శ్రీకృష్ణసత్య (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
నిర్మాణం | ఎన్. త్రివిక్రమరావు |
చిత్రానువాదం | నందమూరి తారక రామారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు, జయలలిత, కాంతారావు, ఎస్.వి. రంగారావు, పద్మనాభం, త్యాగరాజు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
నిర్మాణ సంస్థ | ఆర్.కె.బ్రదర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శ్రీకృష్ణసత్య కె.వి.రెడ్డి దర్శకత్వం వహించగా, ఎన్.టి.రామారావు, జయలలిత, కాంతారావు, ఎస్.వి.రంగారావు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1971 నాటి పౌరాణిక చిత్రం. శ్రీ రామావతారానికి, శ్రీ కృష్ణావతారానికి సంధానం చేస్తూ నిర్మించిన పౌరాణిక చిత్రమిది. పౌరాణిక కథకు కల్పన జోడించి చిత్రకథను రూపొందించారు.
శ్రీరామ రావణ యుధ్దంలో పరాజయం అంచున నిలిచిన రావణుడు, పాతాళ లంకను పాలిస్తున్న మైరావణుని సహాయం కోరతాడు. రామ లక్ష్మణులను కాళికా దేవికి బలి ఇస్తానని మైరావణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. చారుల ద్వారా విషయం తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణులకు తన తోకతో కోటను నిర్మించి ఆ కోట భాగాన కూర్చొని ఉంటాడు. మైరావణుడు విభీషణుని రూపంలో వచ్చి రామ లక్ష్మణులను బొమ్మలుగా మార్చి తీసుకుపోతాడు. హనుమంతుడు మోసం తెలిసిన పిమ్మట పాతాళ లంకు వెళ్తాడు. శ్రీరాముని భర్తగా కోరుకున్న చంద్రసేన మైరావణుని బందీగా ఉంటుంది. మైరావణుని వధించడానికి అతని ప్రాణ రహస్యం తెలుసుకోవలసి ఉంటుంది. అందుకు చంద్రసేన సహాయం అర్ధిస్తాడు హనుమంతుడు. అందుకు ప్రతిగా చంద్రసేన నీ స్వామి నాస్వామి కావాలని కోరుతుంది. అందులో అంతరార్ధం తెలియని హనుమంతుడు అలాగే అని మాట ఇస్తాడు. మైరావణుని వధ తరువాత చంద్రసేన కోరిక తెలిసిన శ్రీరాముడు విస్తుపోతాడు. చంద్రసేన కోరిక లో పరమార్ధం తనను భర్తగా పొందడమని ఏకపత్నీ వత్రుడైన తాను ఆ కోరికను తీర్చడం అసాధ్యమని తెలుపుతాడు. ఐతే హనుమంతుని మాట నిలబెట్టడానికి చంద్రసేన భవనానికి వస్తాడు. హనుమంతుడు కీటక రూపంలో దుశ్సకనం వస్తాడు. శ్రీరాముడు శయ్య మీద కూర్చొనగానే మంచం విరుగుతుంది. చంద్రసేన ఈ దుశ్చర్య కు కారణమైన వానిని శపించబోగా హనుమంతుడు శరణాగతుడై, ప్రతక్షమై, శ్రీరామ ఏకపత్నీ వత్రాన్ని వివరించి వచ్చు జన్మలో ఆమెను భర్తగా స్వకరిస్తాడని చెబుతాడు.
