శ్రీ శ్రీ | |
---|---|
జననం | శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30 |
మరణం | 1983 జూన్ 15 | (వయసు 73)
జీవిత భాగస్వామి | వెంకట రమణమ్మ, సరోజిని |
పిల్లలు | రెండో భార్య సరోజిని ద్వారా, వీరికి ఒక కుమారుడు వెంకట్ (మ.2024)[1], ముగ్గురు కుమార్తెలు మాల, మంజుల, మంగళ |
తల్లిదండ్రులు | పూడిపెద్ది వెంకట్రమణయ్య (తండ్రి), ఆటప్పకొండ (తల్లి) శ్రీరంగం సూర్యనారాయణ (శ్రీశ్రీని దత్తత తీసుకున్నారు) |
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (1910 ఏప్రిల్ 30, - 1983 జూన్ 15) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా , అతను హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతను రచనల్లో పై మనసులో ఉన్న మాటలు రాసే వారు.
శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు.[2] శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేసాడు.1925లో ఎస్. ఎస్. ఎల్. సి. పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931లో మద్రాసు విశ్వ విద్యాలయంలో బి.ఏ (జంతుశాస్త్రం) పూర్తి చేసాడు.
1935లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాం నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను ఇలా వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.
1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. వీరి నలుగురి సంతానంలో చివరి అమ్మాయి నిడుమోలు మాలా మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు.[3]
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో అతని ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ, వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించాడు.
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని రాసేవాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలాచేయడం "గురజాడ అడుగుజాడ" అని అతను అన్నాడు .
1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని అతనికి తెలియదు. 1981లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో అతను ఈ విషయం స్వయంగా రాసాడు.
"ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."
ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
• మహాప్రస్థానం
. ప్రభవ
. వారంవారం
. చమరాత్రి
.మన గురజాడ
.జాబులు
.చైనాయానం
. సిప్రాలి
. వ్యూలు, రివ్యూలు
.ప్రజా
• మరో ప్రస్థానం
• ఖడ్గ సృష్టి
• అనంతం ( నవల ) - శ్రీశ్రీ స్వీయ చరిత్ర[4]
ఇతడు మద్రాసులో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమావారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది.[5] తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు, పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం "నీరా ఔర్ నందా"కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి.
ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి.విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నాడు. ఇతడు మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు!
తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన చాలా సినిమా పాటలను రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు అతను రాసిన "తెలుగు వీర లేవరా" అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
ఇతడు స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు.
రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.
శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతను అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు అతను జీవితాన్ని తాకాయి. అతను గురించి జీవితచరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ "శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు" వ్యాఖ్యానించాడు.
దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశాడు. పైగా అతను రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపాడు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా అతను ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు. [6]
శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో అతనిపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. అతని శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవాడు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నాడు. 1934లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్త్వికత, వాస్తవికత మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం "కవితా ఓ కవితా" నవ్యసాహిత్య పరిషత్ వేదికపై చదివాడు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన విశ్వనాథ, నాటి వర్థమాన కవి అయిన శ్రీశ్రీని ఆనందబాష్పాలతో వేదికపైన నడిచివచ్చి గుండెలకు హత్తుకున్నాడు. ఆ గీతాన్ని ఎంతగానో పొగడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని(మహాప్రస్థానంగా వెలువడింది) తానే ప్రచురిస్తానని, దీనికి ముందుమాట రాయాలని చలాన్ని కోరాడు. ముందుమాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల మధ్యవర్తిత్వాన్ని కూడా నెరిపాడు. కానీ అప్పటికి విశ్వనాథ పేరున్న కవే అయినా ఆర్థికంగా ఏ ఆధారంలేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి. వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల మహాప్రస్థానాన్ని అతను ప్రచురించలేదు. నళినీమోహన్ అనే సాహిత్యాభిలాషి ముద్రించాడు. విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడాడు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు "శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని", లేని పక్షంలో దీనికి మరోకారణం కనిపించదని వ్యాఖ్యానించాడు. తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు.
ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశాడు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశాడు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకూ ప్రశంసించాడు. అతని మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ "కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద" అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది.
తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒకవిధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొర్లుతూండేవి. చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిద్ధి చెందాడు. అతని చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
There is a statue in Vijayawada in Tummala Palli Kala Kshetram.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బూదరాజు, రాధాకృష్ణ (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.