ఒడిషా, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని కొండ ప్రాంతాలలో నివసిస్తున్న సవరలు (saoras or savaras) ముండా భాషను మాట్లాడే ఆదివాసులు. ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా దాదాపు 4 లక్షల 50 వేలు. వీరు ప్రధానంగా పోడు వ్యవసాయం చేసుకుంటారు. సవర నివాసాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం వారి ఇళ్ళు. ఒకదానికొకటి ఎదురుగా వరసగా వుంటాయి సవరల ఇళ్ళు. సవరలు ఏకశిలా స్మారక స్థూపాలు ( సమాధులు, Monolithic monuments) నిర్మిస్తారు. ఇవి గదబలు నిర్మించే సమాధులను పోలి వుంటాయి. సవర భాషలో గ్రామాన్ని గొర్ఖాం అంటారు. అంటు వ్యాధులు వచ్చి ఏ కొద్ది మంది చనిపోయినా, పులి వచ్చి మనుషులను చంపినా, అగ్ని పుట్టినా, ఆ గ్రామాన్ని వదలి వేరొకచోట ఇళ్ళు నిర్మించుకొంటారు.
సవరల స్థితిగతులు వీరి సమీప ఆదివాసీ సమూహమైన జాతాపులు కన్నాతక్కువ స్థాయిలో ఉంటుంది. సవరలు ఇంకా అనాగరికులుగానే కనబడతారు. మరోపక్క సవరల మత సంప్రదాయాలు, ఆచారాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ప్రధానంగా సవర మంత్రగాళ్ళ వ్యవస్థలో మనిషికి ఆత్మకు ఉన్న సంబంధాలు, ఆత్మల్లోకి మనుషులు ప్రవేశించగలరనే విశ్వాసాలూ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతీ గ్రామంలో గ్రామపెద్దలు-కులపెద్దలు ఉంటారు. జిన్నోడు, ఎజ్జోడు, దాసరి, గొరవలు, కార్జినాయుడు అని ప్రత్యేక పేర్లతో పిలుస్తారు. ఎజ్జోడు, గొరవలు మంత్రగాళ్ళు. (వెజ్జు - వైద్యుడు, (తెలుగు) ).వీరి వివాహాల్లో ఓలి, మొగనాలి ఆచారాలున్నాయి. ఆడపిల్లకు యిచ్చే కట్నం, ఓలి (కన్యాశుల్కం) . పెళ్ళి అయిన ఆడదాన్ని మనువాడబోతే బతికున్న ఆమె భర్తకు తప్పు కట్టాలి. దీన్ని మొగనాలి అంటారు. గిడుగు రామ్మూర్తి పంతులు, సవర భాషకు వ్యాకరణాన్ని తయారు చేశాడు.