15°43′20″N 76°57′50″E / 15.7222°N 76.9639°E
వేదావతి హగరి నది హగరి | |
---|---|
![]() వేదావతి నదిపై వాణీవిలాస్ ఆనకట్ట | |
![]() |
వేదావతి హగరి నది (వేదావతి నది) భారతదేశ నది. ఇది పడమటి కనుమలలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదికి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగరి అని కూడా పిలుస్తారు. సహ్యాద్రి పర్వత శ్రేణి తూర్పు భాగంనుండి వస్తున్న వేద, అవతి నదులు తూర్పు వైపు ప్రవహించి "పూర" వద్ద కలసి వేదవతి నదిగా ఏర్పడుతుంది. ఈ నది ఒడ్డున అనేక ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో హొసదుర్గ తాలూకాలోని కొల్లేడు వద్ద శ్రీఆంజనేయ దేవాలయం ముఖ్యమైనది. ఈ నదిపై వాణి విలాస సాగర ఆనకట్ట నిర్మింపబడింది. ఇది శతాబ్దం నాటిది. ఈ ఆనకట్టను "మరికనివె" అని కూడా పిలుస్తారు. ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిన మొదటి ఆనకట్ట. ఇది రెండు పర్వతాల మధ్య నిర్మించిన సహజసిద్ధ ఆనకట్టగా గుర్తింపు పొందింది.
దీని ఉపనదిని "సువర్ణముఖి" అని పిలుస్తారు. ఈ రెండునదుల సంగమం హిరియుత్ తాలూకాలోని కూడలహళ్ళి వద్ద జరుగుతుంది. ఈ ప్రాంతం స్థానికులచే "పుణ్యభూమి" లేదా "పవిత్ర భూమి"గా పిలువబడుతుంది. వేదవతి నది హరియూర్ నుండి ప్రారంభమై నారాయణపుర, పరశురామపుర, వృందావనహళ్ళి, అచట నది వృత్తాకార మార్గంలో ప్రవహించి, తరువాత జాజూర్ (మూదల జాజూర్) నాగగొండహళ్ళి, జానమద్ది ల గుండా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ లో భైరవాని తిప్ప డ్యాం వద్ద ప్రవేశిస్తుంది. నాగగొండహళ్ళి వద్ద నది ఒడ్డున చిలుమెస్వామి పేరుగల ప్రముఖ గణితజ్ఞుడు ఉన్నాడు. అతడు అవధూత. ఆ ప్రాంతంలో ప్రతీ సంవత్సరం ఉత్సవంజరుగుతుంది.
లక్షల సంఖ్యలో ప్రజలు ఈ ప్రాంతానికి సందర్శిస్తూ ఉంటారు. వేదవతి నదికి రెండవ వైపు జాజూర్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో కరియమ్మ, ఆంజనేయ, శివుడు, శ్రీ కోదనాడ రామలక్షణ సీతా ఆంజనేయ, నాగరకట్టె, శ్రీ శంకరాచార్య దేవాలయాలున్నాయి.
ఈ నది దక్షిణవైపున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుంది. అక్కడ ఈ నదిని "హగరి" అని పిలుస్తారు. హగరి నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజకు ఎక్కువగా ఈ నదిపై ఆధారపడతారు కనుక ఈ నదికి సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఈ నదిపై బైరవాని తిప్ప ఆనకట్టను నిర్మించారు[1].వేదవతి నది కర్ణాటక నుండి బయలుదేరి గుండలపల్లి, వేపురాల, ఇతర బీడుభూములలో ప్రవహించి చివరకు తుంగభద్ర నదిలోకలుస్తుంది.ఈ నది తుంగభద్ర నదికి ఉపనది. ఇది తుంగభద్రానదిలో సిరుగుప్ప వద్ద కలుస్తుంది.
వేదావతి నది అనంతపురం జిల్లా లోని రాయదుర్గం, కల్యాణ దుర్గం నియోజకవర్గాల్లో 200 గ్రామాలకు దాహం తీర్చే నది. ఇది ప్రస్తుతం ఇసుక మేటలు వేసి ఎడారిని తలపిస్తోంది. పైనున్న కర్ణాటక రాష్ట్రంలో అక్రమంగా కట్టిన డ్యామ్‌ల వల్ల ఇంతటి ఘోర దుస్థితికి చేరుకున్న వేదావతి హగరి నదికి మళ్లీ ప్రాణం పోసేందుకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా జలయోధుడుగా పేరొందిన రాజేంద్ర సింగ్ రంగంలోకి దిగాడు.
కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలోని బాబాబుడేన్‌గిరి కొండల్లో పుట్టిన వేదావతి హగరి, అనంతపురం జిల్లాలో గుమ్మఘట్ట మండలంలో ప్రవేశించి రాయదుర్గం, బెళగుప్ప, బ్రహ్మసముద్రం, డీ హీరేహాళ్, కళ్యాణదుర్గం, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల మీదుగా ప్రవహిస్తోంది. ఈ నదికి ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో పరీవాహక ప్రాంతం ఉంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో అధిక గ్రామాలు తాగునీటికి ఈ నదిపైనే ఆధారపడ్డాయి. భైరవానితిప్ప ప్రాజెక్టును ఈ నదిపైనే నిర్మించారు. మన రాష్ట్రంలో 72 కిలోమీటర్ల పొడవున ప్రవహించి తుంగభద్రలో కలిసే ఈ నది 20 ఏళ్ల క్రితం వరకూ ఎప్పుడూ నీటితో కళకళలాడేది. ప్రస్తుతం ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. వేదావతి హగరి నదిలో నిల్వ ఉన్న ఇసుక నిర్మాణాల అవసరాల కోసం తరలిపోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న వేదావతి హగరి నదికి ఉన్న 238 వాగులు వంకలకు పునరుజ్జీవం పోసేందుకు రాజేందర్ సింగ్ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎగువన కర్ణాటక నుంచి నీరు వచ్చే అవకాశం లేనందున పరీవాహక ప్రాంతంలోని నీటివనరులకు జీవం పోసే దిశగా ప్రయత్నిస్తున్నాడు. అలాగే నదిలో అడ్డంగా ఎనిమిది చోట్ల సర్‌ప్లస్ డ్యాంలను నిర్మించి నీటిని నదిలో ఇంకింపజే యాలనీ సూచించారు. ఇప్పటికే గుమ్మఘట్ట మండలంలోని భూపసముద్రం గ్రామం వద్ద రూ. 1.82 కోట్లతో సర్‌ప్లస్ డ్యాం నిర్మించేందుకు ఆయన భూమి పూజ చేశాడు. నది భూగర్భంలో వర్షం నీటిని ఇంకింపజేయడానికి తొలి ఐదేళ్లలో చేయాల్సిన ప్రణాళికలను ఆయన రచిస్తున్నాడు. అందుకు ఆర్‌డీటీ స్వచ్ఛందసంస్థ సహాయం తీసుకుంటూనే రాజేందర్ సింగ్‌కు చెందిన తరుణ్‌భారత్ సంఘ్ సంస్థ పూర్తిగా బాధ్యత వహించి పనులను చేపడుతుంది.[2]
ఈ నది చిక్‌మగుళూరు జిల్లాలో వేసవి కాలంలో ఎండిపోతున్నందున, రాష్ట్రప్రభుత్వం ఈ నదిని పురరుజ్జీవనం చేయాలని నిర్ణయం తీసుకుంది. గత 20 సంవత్సరాలుగా ఈ నది వర్షాకాలంలో పుష్కలమైన నీటితో ప్రవహిస్తుంది. కానీ నీటి వనరులను దోచుకోవడం వలన, సరైన ప్రణాళికలు లేనందున వేసవి కాలంలో పూర్తిగా ఎండిపోతుంది. ఈ ప్రణాళికలో జలగ్రహణ బావులు, ఇంజెక్షన్ బావులు, చెరువులు వంటి 810కి పైగా నీటిపారుదల నిర్మాణాలు ఉన్నాయి.[3]
హోళగుంద మండలం గూళ్యం సమీపంలోని వేదవతి నది (హగరి) పై గూళ్యం సమీపంలో ఒక జలాశయం, మొలగవల్లి గ్రామం వద్ద మరో జలాశయం నిర్మించి వేదవతి నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు తాగునీటికి కూడా ఇబ్బందులు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు సర్వే, పరిశోధనకు అనుమతి ఇస్తూ రూ.2.65 కోట్లు విడుదల చేసింది.[4]
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన బసరకోడు గ్రామాల సరిహద్దు గ్రామల ప్రజలకి జీవనోపాదితోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి వేదవతి నదిఫై హై లెవెల్ వంతెన నిర్మాణం పని చేపట్టవలసిందిగా అప్పటి కర్నూల్ ఎం.పి.రేణుక, కేంద్రరోడ్ రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారికి వినతిపత్రం ఇచ్చారు.[5]