సంజీవయ్య ఉద్యానవనం | |
---|---|
రకం | ప్రజల ఉద్యానవనం |
స్థానం | హైదరాబాద్, తెలంగాణ |
అక్షాంశరేఖాంశాలు | 17°23′06″N 78°29′12″E / 17.385044°N 78.486671°E |
విస్తీర్ణం | 92 ఎకరాలు (37 హెక్టార్లు)[1] |
నిర్వహిస్తుంది | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సంజీవయ్య ఉద్యానవనం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంది. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున 92 ఎకరాల (37 హెక్టార్లు) విస్తీర్ణంలో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఈ ఉద్యానవనానికి పెట్టారు.[2] ఈ సంజీవయ్య ఉద్యానవనం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది.[1] సంజీవయ్య ఉద్యానవనం ప్రక్కనే ఉన్న రైల్వే స్టేషను సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషను అంటారు.
2010 ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డులు బహుకరణ సందర్భంగా ఈ ఉద్యావవనం ఉత్తమ ఓపెన్ ల్యాండ్‌స్కేప్ అవార్డును గెలుచుకుంది.[3] ఈ ఉద్యానవనంలో రెండవ ఎత్తైన భారతీయ జెండాలు కూడా ఉన్నాయి.[4]
2004లో హైదరాబాదులోని ప్రజలుకోసం, ఇతర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల సందర్శానార్థం బుద్ధ పూర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ (బిపిపిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల సుందరీకరణ చేపట్టింది. కొత్త వినోద సౌకర్యాల కోసం ప్రణాళిక తయారుచేసి అభివృద్ధి చేసింది. ఈ ఉద్యానవనాన్ని హుస్సేన్ సాగర్ సరస్సు అవతలి వైపు 2.4 కి.మీ. దూరం ఉన్న లుంబిని పార్కుకు అనుసంధానించే ఏరియల్ ట్రామ్ వే ఏర్పాటు చేయబడింది. ఇంకా వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్, వాటర్ స్లైడ్‌లు కూడా ఈ ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడ్డాయి.[5] కొన్ని సంవత్సరాల తరువాత, ఉద్యానవనాన్ని వినోద ప్రదేశంగా మార్చడానికి బిపిపిఎ చేసిన ఈ ప్రతిపాదన పార్కు పర్యావరణ వ్యవస్థకు హానికరమని భావించబడింది. ప్రాంతీయ వన్యప్రాణి సలహా బోర్డు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ ఉద్యానవనంలో అనేక జాతుల వృక్షజాలం, జంతుజాలాలను రక్షించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది.[6]
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) 2010లో పార్క్ అభివృద్ధికి కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ఉద్యానవనం అన్ని పర్యావరణ అంశాలకు భంగంకలుగకుండా వాటిని పరిరక్షించునే చర్యలలో భాగంగా, ఎటువంటి కాంక్రీట్ నిర్మాణాలను నిర్మించకుండా ప్రణాళికను ప్రతిపాదించింది. వాటర్ స్పోర్ట్స్ తో పాటు, భారీ వాటర్ ఫ్రంట్ ను ఉపయోగించుకోవటానికి, రాత్రి వేళలందు విద్యుత్, నీరు, ఇంధన పరిరక్షణ చర్యలను రూపొందించింది.
