సతీష్ గుజ్రాల్ | |
---|---|
![]() 2017 లో సతీష్ గుజ్రాల్ | |
బాల్య నామం | సతీష్ గుజ్రాల్ |
జననం | ఝీలం నగరం, పంజాబ్, బ్రిటిషు భారతదేశం | 1925 డిసెంబరు 25
మరణం | 2020 మార్చి 26 న్యూ ఢిల్లీ | (వయసు: 94)
భార్య / భర్త | కిరణ్ గుజ్రాల్ |
రంగం | భారతీయ చిత్రకళ, శిల్పకళ, కుడ్యచిత్రకళ, సాహిత్యం |
శిక్షణ | ముంబై |
అవార్డులు | పద్మ విభూషణ్ (1999) |
సతీష్ గుజ్రాల్ (1925 డిసెంబరు 25 - 2020 మార్చి 26)[1] భారతీయ చిత్రకారుడు, శిల్పి, కుడ్యచిత్రకారుడు, స్వాతంత్ర్యానంతర కాలంలోని రచయిత.[2] అతను 1999లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నాడు. అతని అన్నయ్య ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997, 1998 మధ్య భారత ప్రధానిగా పనిచేసాడు.
గుజ్రాల్ బ్రిటిషు భారతదేశంలో, పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలమ్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో జన్మించాడు.[3] అతను భారత రాజకీయ నాయకుడు అవతార్ నారాయణ్ గుజ్రాల్ కుమారుడు, భారతదేశ 12వ ప్రధానమంత్రి IK గుజ్రాల్ సోదరుడు. అతని కోడలు షీలా గుజ్రాల్ ప్రఖ్యాత హిందీ కవయిత్రి. అతని అన్న కొడుకు నరేష్ గుజ్రాల్ కూడా రాజకీయ నాయకుడు.[4]
సతీష్ వినికిడి సమస్య కారణంగా, చాలా పాఠశాలల్లో అతనికి ప్రవేశం దొరకలేదు. ఒకరోజు చెట్టు కొమ్మ మీద కూర్చున్న పక్షిని చూసి దాని బొమ్మ గీసాడు. పెయింటింగ్‌పై అతని ఆసక్తికి ఇది ముందస్తు సూచన. తరువాత, 1939 లో అప్లైడ్ ఆర్ట్స్ అధ్యయనం చేయడానికి లాహోర్‌లోని మేయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాడు. 1944 లో అతను బొంబాయి వెళ్లి సర్ JJ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరాడు. పదే పదే వచ్చే అనారోగ్యం కారణంగా, 1947 లో అతను చదువు మానేసి, బొంబాయి వదిలి వెళ్ళవలసి వచ్చింది.
1952 లో గుజ్రాల్, మెక్సికో నగరంలోని పలాసియో డి బెల్లాస్ ఆర్టెస్‌లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ అందుకున్నాడు. అక్కడ అతను ప్రఖ్యాత కళాకారులైన డియెగో రివెరా, డేవిడ్ అల్ఫారో సిక్విరోస్‌ల వద్ద శిక్షణ పొందాడు.[5]
భారతదేశ విభజన, వలసదారుల యొక్క వేదన యువ సతీష్‌పై ప్రభావం చూపింది. అతను సృష్టించిన కళాఖండాలలో అది వ్యక్తమైంది. 1952 నుండి 1974 వరకు, గుజ్రాల్ తన శిల్పాలు, పెయింటింగ్స్, గ్రాఫిక్స్ ప్రదర్శనలను ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్, న్యూఢిల్లీ, మాంట్రియల్, బెర్లిన్, టోక్యో వంటి అనేక నగరాల్లో నిర్వహించాడు.[6]
గుజ్రాల్ వాస్తుశిల్పి కూడా. అతను డిజైను చేసిన న్యూ ఢిల్లీలోని బెల్జియం రాయబార కార్యాలయం 20వ శతాబ్దంలో నిర్మించిన అత్యుత్తమ భవనాలలో ఒకటిగా అంతర్జాతీయ వాస్తుశిల్పుల ఫోరమ్ ఎంపిక చేసింది.
గుజ్రాల్ తన భార్య కిరణ్ (1937-2024)తో కలిసి న్యూఢిల్లీలో నివసించాడు. ఆర్కిటెక్ట్ అయిన వారి కుమారుడు మోహిత్ గుజ్రాల్, మాజీ మోడల్ ఫిరోజ్ గుజ్రాల్‌ను వివాహం చేసుకున్నాడు. సతీష్‌కు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు, అల్పనా, జ్యువెలరీ డిజైనరుగా, రసీల్ గుజ్రాల్ అన్సల్, ఇంటీరియర్ డిజైనరు, కాసా పారడాక్స్ & కాసా పాప్ యజమాని. ఆమె నవీన్ అన్సల్‌ను పెళ్ళి చేసుకుంది.[7]
గుజ్రాల్ కృషిని నమోదు చేస్తూ డజన్ల కొద్దీ డాక్యుమెంటరీలు రూపొందించారు. ఫిలింస్ డివిజన్ ఆఫ్ ఇండియా అతని జీవితంపై సతీష్ గుజ్రాల్ అనే పేరుతో ఒక లఘు డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించింది. దానికి బల్వంత్ గార్గి దర్శకత్వం వహించాడు. ఇది, సతీష్ జీవితంపై, రచనలపై ఒక అవలోకనాన్ని అందిస్తుంది.[8]
2007 నాటి BBC టెలివిజన్ చిత్రం, పార్టిషన్: ది డే ఇండియా బర్న్డ్‌లో కూడా సతీష్ భాగంగా ఉన్నాడు. "ఎ బ్రష్ విత్ లైఫ్" అనే 24 నిమిషాల డాక్యుమెంటరీ 2012 ఫిబ్రవరి 15 న విడుదలైంది. అదే పేరుతో రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని రూపొందించారు. ఆత్మకథతో సహా అతనివి నాలుగు పుస్తకాలు ప్రచురితమయ్యాయి.[9]
తన సోదరుడు ఇందర్ కుమార్ గుజ్రాల్‌తో కలిసి ప్రపంచ రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే ఒప్పందంపై సంతకం చేసిన వారిలో సతీష్ ఒకడు.[10][11] ఫలితంగా, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఫెడరేషన్ ఆఫ్ ఎర్త్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించడానికీ, ఆమోదించడానికీ ప్రపంచ రాజ్యాంగ సభ సమావేశమైంది.[12]
1999 లో గుజ్రాల్‌కు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. 2014 ఏప్రిల్‌లో, NDTV అతనికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ప్రదానం చేసింది.[13]