్ కమ్ములను కలిశాడు. అలా మొదలైన వారి ప్రయాణం ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, అనామిక, ఫిదా, లవ్ స్టోరీ వంటి అనేక సూపర్ హిట్స్ సినిమాలు కొనసాగుతోంది.[4][5] అనామిక సినిమా నీ ఎంగే ఎన్ అన్బే అనే పేరుతో తమిళనాడులో కూడా విడుదలైంది.[6]