సర్దార్ గబ్బర్ సింగ్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రవీంద్ర |
స్క్రీన్ ప్లే | పవన్ కళ్యాణ్ |
కథ | పవన్ కళ్యాణ్ |
నిర్మాత | పవన్ కళ్యాణ్, శరద్ మరార్ |
తారాగణం | పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్ |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎ. విల్సన్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థలు | |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
సర్దార్ గబ్బర్ సింగ్ 2016లో విడుదలైన తెలుగు చిత్రం. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి ఇది కొనసాగింపు చిత్రం. నటుడు పవన్ కళ్యాణ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కథను అందించడమే కాక ఈచిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
తల్లిదండ్రులు లేని అనాథ కావటం వలన తన పేరును తానే గబ్బర్ సింగ్ అని పెట్టుకొన్న ఒక కుర్రాడు, అతని లాంటి ఇంకో అనాథ బాలుడికి సాంబ అనే పేరు పెడతాడు. దొంగను పట్టించటంతో ప్రాణాలకి తెగించి పోలీసు ఆఫీసర్ (తనికెళ్ళ భరణి)కి గబ్బర్ సింగ్ సహాయపడటంతో అతను వారిద్దరినీ చేరదీసి పోలీసులను చేస్తాడు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు అయిన రత్తన్ పూర్ రాజ్యానికి రాకుమారి అర్షి. చిన్న నాటనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్న అర్షి, మధుమతి పెంపకంలో పెరిగి యువరాణి అవుతుంది. దళపతి అయిన హరినారాయణ (ముఖేష్ రిషి) రాజ ప్రాసాదాన్ని, రాచరికపు వ్యవహారాలని, రాకుమారి బాగోగులను చూసుకొంటుంటాడు. ఇదే రత్తన్ పూర్ లో జమీందారీ వంశానికి చెందిన భైరోన్ సింఘ్ (శరత్ కేల్కర్) ఊళ్ళకు ఊళ్ళను కబ్జా చేసుకొని అక్కడ మైనింగ్ పరిశ్రమలు నెలకొల్పుతుంటాడు. ఎదురు తిరిగిన గ్రామస్తులను అడ్డు తొలగించుకోవటానికి వారి ప్రాణాలను సైతం లెక్క చేయడు.
భైరోన్, అతని అనుచర గణాల మితిమీరిన ఆగడాలను అరికట్టటానికి హరినారాయణ ఒక పోలీసు అధికారిని పంపమని కోరటంతో, తనికెళ్ళ భరణి గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్), సాంబ (ఆలీ లను అక్కడికి పంపుతాడు. అయితే అక్కడి పోలీసు కార్యాలయం శిథిలావస్థలో ఉండటం తొలిరోజునే గమనించిన గబ్బర్, దానికి ఎదురుగా ఉన్న ఒక క్షురకుని వద్ద నుండి ఒక కుర్చీ తీసుకొని, నడిరోడ్డునే పోలీసు కార్యాలయంగా మలచుకొంటాడు. భైరోన్ పేరు చెప్పుకు తిరిగే ఒక ఆకు రౌడీకి భయపడినట్లు నటించిన గబ్బర్ ను చూచి హరినారాయణ నిరుత్సాహపడతాడు. ఒక స్కూలును బారుగా మలచి, అక్కడి విద్యార్థులకు విద్య అందకుండా అడ్డుకొంటున్న ఆ ఆకురౌడీ, అతని అనుచరులకు గబ్బర్ దేహశుద్ధి చేసి, వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టి, తిరిగి ఆ పాఠశాలను విద్యార్థులకు అందించటంతో హరినారాయణ గబ్బర్ గురించి అర్థం చేసుకొంటాడు.
మధుమతి రాకుమారి అని, అర్షి రాకుమారి చెలికత్తె అని పొరబడిన గబ్బర్, అర్షిని ప్రేమిస్తాడు. నిజం తెలిసిన తర్వాత అర్షికి దూరమవ్వాలని ప్రయత్నించిన గబ్బర్ ను అర్షి తనపైన పెంచుకొన్న ప్రేమ ముగ్ధుణ్ని చేస్తుంది. పన్నెండేళ్ళకు ఒకసారి జరిగే ఉత్సవాలలో భైరోన్ అర్షిని చూసి, ముచ్చట పడతాడు. అప్పటికే తనకి గాయత్రి (సంజన)తో వివాహం అయి ఉన్ననూ, రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొంటాడు.
భైరోన్ అనుచర గణం చేసిన ఒక రోడ్డు ప్రమాదంలో పసిపిల్లలు గాయపడతారు. విషయం తెలిసిన గబ్బర్ రత్తన్ పూర్ కు నాకా బందీ విధిస్తాడు. భైరోన్ గబ్బర్ పైకి తన మనుషులను పంపుతాడు. అందరినీ మట్టి కరిపిస్తాడు గబ్బర్.
అర్షి/గబ్బర్ ల ప్రేమ వ్యవహారం హరినారాయణకు తెలిసేలా చేస్తాడు భైరోన్. గబ్బర్ ను దూరం చేసి, అర్షిని తాను చేసుకోవాలని అతని పన్నాగం. మొదట హరినారాయణ ఆగ్రహించినా, తర్వాత వారి ప్రేమను అంగీకరిస్తాడు. పోలీసు అధికారిగా ఉంటూనే భైరోన్ అడుగులకు మడుగులోత్తే బ్రహ్మాజీ సహాయంతో గబ్బర్ ఉద్యోగం ఊడేలా చేస్తాడు భైరోన్. తన ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకోవటానికి, అర్షిని పొందటానికి గబ్బర్ ఏం చేశాడు, ఎలా చేశాడన్నదే కథ చివరి ఘట్టం. సర్దార్ గబ్బర్ సింగ్ కాస్తా రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అవుతాడు.