ద్వాపర యుగంలో శ్రీ కృష్ణావతర కాలంలో చంద్రసేన సత్యభామగా జన్మస్తుంది. శ్రీకృష్ణునిపై అకారణ ద్వేషం పెంచుకుంటుంది. సత్యభామకు పూర్వజన్న జ్ఞాపకం చేసి తనవశం చేసుకుంటాడు శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణుడు తనకే స్వంతమై ఉండాలని సత్యభామ పంతం. రుక్మిణి పుట్టిన రోజని శ్రీకృష్ణుడు ఆమె మందిరానికి వెళ్లినాడని సత్యభామ కినుక వహిస్తుంది. నారదుడు, శ్రీకృష్ణుని వశపరచుకొనుటకు పుణ్యక వ్రతమాచరించమని అందులో భాగముగా శ్రీ కృష్ణుని తనకు దానమిమ్మని సత్యభామకు సూచిస్తాడు. సత్యభామ అలకను శ్రీ కృష్ణుడు తీర్చువేళ నారదుని సూచించిన పుణ్యక వ్రత వృత్తాంతాన్ని చెబుతుంది. సత్యభామ ముచ్చట తీర్చడానికి శ్రీకృష్ణుడంగీకరిస్తాడు. వ్రత విధానమైన పిమ్మట శ్రీకృష్ణుని దానం పొందిన నారదుడు, శ్రీ కృష్ణుని తూచదగ్గ ధనధనేతరములు సత్యభామ వద్ద లేక పోవుటచే శ్రీకృష్ణుని అమ్మజూపుతాడు. రుక్మిణి తులసిదళంతో శ్రీకృష్ణుని తూచుటతో సత్యభామకు అహంకారం నశిస్తుంది. శ్రీ కృష్ణుడు హస్తినకు పాండవదూతగా వెళ్లి రాయబారం నెఱపుతాడు. పాండవులకు సూది మొన మోపిన భూమిని కూడా ఇయ్యనని దుర్యోధనుడు పట్టు దలగా ఉండాడు. రాయబారం విఫలమవుతుంది. పాండవ కౌరవుల యుధ్దమనివార్యమవుతుంది. కౌరవసేనను చూసి తల్లడిల్లిన అర్జునునకు గీతోపదేశం చేస్తాడు గోవిందుడు. గీతోపదేశంతో చిత్రం ముగుస్తుంది.
1971 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఈచిత్రాన్ని ఎంపికచేసి రజిత నంది అవార్డు ప్రకటించింది.
విజయా బ్యానర్లో అత్యంత విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి విజయా బ్యానర్లో తీసిన సత్య హరిశ్చంద్ర (1965), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968) సినిమాలు పరాజయం పాలయ్యాయి. దానితో విజయా వారు కె.వి.రెడ్డిని విజయా నుంచి తొలగించి, ఆయనకు వేతనాలు, సౌకర్యాలు నిలిపివేశారు. ఆయన 1968లో స్వంత బ్యానర్లో నిర్మించిన భాగ్యచక్రం సినిమా కూడా విజయం సాధించలేదు. మరే సినిమా అవకాశాలు లేకపోవడంతో గ్రీటింగ్ కార్డుల డిజైనింగ్, ఇతరుల సినిమా స్క్రిప్టుల్లో సహకారం వంటి పనులు చేస్తూ నెట్టుకొచ్చారు. సినిమాల్లో తనకు శ్రీకృష్ణునిగా గొప్ప ఇమేజి సంపాదించిపెట్టిన కె.వి.రెడ్డి సినిమాలు లేక ఇబ్బందిపడుతూండడంతో నందమూరి తారక రామారావు ఆయనకు డబ్బుఇవ్వబోయారు. ఊరికే వచ్చే సొమ్ము తనకువద్దని, ఏదైనా సినిమాకు దర్శకత్వం చేయించుకుని ఇస్తే పుచ్చుకుంటానని కె.వి.రెడ్డి చెప్పారు. దాంతో తన స్వంత బ్యానర్లో శ్రీకృష్ణసత్య సినిమా కె.వి.రెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి నిర్మించారు.[1]
శ్రీకృష్ణసత్య కథాంశం రామాయణానికి, భారత కాలానికి ముడిపెడుతూ సాగుతుంది. సినిమాకు కథ, సంభాషణలు పింగళి నాగేంద్రరావు అందించారు. పాటలను పింగళి, సినారె, సముద్రాల రాఘవాచార్య రాశారు.[2]
శ్రీకృష్ణసత్య సినిమాలో నందమూరి తారకరామారావు శ్రీరామునిగానూ, శ్రీకృష్ణునిగానూ నటించారు. త్రేతాయుగంనాటి కథలో చంద్రసేనగానూ, తర్వాత ద్వాపరయుగంలో మరుజన్మలో సత్యభామగానూ జయలలిత నటించారు.
1971లో విడుదలైన శ్రీకృష్ణసత్య సినిమా విజయవంతమైంది. సినిమాలోని పలు పాటలు ప్రజలను ఆకట్టుకుని నిలిచిపోయాయి.[2] శ్రీకృష్ణసత్య సినిమా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డికి, ఆయన ఆస్థాన రచయితగా పేరొందిన పింగళికి చివరి సినిమా.
