వ్యాపం కుంభకోణం, మధ్యప్రదేశ్లో వెలుగుచూసిన వైద్య విద్య ప్రవేశానికి సంబంధించిన కుంభకోణం. ఇందులో అనేక రాజకీయ నాయకులు, పై స్థాయి అధికారులు, వ్యాపారవేత్తలు భాగస్వాములని తెలుస్తోంది. వ్యాపం అనేది వ్యావసాయిక్ పరీక్షా మండల్ అనే పేరు గల మధ్యప్రదేశ్ వృత్తి విద్యా కోర్సుల పరీక్ష నిర్వహణ బోర్డు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం కింద పని చేసే స్వయం ప్రతిపత్తి, స్వంత ఆర్థిక హక్కులు గల సంస్థ. ఈ సంస్థ మధ్య ప్రదేశ్ లో జరిగే అన్ని వృత్తి విద్య ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్య సంస్థలలో ప్రవేశం జరుగుతుంది. అనర్హులైనవారు మధ్యవర్తుల ద్వారా రాజకీయ నాయకులకు, వ్యాపం ఉద్యోగులకు లంచమిచ్చి పెద్ద ర్యాంకులు తెచ్చుకోవడం ఈ కుంభకోణంలో వెలుగు చూసింది.
90వ దశకంలోనే ఈ పరీక్షలలో జరుగుతున్న అవకతవకలపై కేసులు నమోదయ్యాయి. 2000లో మొదటి ఎఫ్ఐఆర్ నమోదయింది. కానీ 2009 వరకూ ఇవన్నీ ఒకే సంస్థ ద్వారా జరుపబడుతున్న ఒక ఉద్దేశ్యపూర్వక చర్యగా పరిగణించలేదు. 2009లో ఒకే సారి పెద్ద స్థాయిలో ప్రిమెడికల్ టెస్టుకు సంబంధించి ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి విచారణ జరిపింది. 2011లో ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా వందకు పైగా నిందితులని మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కుంభకోణం అసలు రంగు 2013లో ఇందౌర్ పోలీసులు 20 మందిని అరెస్టు చేసినపుడు కానవచ్చింది. ఈ 20 మంది వేరొకరి స్థానంలో 2009లో ప్రిమెడికల్ టెస్ట్ కు హాజరయ్యారు. ఈ అరెస్టైన వారి విచారణ ద్వారా ఈ కుంభకోణానికి ముఖ్య వ్యక్తి అయిన జగదీష్ సాగర్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఈ కుంభకోణం విస్తృత విచారణకు 2013 ఆగస్టు 26న రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ బలగాన్ని (స్పెషల్ టాస్క్ ఫోర్సుని) నియమించింది. తదుపరి విచారణల్లో ఎందరో రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులూ, వ్యాపం ఉద్యోగులు, కుంభకోణం నడిపిన మధ్యవర్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు బయటకు వచ్చాయి. జూన్ 2015 నాటికి 2000 మందికి పైగా అరెస్టయ్యారు.వీరిలో రాష్ట్ర మాజీ విద్య మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఇంకా వంద మందికి పైగా రాజకీయ నాయకులు ఉన్నారు. జూలై 2015లో దేశ అగ్ర న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సీబీఐకు ఈ కేసును విచారణ నిమిత్తం బదిలీ చేసింది.
వ్యాపం సంస్థ ప్రభుత్వ సంస్థలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి వృత్తి విద్యా కోర్సులకు ప్రవేశాలు నిర్వహించేందుకు బాధ్య సంస్థ.[1]
వ్యాపం కుంభకోణం ద్వారా పరీక్షార్థులు, ప్రభుత్వోద్యోగులు, మధ్యవర్తుల మధ్య గూడుపుఠాణీ సాగింది. లంచం తీసుకుని అర్హతలేని విద్యార్థులకు హెచ్చు మార్కులు ఇచ్చి వారికి మంచి ర్యాంకులు అందించారు. ఈ కింద తెలిపిన విధాలలో మోసం జరిగింది:[2]
వ్యాపం కుంభకోణంలో అవకతవకలున్నట్టు 1995 నుండే ఎన్నో కేసులు నమోదయ్యాయి. మొదటి ఎఫ్ఐఆర్ ఛతర్పూర్ జిల్లాలో 2000లో నమోదు అయింది.