వీరభద్ర స్వామి దేవాలయం | |
---|---|
గోపురం | |
పేరు | |
స్థానిక పేరు: | వీరభద్ర దేవాలయం |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా: | శ్రీ సత్యసాయి జిల్లా |
ప్రదేశం: | లేపాక్షి |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | వీరభద్రుడు |
నిర్మాణ శైలి: | ద్రావిడ నిర్మాణ శైలి |
వీరభద్రస్వామి దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి వద్ద ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.[1] నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకొని ఉన్న రాముడు, కృష్ణుడు పురాణ గాథలకు సంబంధించినవి ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరాలుతుంది.
ఇక్కడ వున్న వీరభద్ర స్వామి దేవాలయం (లేపాక్షి) నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా "లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయా" నికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది.[2][3] ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరింది.[4] [5]ఈ దేవాలయం లేపాక్షి నగరానికి దక్షిణవైపు నిర్మింపబడింది. ఈ దేవాలయం తాబేలు ఆకారంలో గల గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో నిర్మింపబడింది. కనుక దీనిని "కూర్మ శైలం" అంటారు.
ఇచట గల బసవయ్య 15 అడుగులు ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మండమైన విగ్రహం. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కాందపురాణం తెలియ చేస్తుంది. ఇక్కడ గల పాపనశేశ్వర స్వామిని అగస్త్య మగర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఒకరికి ఒకరు ఎదురుగా పాపనశేశ్వరుడు, రఘునతమూర్తి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు, రమణీయమైన ప్రదేశం. సీతమ్మవారిని అపహరించికొని పోతున్న రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాములవారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే! పక్షి! అని మోక్షం ప్రసాదించిన స్థలం. అందువల్లనే క్రమంగా లేపాక్షి అయ్యింది అని స్థల పురాణం చెబుతుంది.
ఈ ఊరు శ్రీ కృష్ణదేవ రాయలు కాలములో మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలం. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేది. ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ప్రశాంతముగా డేవుని కొలిచేవారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించాడు. ఈ లేపాక్షి దండకారణ్యం లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించారని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారం జరిగింది. శ్రీరాముడు ఉత్తరం నుండి దక్షిణానికు వచ్చాడని కొందరంటారు.
పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది.
ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని సా. శ. 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈ వీరభద్రాలయం కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా, రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట. ఆలయ నిర్మాణం మూడింట ఒక వంతు ఆగిపోవడం ఇందువల్లనే అంటారు. ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలం కూర్మ శైలం అనే పేరుగల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారాలుగల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన నాలుగు ప్రాకారాలు కాలగర్భమున కలసిపోయాయివని అంటారు. ప్రాకారం గోడలు ఎత్తైనవి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు మలచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడతాడు. వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు కలంకారి చిత్రాలతో తీర్చిదిద్దబడ్డది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి శిల్పుల కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక.[6][7]
లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్బుతమైన చిత్రాలతో నిర్మించబడింది. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనం గొప్పదనం- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనం కూడా చూడవచ్చు. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, వీరభద్ర, వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపం పైకప్పు లోభాగాన మహాభారత, రామాయణ పౌరాణిక గాథల లిఖించారు. వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలతో అలంకరించారు. పార్వతీ పరిణయం, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారం, శివ తాండవం లోని ఆఖ్యాయికలు గాథా విషయాలుగ చేర్చబడినవి. గౌరీ ప్రసాద శివుడను చిత్తరువున పద్మములు మీసములతో జటాజూటము నుండి ప్రవహించు గంగను మరుగుపరుపజూచుచు శివుడు పార్వతి చిబుకములపై చేయుడి బుజ్జగించుట, పార్వతి ప్రణయ కోపం, పరిణయమునకు ముందు పార్వతీ అలంకారం, పార్వతీ పరమేశ్వరులు చదరంగమాడుట, శివుడు అంధకాసుర సంహారమొనర్చుట ముఖమున శాంతి, కరమున శూలం పెట్టి రుద్రుడు మొఖము, శివుని భిక్షాటన, నటేశుని ఆనందతాండవం, దక్షిణామూర్తి మొదలగు చిత్రాలు చూచువారిని ముగ్ధులు గావిస్తాయి. విష్ణువాలయమున మధ్య విష్ణువును, చుట్టు దశావతారములను చిత్రించారు. లేపాక్షి శిల్పాలు అనల్పములు. 60 కాళ్ళ ముఖ మంటపం లోని స్తంభాల మీద పూర్ణకృతులగు సంగీతకారులయ, నటులయ మూర్తులను విజయనగర కీర్తిని తీర్చారు. బ్రహ్మ మద్దెలను, తుంబురుడు వీణెను, నందికేశ్వరుడు హుడుక్కను మరియొక నాట్యచార్యుడు తాళమును వాయింప రంభ నాట్య మాడుట ఒకచోట చిత్రించారు.
ఇచ్చట గుట్టవంటి ఏకశిలను బసవేశ్వరుడుగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవడు బహుకొద్దిచోట్లమాత్రమే ఉన్నాయి. ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ ఉంది. పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపం ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపం విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది.
