శ్యమంతక మణి హిందూ పురాణాలలో వర్ణించిన గొప్ప మణి. ఈ మణి గురించి విష్ణుపురాణం, భాగవతం గ్రంథాలలో కూడా ఉంది. [1]
శ్యమంతక మణి సూర్య భగవానునికి చెందింది. సూర్యుడు ప్రతి రోజు దీనిని మెడలో ధరించి తిరిగేవాడు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేక రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని ప్రతీతి. ఇది ప్రతీరోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఇది సూర్యునిచే సత్రాజిత్తునకు ఈయఁబడిన మణి.[2] శ్యమంతక మణి ఒక రోజుకు సుమారు 170 పౌండ్లు (77 కి.గ్రా) బంగారాన్నిస్తుంది. [3] ఇది సూర్యదేవుని మిరుమిట్లు గొలిపే రూపానికి కూడా మూలం[4]
ఒక రోజు సత్రాజిత్తు తమ్ముఁడు ప్రసేనుఁడు దీనిని కంఠాన ధరించి అడవికి వెళ్లగా ఆ మణిని మాంసమనుకుని ఒక సింహము అతనిని చంపి మణిని తీస్కుని పోయింది. సింహము నోటి లో మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. అంతకు ముందు శ్రీకృష్ణునికి అది ఇవ్వలేదు కనుక అతడే తన తమ్ముడిని చంపేశాడని ప్రచారం చేసాడు. చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని పాల బిందెలో చూసిన కారణంగా ఆ అపవాదు కలిగింది అని కృష్ణుడు భావించాడు. ఈ అపవాదు బాపుకొనడానికి సైన్యం తో ప్రసేనుడి జాడ వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ప్రసేనుడి కళేబరం ఇంకా సింహపు అడుగు జాడలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లిన కృష్ణుడు జాంబవంతుడి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ మణిని కనుకున్న కృష్ణుడిని చూసి జాంబవతి ఏడవడం ప్రారంభించింది. అందువల్ల జాంబవంతుడికి, కృష్ణుడికి ఘోరమైన ముష్ఠి యుద్ధం జరిగింది. యుద్ధం లో అలసిపోయిన జాంబవంతుడు ఆ కృష్ణుడు, ద్వాపరయుగంలో శ్రీ రాముడే అని తెలుసుకుని శరణు వేడాడు. తన కూతురు అయిన జాంబవతిని ఇచ్చి వివాహం చేసాడు.[5]
అనవసరమైన అపవాదు శ్రీకృష్ణునిపై వేసినందుకు సత్రాజిత్తు చాలా చింతించాడు. తన కుమార్తె ఐన సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేయడానికి సంకల్పించాడు. ఘనంగా వివాహం జరిపించాడు. కానీ అంతకు ముందు శతధన్వునకు ఇచ్చి వివాహము చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. శతధన్వుఁడు కోపంతో సత్రాజిత్తుని చంపి ఆ మణిని తీసుకుని పారిపోయి, అక్రూరుని దగ్గర దాచాడు. తనని ఎలాగైనా శ్రీకృష్ణుడు చంపుతాడని గ్రహించిన శతధన్వుఁడు, ఒక తేజోమయమైన గుర్రాన్ని ఎక్కి మిథిలా నగరానికి వెళ్తుండగా, శ్రీ కృష్ణుడు అతడిని చంపి ఆ మణిని గూర్చి తెలుసుకున్నాడు. అక్రూరుడు ఆ మణి తన దగ్గర ఉందని తెలిస్తే ప్రమాదమని దేశం వదిలి పోయాడు. శ్రీకృష్ణుడు నగరంలో పెద్ద సంబరం చేసి అక్రూరుడిని ఆహ్వానించి, ఆ మణి గురించి అడగగా అక్రూరుడు ఆ మణిని శ్రీకృష్ణుడికి ఇచ్చివేశాడు.[6][7]
శమంతక మణి కెంపు రంగు మణి అని సూర్యుడి ప్రకాశం వల్ల తెలుస్తోంది.