పార్క్ వద్ద సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయబడింది. అదనంగా హెచ్‌ఎండిఎ తన హైదరాబాద్ ఎకో ఆర్ట్ ప్రాజెక్ట్ చొరవలో భాగంగా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన శిల్పాలను కూడా ప్రదర్శించింది.[7] దీనికి తోడు బిపిపిఎ ఈ పార్కుతో సహా ఉద్యానవన పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకాన్ని,ఇతర వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా నిషేధం విధించింది. ప్లాస్టిక్ ప్రమాదాల గురించి పౌరులకు అవగాహన కల్పించి అవసరమైన అవగాహన చర్యలు చేపట్టింది.[8]
హెచ్‌ఎండీఏ ఈ ఉద్యానవనాన్ని ఎన్నో ప్రత్యేకతలు కూడుకొని ఉన్న ఉధ్యానవనంగా తీర్చి దిద్దుటకు 3 కోట్ల జైకా నిధులతో ముఖ్యంగా రాశి వనం, నక్షత్ర వనం, బ్యాంబూ గార్డెన్, బట్టర్‌ఫ్లై గార్డెన్ అనే పేర్లుతో వివిధ మినీ థీమ్ పార్కులు నిర్మాణం 2016 మే చివరి నాటికి పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేటట్టుగా ప్రణాళిక రూపొందించి చేపట్టింది.[9]
ఉద్యానవనంలో నివాస పక్షులు, ఇతర ప్రాంతాలలో నివసిస్తూ పార్కులోకి నిరంతరం వచ్చే పక్షులు జాతులు దాదాపు 100 కి పైగా, సీతాకోకచిలుకలులాంటి కీటకాలుకు చెందిన జాతులు దాదాపు 50 కి పైగా ఈ పార్కులో ఉన్నాయి.[10] ఈ పార్కులో వివిధ వలస జాతుల పక్షులు తరచూ వస్తుంటాయి. పైడ్ క్రెస్టెడ్ కోకిల ఈ ప్రాంతానికి రావటాన్ని రుతుపవనాల రాకకు సంకేతికంగా పరిగణించబడుతుంది.[11] ఇవి ఈ ఉద్యానవనంలో తరచుగా కనిపిస్తాయి.ఈ పక్షిని గుర్తించిన 15 - 18 రోజుల తరువాత వర్షాలు కురుస్తాయని స్థానిక పక్షుల పరిశీలకులు గమనించినదాన్నిబట్టి తెలుస్తుంది.[12] హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) ప్రారంభించిన నిర్మాణ పనుల కారణంగా, స్పాట్బిల్స్, క్రేన్లు, కామన్ కూట్, పర్పుల్ హెరాన్స్, కార్మోరెంట్స్, జాకనాస్ వంటి సాధారణ పక్షులు 2010 లో ఈ పార్కులో కనిపించలేదు.[13]
రెండవ ఎత్తైన భారతీయ జాతీయ జెండా ఈ ఉద్యానవనంలో ఉంది.భారతదేశంలో ఎత్తైన మొదటి భారత జాతీయపతాకం రాంచీలో ఉంది. జెండాకు ఉపయోగించిన స్తంభం ఎత్తు 291 అడుగులు (88.69 మీటర్లు), జెండా పరిమాణం కొలతలు 72 అడుగుల ఎత్తు, 108 అడుగులు వెడల్పు కలిగి ఉంది. ఈ జెండా 2016 జూన్ 2 న (ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రెండవ వార్షికోత్సవం) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుచే ఆవిష్కరించబడింది. ఈ జెండా ఏర్పాటుకు రెండు కోట్లు ఖర్చు అయింది. జెండా ఏర్పాటు ముందు అనుకున్న పధకం ప్రకారం రాంచీలో 293 అడుగుల ఎత్తులో ఉన్నదానికంటే మించి 303 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయవలెనని పధకం తయారుచేయబడింది.అయితే జెండా 291 అడుగుల వరకు మాత్రమే ఎగురవేయడానికి విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.[14][15]
ప్రజల కోసం అప్పుడప్పుడు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.అందులో భాగంగా రోలర్-స్కేటింగ్ రేసులు, సామాజిక అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది.[16][17]
2007 లో హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడుల తరువాత, ఈ పార్కుతో సహా హైదరాబాదులోని అన్ని ప్రధాన పార్కులను అధిక భద్రతతో ఉంచారు. ఈ సంఘటన కారణంగా, ఉద్యానవనంలో సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.[18]
ఉద్యానవనానికి రోజూ వచ్చే ప్రేమికుల జంటల చిలిపి చేష్టలు ఉద్యానవనంలో మితిమీరినవి.వారివలన సందర్శకులకు చాలా ఇబ్బంది కలుగుచున్న నేపథ్యంలో, హెచ్‌ఎండీఏ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ అధికారులకు అందిన పిర్యాదులు పురష్కరించుకుని, న్యూఢిల్లీలో ఇండియాగేట్ వే దగ్గర ఉన్న చిల్డ్రన్ పార్క్ తరహాలోనే సంజీవయ్య పార్కును పిల్లల ఉద్యానవనంగా పేరు మార్చి,14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు మాత్రమే తమ తల్లిదండ్రులు లేదంటే వారి సంరక్షకులతో వస్తేనే దర్శించే సదుపాయం కల్పించారు.[19]