వైవస్వత మనువు

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము" నడుస్తున్నదని, ఈ మన్వతంతరానికి అధిపతి వైవస్వత మనువు అని పురాణాల కథనం. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.

ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది. వివస్వంతుని భార్య సంజ్ఞ. వారి పుత్రుడు సత్యవ్రతుడు లేదా వైవస్వతుడు. అతడే వైవస్వత మనువు అయ్యాడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.

ఈ మన్వంతరంలో భగవంతుడు కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఇంద్రుడు - పురందరుడు. సురలు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు

వైవస్వత మనువు భార్య శ్రద్ధ. వారికి తొమ్మండుగురు పుత్రులు - ఇక్ష్వాకుడు, శిబి, నాభాగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. అయితే ఆ పుత్రులు జన్మించడానికి ముందే వైవస్వతుడు పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. ఆయజ్ఞంలో హోత మంత్రాలలో చేసిన పొరపాటు వన వారికి "ఇల" అనే కుమార్తె కలిగింది. వశిష్ఠుని వరం వలన ఆ కుమారి "సుద్యుమ్నుడు" అనే పురుషునిగా మారి, ప్రభువయ్యాడు. (కనుక వైవస్వత మనువునకు 10 మంది పుత్రులు అనవచ్చును). కాని పార్వతీదేవి చేత శాపగ్రస్తమైన ఒక వనంలో ప్రవేశించినపుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారి, బుధునితో సంగమించి "పురూరవుడు" అనే కుమారుని కన్నది. తండ్రి (తల్లి) అనంతరం పురూరవుడు రాజయ్యాడు.

వైవస్వత మనువు మరొక పుత్రుడైన పృషధ్రుడు తమ కులగురువైన వశిష్ఠుని వద్ద ఆలమందల కాపరిగా ఉన్నాడు. ఒకమారు చీకటిలో చేసిన పొరపాటువలన గోవు మరణించగా శాపగ్రస్తుడయ్యాడు. అయినా గాని భగవధ్యానం వదలకుండా సాగించి మోక్షం పొందాడు. కలి అనే మనుపుత్రుడు కూడా వైరాగ్యంతో రాజ్యవిరక్తుడై ధ్యానతత్పరుడై భగవత్సాన్నిధ్యం పొందగలిగాడు. మనువు మరొక పుత్రుడు కారూశుని వంశంవారు "కారూశులు" అనే క్షత్రియులుగా ఉత్తర భారతదేశపు ఏలికలయ్యారు. దృష్టుని సంతానం "భార్యట వంశం"గా బ్రాహ్మణ వ్రతం పాలించి బ్రాహ్మణులయ్యారు. వీరిలో అగ్నివేశుడు అనే అతని పేరుమీద అగ్నివేశ్యాయనం అనే బ్రాహ్మణవంశం కలిగింది.

దిష్టుని పుత్రుడు నాభాగుడు కృషి, గోరక్షణాది వ్యాపారాలను చేబట్టి వైశ్యుడయ్యాడు. అతని వంశంలోని వాడే అయిన మరుత్తుడు క్షత్రియ కర్మలు చేబట్టి క్షత్రియుడయ్యాడు. మరుత్తుని వంశంలో తృణబిందువు, ఐలబిలుడు వంటి ప్రసిద్ధులున్నారు. ఐలబిలుడు "కుబేరుడు" అనే పేరుమీద ఉత్తరదిక్కుకు పాలకుడయ్యాడు. మనువు మరొక పుత్రిక శర్యాతికి సుకన్య అనే కుమార్తె జనించింది. ఆమె చ్యవనమహర్షిని పెండ్లాడింది. మరొక మనుపుత్రుడు నభగుని కొడుకు నాభాగుడు ఉత్తమధర్మమూర్తి, పండితుడు. అతనికి పుత్రుడు అంబరీషుడు ఉత్తమ విష్ణుభక్తుడు.

వైవస్వత మనువుకు ఒకసారి తుమ్ము వచ్చినపుడు ముక్కు రంధ్రంనుండి వెలువడిన బిడ్డ ఇక్ష్వాకుడు ఇక్ష్వాకు వంశమునకు మూలపురుషుడయ్యాడు. ఇక్ష్వాకు కులతిలకుడే ధర్మమూర్తియైన శ్రీరామచంద్రుడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు
  • శ్రీ మన్మహా భాగవతము - ఆచార్య జోస్యుల సూర్యప్రకాశరావు - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్, రాజమండ్రి