షంషాద్ బేగం | |
---|---|
జననం | బాలోడ్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం |
వృత్తి | సామాజిక సేవ |
పురస్కారాలు | మాతా జీజాబాయి పురస్కారం (2004) పద్మశ్రీ పురస్కారం (2012) |
షంషాద్ బేగం ఒక భారతీయ సామాజిక కార్యకర్త. ఈమె ఛత్తీస్‌గఢ్‌లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు , ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజల విద్య కోసం కృషి చేసింది. [1] ఈమెను భారత ప్రభుత్వం 2012లో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. [2]
షంషాద్ బేగం భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలోద్ జిల్లా (గతంలో అవిభక్త దుర్గ్‌లో భాగం) నుండి ఒక దిగువ మధ్య తరగతి సాంప్రదాయక ముస్లిం కుటుంబం నుండి వచ్చింది. బాల్యంలో అనేక కష్టాలను ఎదుర్కొంది. ఈమె తల్లి ఎంతో శ్రమించి తన ఆరుగురు సంతానానికి చదువు చెప్పించింది. షంషాద్ బేగం తన కష్టాలకు ఎన్నడూ క్రుంగి పోలేదు. ఈమె అన్నింటినీ సానుకూల దృక్పథంతో స్వీకరించి జీవిత పాఠాలుగా వాటిని మలుచుకుంది. చాలా చిన్నవయసులోనే ఈమె సమాజ సేవ చేయాలని నిశ్చయించుకుంది. ఈమె భర్త రఫీక్ ఈమెకు అన్నివిధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నాడు. గుండర్‌దేహి బ్లాక్‌లో పనిచేస్తున్న ఒక చిన్న గ్రామ సంఘానికి అధ్యక్షురాలిగా, బేగంకు భారత ప్రభుత్వ జాతీయ అక్షరాస్యత మిషన్ ప్రోగ్రామ్‌తో అనుబంధం పొందే అవకాశం లభించింది. ఇది ఈమె సామాజిక సేవలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. [3] 1995లో గుండర్‌దేహిలో మిషన్ కార్యకలాపాలు ప్రారంభించిన ఆరు నెలల్లోనే, ఈమె, ఈమె సహచరులు మొత్తం 18265 మంది నిరక్షరాస్యులైన మహిళల్లో 12,269 మంది మహిళలను అక్షరాస్యులుగా చేయగలిగారు. [3] ప్రచార కార్యక్రమాలు ముగిసిన తర్వాత కూడా బేగం తన సామాజిక కార్యక్రమాలను కొనసాగించింది. అక్రమ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా పోరాటం, మద్యం దుకాణాలను మూసివేయడం వంటి ఇతర సామాజిక ఉద్యమాలను చేపట్టింది. బలోద్ జిల్లాలో 1041 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో బేగం విజయం సాధించినట్లు సమాచారం. [3] ఈ సమూహాలు, వారి చిన్నమొత్తాల పొదుపుతో, సభ్యుల గృహావసరాల కోసం ఋణాలను పొందగలిగే కార్పస్‌ను సేకరించాయి. ఈ సమూహాల మొత్తం పొదుపు 2 మిలియన్ల అమెరికన్ డాలర్లకు మించి ఉన్నట్లు నివేదించబడింది. ఈ సమూహాలు అప్పటి నుండి సబ్బు తయారీ, ఎద్దుల బండ్ల కోసం చక్రాల తయారీ వంటి కుటీర పరిశ్రమలను స్థాపించాయి. మహిళా భవన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. [3]
శంషాద్ బేగం సహయోగి జనకళ్యాణ్ సమితి అనే సాంఘిక సంక్షేమ సంస్థతో అనుబంధం కలిగి ఉంది. ఈ సంస్థ ద్వారా మహిళలు, పిల్లల విద్య సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటుంది. [4] ఈమె అనేక మంది యువతులకు వివాహం జరిపించింది. బాల్య వివాహాలను అరికట్టడంలో ఈమె చురుకైన పాత్రను నిర్వహించింది. ఈమె నాయకత్వ నైపుణ్యాలలో మహిళలకు శిక్షణ ఇవ్వడం, లింగ వివక్ష, బాల్య వివాహాలు, వేధింపుల నివారణకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)తో కూడా అనుబంధం కలిగి ఉంది. [3]
2006లో షంషాద్ బేగం తమ గ్రామంలోని 100 మంది మహిళలను ఎన్నుకుని వారికి ప్రభుత్వ పథకాలనుండి లబ్ది పొందడానికి తగిన శిక్షణను ఇచ్చింది. వారి ద్వారా మరింత మంది అర్హులైన మహిళలకు ప్రభుత్వ పథకాల ఫలాలను అందజేసింది. ఈ మహిళను ముద్దుగా "కమెండో"లుగా పిలుచుకునేది.[3] ఈ మహిళలకు మార్షల్ ఆర్ట్‌లో శిక్షణను ఇప్పించి వారికి స్వీయరక్షణను కల్పించింది. ఈ మహిళా కమెండోలు గ్రామంలోని స్త్రీలకు రక్షణగా ఉన్నారు. వీరు కమ్యూనిటీ పోలీసులుగా గుర్తించబడ్డారు. 2006లో 100మందితో ప్రారంభమైన ఈ మహిళా కమెండో గ్రూపు ప్రస్తుతం 35000 మందితో 7 జిల్లాలలో విస్తరించింది. ఈ కమెండోలు ఎటువంటి పారితోషికాలు స్వీకరించకుండా అనేక పనులను స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాటిలో రాత్రి పూట గస్తీ తిరగడం ఒకటి. వీరు చిన్న చిన్న సమస్యలను తమలో తామే పరిష్కరించుకుంటున్నారు. పెద్ద నేరాలు జరిగితే పోలీసులను సంప్రదిస్తున్నారు.