01. అలుకమానవే చిలుకలకొలికిరు తలుపు తీయవే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: పింగళి
02. అలుగుటయే ఎరుంగని (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
03. అనికిన్ తోడ్పడుమంచు బాలునొకనిన్ ప్రార్దింపగావచ్చునే (పద్యం) - మాధవపెద్ది
04. ఎంత తపంబు చేసితినో ఎన్నిభవమ్ములో పూర్వపుణ్యం (పద్యం) - ఎస్.పి. బాలు
05. ఐదూళ్ళిచ్చిన చాలును లేదేని అనిచేత నిజము (పద్యం) - మాధవపెద్ది
06. ఐదుగురు మాకు శత్రువుల్ అంతిగాక క్రీడి ఒక్కడొనర్చిన (పద్యం) - మాధవపద్ది
07. ఒక్కని జేసి నన్నిచట ఉక్కడింప దలంచినావే (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
08. కస్తూరీ తిలకం లలాటఫలకే (శ్లోకం) - కె.జె. జేసుదాసు
09. కలగంటి కలగంటిని ఓ చెలియ ఓ మగువా ఓ లలనా - ఎస్.జానకి
10. కవ్వడితోడి పోరితము కర్ణునకిష్టము వానిచేత ( పద్యం) - కె.జె. జేసుదాసు
11. కోపం బోయెడి బాసచేసితివి ఇంతే ఎన్నియో సార్లు (పద్యం) - ఎస్. జానకి
12. గోపీమునిజన హృదయవిహారీ గోవర్ధనగిరిధారి హరే - ఎస్.జానకి
13. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి - ఎస్.పి. బాలు
14. చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
15. జెండాపై కపిరాజు ముందు సితవాజిశ్రేణి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
16. జ్యోఅచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద (జోలపాట) - ఎస్.జానకి
17. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి (పద్యం) - ఘంటసాల - రచన: తిరుపతి వెంకటకవులు
18. తాతాల మామలన్ సుతుల తండ్రుల (పద్యం) - ఎస్.పి.బాలు
19. ధరణీ గర్భము దద్దరిల్లగా సముద్రశ్రేణి ఘోషిల్లగా (పద్యం) - మాధవపెద్ది
20. పతితలు గారు నీయడల భక్తులు శుంఠలు గారు (పద్యం) - ఎస్.పి. బాలు
21. ప్రియా ప్రియా మధురం పిల్లనగ్రోవి , పిల్లవాయువు భలే భలే మధురం - ఎస్.జానకి,ఘంటసాల - రచన: డా॥ సినారె
22. పగర గెల్చితినేని ఈ జగతి ఏలుకొనెద అనుజన్ములును (పద్యం) - మాధవపెద్ది
23. భలే వింత వింత బేరము మించినన్ - ఎస్.పి. బాలు బృందం
24. భక్త వరదుడువై నీవు వరలు నిశ్చలధ్యానమగ్నమై (పద్యం) - ఎస్.జానకి
25. నుదుట కస్తూరీ రేఖ నునుశోభలేలని చిరునామ ( పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
26. మంచిదినమెంచి భక్తితో మనసు నించి పరమశోత్రి(పద్యం) - ఎస్.పి. బాలు
27. మాట మీరగలడా నే గీచిన గీటు దాటగలడా సత్యాపతి - ఎస్.జానకి
28. మెట్టిన దినమీ సత్యకు పుట్టిన దినమీ విధర్భపుత్రికి (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
29. మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు మమ్మారాధించు (పద్యం) - గాయకుడు ?
30. రాధేయుండును నేను తమ్ములు సంగ్రామములో (పద్యం) - మాధవపెద్ది
31. శ్రీరామ జయరామ జయజయ రామా రఘురామా - ఎస్.పి. బాలు బృందం
32. శ్రీరాఘవం దశరాతత్మజమప్రమేయం సీతాపతిం (శ్లోకం) - కె.జె. జేసుదాసు
33. సేవా ధర్మము సూత ధర్మమును (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూ॥
34. సర్వధర్మాన్ (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల *
35. సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచు చుండిన (పద్యం) - మాధవపెద్ది
36. సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం (పద్యం) - ఎస్.పి. బాలు
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
---|---|
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య |