శేఖర్ కమ్ముల | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు, నిర్మాత, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సినిమాలు, సాఫ్ట్వేర్ |
శేఖర్ కమ్ముల తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.[1] ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా సినిమాలకు దర్శకుడు. ఆరు నంది పురస్కారాలు అందుకున్నాడు.
శేఖర్ 1972, ఫిబ్రవరి 4 న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పనిచేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఇది తెలుగు, ఇంగ్లీషులో రూపొందించబడింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించలేదు కానీ ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది.[2]. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. ఈ సినిమాను ఆయన మొదటగా పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయనను ఎప్పుడూ సంప్రదించలేదు. తర్వాత ఈ సినిమాను అప్పటికి మూడు సినిమాల అనుభవం ఉన్న రాజా, కొత్త ముఖం కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలుగా తీశారు.[3] సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.