వ్రాజ్ హిందూ దేవాలయం, అమెరికాలోని తూర్పు పెన్సిల్వేనియాలోని షుయ్‌కిల్ కౌంటీలో ఉన్న హిందూ దేవాలయం.[1] ఇక్కడి ప్రధాన దైవం శ్రీనాథ్‌జీ (కృష్ణుని స్వరూపం). సంవత్సరానికి సగటున 1,00,000 మంది హిందూ యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు.
1987కి ముందు వ్రాజ్ హిందూ దేవాలయం యోగా వినోద కేంద్రంగా ఉండేది. వ్యవస్థాపకుడు గోవింద్ భిఖాభాయ్ షా (కాకా) 29 మంది ఇతరుల మద్దతుతో 1987లో కొనుగోలు చేశారు. 1988 నవంబరులో ప్రారంభ పటోత్సవ వేడుక జరిగింది.[2]
అద్భుత సహజ వాతావరణం చంద్ర సరోవర్ ఒడ్డున ఉన్న దేవాలయం, రాజస్థానీ నిర్మాణ శైలీలో నిర్మించబడింది. ఈ దేవాలయం 60 అడుగుల పొడవు, మూడు అంతస్తుల ఎత్తు, 50,000 చదరపు అడుగులకు పైగా నిర్మాణ ప్రాంతాన్ని కలిగి ఉంది.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఈ దేవాలయం అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1996లో మహారాష్ట్రలోని లాతూర్, 2001లో గుజరాత్ లోని కచ్ ప్రాంతాల భూకంప బాధితులకు, తమిళనాడులోని సునామీ బాధితులకు, కత్రినా తుఫాను బాధితులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించింది.
వ్రాజ్ దేవాలయానికి అమెరికా నలుమూలల నుండి వాలంటీర్ల, విద్యార్థి యువజన బృందం కూడా ఉంది. కమ్యూనిటీకి సేవను ప్రోత్సహించడానికి, భారతీయ వారసత్వం గురించి విస్తృత జ్ఞానాన్ని అందించడానికి ఇది ఏర్పాటుచేయబడింది. హైస్కూల్, కాలేజీ, గ్రాడ్యుయేట్ స్కూల్ లేదా 16 నుండి 28 సంవత్సరాల వయస్సుగల వారు ఈ వ్రాజ్ యూత్ సభ్యులుగా పనిచేస్తున్నారు. దేవాలయంలో నిర్వహించే ప్రార్థనలు, సమూహిక భోజనాలు, పండుగ వేడుకలు, ఏదైనా ఇతర కమ్యూనిటీ సేవల సందర్భాలలో ఈ వ్రాజ్ యువత పాల్గొంటారు. ప్రతి సంవత్సరం వ్రాజ్ యూత్ క్యాంప్ అనే పేరుతో వేసవి శిబిరాలను కూడా నిర్వహిస్తుంది.