శిల్పాలంకారములు-ముఖ్యముగా చెట్లను పెకలించబోయే ఏనుగులను-పరిశీలిస్తే శ్రీశైలం దేవాలయ ప్రాకరశిల్పాల పోలిక చాలా కనబడుతుంది. పంచముఖ బ్రహ్మ ఇక్కడి ప్రత్యేకత.శిల్పరూపాలు- స్తంభాలకు చేరా చెక్కినవి, ఇంచుమించు నాలుగైదు అడుగులవి ఇక్కడ కనబడుతాయి. రెడ్డిరాజులు కోరుకొండ, దాక్షారామం, పలివెల దేవాలయాలలోని స్తంభాలతో తమ శిల్పాకృతులను చెక్కించారు. తాడిపత్రి రామలింగేశ్వరాలయపు గోపురముమీద శిల్పి విగ్రహం, తిమ్మరసు విగ్రహం ఉన్నాయి. అయితే, మందవ స్తంభాలకు చేరా చెక్కించిన విగ్రహాలు ఇంత పెద్దవి ఇతరచోట్ల కానరావు.వీటిని చూచి అహోబిల దేవాలయ మండపములో తిరుమల దేవరాయలూ, సోమపాలెం చావడిలో పెద్ది నాయకుడూ పెద్ద విగ్రహాలూ చెక్కించారు, మధుర మీనాక్షి దేవళములో తిరుమల నాయకుడు ఈ అలవాటును బ్రహ్మాండంగా పెంచాడు. లేపాక్షి ఆలయం లోని నాగలింగమంతటిదీ, లేపాక్షి నంది అంతటిదీ భారతదేశం మరొకచోట లేవు. అజంతా తరువాత లేపాక్షి మండపాలలో కప్పులమీద చిత్రించిన రూపాలంతటి బృహద్రూపాలు మరిలేవు. లేపాక్షి అర్ధ మండపములో కప్పుమీది వీరభద్రుదంతటి పెద్ద వర్ణ చిత్రం భారతదేశములో మరొకచోట లేదు. కళాకారులు జైనులే అయినా, శిల్ప, చిత్రకళా బృహద్రూపాలలో కోడము విజయనగర కళా ప్రభావమే. కళాకారులు జైనులనుటకు పలు నిదర్శనాలు కనబడుతున్నవి. లేపాక్షి వర్ణ చిత్రకారులు వర్ణలేపనములో, విన్యాసాలలో, దీర్ఘచిత్రాలలో, వస్త్రాలంకార సామాగ్రులలో జైన చిత్ర కళాసంప్రదాయాల్నే పాటించారు.శిల్పులు దేవతల వాహనాల్ని జైన తీర్ధంకురుల చిహ్నాల సైజులో చెక్కారు. స్త్రీల నగ్నత్వం చాలా అరుదు లేపాక్షిలో. పెనుకొండ పెద్ద జైన విద్యాస్థానం.ఈనాటికీ రెండు జైన ఆలయాలు పూజలందుకుంటున్నవి.విరుపణ్ణ పెనుగొండ నాయంకరం పొందినవాడు.కళాకారులు అక్కడివారే కావడం వింతకాదు. లేపాక్షిలో శిల్పం, చిత్రకళా సమ సంప్రదాయాలతోనే సాగాయి.మూడుకాళ్ళ భృంగీ, ఆరుచేతుల స్నానశివుడూ అవుననే తార్కాణం.
లేపాక్షి వర్ణచిత్రాలలో ఆనాటి ఆచారాలు ప్రతిబింబిస్తాయి. అవి కేవలం సంప్రదాయక చిత్రాలేకావు. సమకాలిక చిత్రాలని అనవచ్చును. స్త్రీల పాపిటసరములూ, శిరోజములలో విడిపోవులూ, రెండు పొరల పైటలూ, కైవార హస్తములూ, ఉద్యోగుల, నాయకులూ , శిల్పాలూ, చిత్రకారుల,,ఉష్ణీషాలూ, దుస్తులూ ఆనాటివే.
వరుపణ్ణి తండ్రిపేరు నంది లక్కిసెట్టి. లేపాక్షిలో ఒక రాతిగుట్టను 30 అడుగుల పొడవూ, 18 అడుగుల ఎత్తూ గల నందిని చెక్కించాడు. విరుపణ్ణ ఆతని సోదరుడు వీరణ్ణ గొరవనహళ్ళిలో లక్ష్మీ ఆలయం కట్టించాడు. విరుపణ్ణ వీరభద్రాలయం అర్ధ మండపం ఈశాన్యమూల తమ కులమునకు మూల పురుషుడైన కుబేరుని కొడుకు కోడలుని - రంభా నలకుబేరులను చెక్కించాడు. రంభ నట్టువరాలు దుస్తులతో ఉంది.నలకుబేరుడు విష్ణు ధ్రమోత్తరములో చెప్పినట్లు కోరలతో ఉన్నాడు. ఇటువంటి శిల్పాలు చాలా అరుదుగా ఉంటాయి.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)