వ్యూహాత్మక బలగాల కమాండ్ (SFC) అనేది భారతదేశపు న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (NCA) లోని ఒక భాగం. కొండొకచో దీన్ని వ్యూహాత్మక న్యూక్లియర్ కమాండ్ అని కూడా అంటారు. దేశపు వ్యూహాత్మక అణ్వాయుధాల నిల్వలను నిర్వహించే బాధ్యత దీనిదే.[1] 2004 జనవరి 4 న వాజపాయ్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.[2] దీని మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీఫ్‌గా ఎయిర్ మార్షల్ తేజమోహన్ ఆస్థానా పనిచేసాడు.[3][4]
NCA తీసుకున్న నిర్ణయాలను అమలు చెయ్యడం వ్యూహాత్మక బలగాల కమాండ్ బాధ్యత. ఇది ఒక త్రీ స్టార్ ర్యాంకున్న కమాండర్-ఇన్-ఛీఫ్ నేతృత్వంలో పనిచేస్తుంది. NCA నుండి వచ్చిన ఆదేశాలను అనుసరించి అణ్వాయుధాలను ప్రయోగించే పనిని మొదలుపెట్టే బాధ్యత కేవలం వ్యూహాత్మక బలగాల కమాండ్ వద్ద మాత్రమే ఉంటుంది. కచ్చితంగా ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకోవాలనేది కమాండ్ అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తుంది. NCA ఆమోదాన్ని కూడా పొందుతుంది.[3][4]
అణ్వాయుధాల నిల్వల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులనూ చెయ్యడంలో వ్యూహాత్మక బలగాల కమాండ్ పూర్తి నియంత్రణను, కమాండ్‌నూ కలిగి ఉంటుంది. కమాండ్‌ను ఏర్పరచిన నాటి నుండి దాని కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్థిరంగా ఏర్పరచబడ్డాయి. కమాండ్ అత్యున్నత స్థాయి సన్నద్ధతను సాధించింది.[5]
అగ్ని-1, అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణులు ప్రస్తుతం వ్యూహాత్మక బలగాల కమాండ్ నియంత్రణలో మోహరించి ఉన్నాయి.[6] అగ్ని-3 మోహరింపు దశలో ఉంది.[7] 2012లో హిందూ పత్రిక కథనం ప్రకారం, అగ్ని-3 క్షిపణులు వ్యూహాత్మక బలగాల కమాండ్ నియంత్రణలో మోహరింప బడ్డాయి. 2012 సెప్టెంబరు 21 న రైలు మొబైలు నుండి అగ్ని-3 ని వాడుకరి పరీక్ష నిర్వహించినట్లుగా కూడా ఆ పత్రిక రాసింది.[8] 2013 డిసెంబరు 23 న రెండవ వాడుకరి పరీక్ష నిర్వహించింది.[9] [10]
2003 లో పృథ్వి క్షిపణిని వ్యూహాత్మక బలగాల కమాండ్ లో మోహరించారు. భారతీయ గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో తయారైన మొట్టమొదటి క్షిపణి అది. SFC యొక్క యూనిట్ 2014 జనవరి 7 న చాందీపూర్ నుండి ఈ క్షిపణిని పరీక్షించింది.[11]
2010 సెప్టెంబరు 12 న హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన వార్త ప్రకారం, బలగాల దాడి సామర్థ్యాన్ని పెంచేందుకు గాను, అణ్వాయుధాలను మోసుకెళ్ళగలిగే 40 ఫైటర్ విమానాలను కొనుగోలు చెయ్యాలని భావిస్తున్నారు. రెండు స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను కమాండ్ వద్ద ప్రత్యేకించి ఏర్పాటు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద ప్రతిపాదించింది. ఇదొక చిన్నపాటి ఎయిర్‌ఫోర్సులా పనిచేస్తుంది. ప్రస్తుతం అణ్వాయుధాల ప్రయోగం కోసం భారత వైమానిక దళంపై ఆధారపడుతున్న కమాండ్ దీనితో స్వంత వైమానిక దళం సమకూరుతుంది.[12]
పేరు | రకం | దూరం (కి.మీ.) | స్థితి |
---|---|---|---|
పృథ్వి-I | తక్కువ-పరిధి | 150 | మోహరించారు |
పృథ్వి-II | తక్కువ-పరిధి | 250-350 | |
పృథ్వి-III | తక్కువ-పరిధి | 350-600 | |
అగ్ని-I | తక్కువ to మధ్యమ-పరిధి | 700-1,250 | |
అగ్ని-II | మధ్యమ-పరిధి | 2,000-3,000 | |
అగ్ని-III | మధ్యంతర-పరిధి | 3,500-5,000 | |
అగ్ని-IV | మధ్యంతర-పరిధి | 4,000 | విజయవంతంగా పరీక్షించారు |
అగ్ని-V | మధ్యంతర to ఖండాంతర-పరిధి | 5,000-8,000 | |
అగ్ని-VI | ఖండాంతర-పరిధి (MIRV కావచ్చు) | 6,000-10,000 | అభివృద్ధి దశలో ఉంది |
సూర్య | ఖండాంతర-పరిధి మల్టిపుల్ ఇండిపెండెంట్ల్య్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ (MIRV) | 8,000-12,000 | నిర్ధారణ కాలేదు |
పేరు | రకం | దూరం (కి.మీ.) | స్థితి |
---|---|---|---|
ధనుష్ | తక్కువ-పరిధి | 350 | అభివృద్ధి అయింది, కానీ మోహరించలేదు |
సాగరిక (కె-15) | జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణి | 700 | INS అరిహంత్‌లో మోహరించేందుకు సిద్ధంగా ఉంది |
కె-4 | జలాంతర్గామి ప్రయోగిత బాలిస్టిక్ క్షిపణి | 3,500 | పరీక్షించారు [13] |