శివరావు బెనెగల్ | |
---|---|
జననం | మంగళూరు, కర్ణాటక | 1891 ఫిబ్రవరి 26
మరణం | 1975 డిసెంబరు 15[1] | (వయసు 84)
జీవిత భాగస్వామి | కిట్టీ వెర్సియాండీ |
తల్లిదండ్రులు |
|
శివరావు బెనెగల్ ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, రచయిత. 1967 లో పద్మభూషణ్ పురస్కార గ్రహీత. భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ప్రకటించినపుడు ఆ వార్తను ది హిందూ పత్రిక తరపున కవర్ చేసిన విలేకర్లలో ప్రముఖుడు ఈయన.[2] ఈయన స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. మాంచెస్టర్ గార్డియన్ అనే ఆంగ్ల పత్రికకు కూడా సేవలందించాడు. స్వతంత్ర భారత నిర్మాణానికి తన వంతు కృషి చేశాడు.
శివరావు బెనెగల్ 1891 ఫిబ్రవరి 26 న కర్ణాటక లోని మంగుళూరులో జన్మించాడు. అతను తండ్రి బి. రాఘవేంద్రరావు వైద్యుడు. శివరావు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నాడు.[3] అనీబిసెంట్, దివ్యజ్ఞానసమాజం భావనలకు ఉత్తేజితుడై పాత్రికేయ వృత్తిలోని ప్రవేశించాడు.
అతను భార్య కిట్టీ వెర్సియాండీ ఆస్ట్రియా దేశస్థురాలు.
ముందు గాంధీజీని ఆరాధించినా అతను ఉద్యమ క్రమంలో తీసుకున్న కొన్ని ఎత్తుగడలను వ్యతిరేకించాడు. పాత్రికేయ వృత్తిలో ఉంటూనే కార్మిక రంగంలో కూడా పనిచేశాడు. అంతర్జాతీయ కార్మిక సంస్థలో విజయలక్ష్మీ పండిట్, బాబూ జగ్జీవన్‌రామ్‌లతో కలసి పనిచేశాడు. 1947, 1948, 1949, 1950 సంవత్సరాలలో భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి వెళ్లిన భారత ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు.[1] రాజ్యాంగం అవతరించిన తరువాత ఏర్పడిన ప్రతిష్ఠాత్మక తొలి లోక్‌సభకు శివరావ్ దక్షిణ కెనరా నుంచి ఎన్నికయ్యాడు. తరువాత 1957 నుంచి 1960 వరకు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాడు. తరువాత పార్లమెంటుకు వెళ్ళలేదు. తరువాత తన జీవితానుభవాలను గ్రంథస్తం చేయడం మొదలు పెట్టాడు. సోదరుడు బెనెగల్ నరసింగరావ్ తో కలిసి భారతరాజ్యాంగ నిర్మాణక్రమం అన్న గ్రంథాన్ని సంకలనం చేశాడు. సిరిల్ హెన్రీ ఫిలిప్స్, మేరీ డొరీన్ వెయిన్‌రైట్‌లు రూపొందించిన భారతదేశ విభజన:విధానాలు, దృక్పథం 1935–47 అన్న గ్రంథ రచనలో తోడ్పడ్డాడు. అతను రాసిన చివరి గ్రంథం 1972 లో వెలువడిన భారత స్వాతంత్ర్య సమర యోధులు: కొందరు మహోన్నతులు.