సారొచ్చారు (2012 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పరశురామ్ |
---|---|
నిర్మాణం | ప్రియాంక దత్ |
చిత్రానువాదం | పరశురామ్ |
తారాగణం | రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ్, నారా రోహిత్, జయసుధ, |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | త్రీ ఎంజెల్స్ స్టుడియొ |
భాష | తెలుగు |
త్రీ ఎంజెల్స్ స్టుడియో పతాకం పై ప్రియాంక దత్ నిర్మించిన చిత్రం సారొచ్చారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ్, నారా రోహిత్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం 2012 డిసెంబరు 21 న విడుదలైంది. ఆశించిన విజయాన్ని అందుకొకపొయినా ఈ చిత్రంలో రవితేజ నటనకు మంచి ప్రశంసలు అందాయి.[1][2]
ఇటలీలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ (రవితేజ) అభిరుచులు తనకు దగ్గరగా ఉండటం వల్ల అక్కడే చదువుకుంటున్న సంధ్య (కాజల్ అగర్వాల్) అనే యూనివర్శిటీ విద్యార్థిని కార్తీక్ ని ప్రేమిస్తుంది. ఒక రోజు ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ఇటలీ నుండి పారిస్ మీదుగా ఇండియా వెళ్ళాలి. కర్తీక్ కి తన ప్రేమను తెలియజేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదనుకున్న సంధ్య ప్రయాణం మధ్యలో తనను ప్రేమిస్తున్నట్టు కార్తీక్ కు చెప్తుంది. అప్పటిదాకా తనను స్నేహితురాలిగా మాత్రమే చూసిన కార్తీక్ తనకి వసుధ (రిచా గంగోపాధ్యాయ్) అనే అమ్మాయితో పెళ్ళి జరిగిందన్న కఠోర వాస్తవాన్ని సంధ్యకు చెప్తాడు. సంధ్య బలవంతం పై కార్తీక్ తన గతాన్ని వివరిస్తాడు
ఊటీలో ఫుట్ బాల్ కోచ్ గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి దగ్గరలో నివసించే వసుధను చూసి ప్రేమలో పడిన కార్తీక్ వసుధను తన ప్రేమతో గెలుచుకుంటాడు. వీరి పెళ్ళికి వసుధ తండ్రి ఒప్పుకోక పోవడంతో వీరిద్దరూ గుడిలో పెళ్ళిచేసుకుని సుఖంగా జీవించడం మొదలుపెడతారు. కార్తీక్ తన కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి కష్టం రాకుడదని ఆలోచిస్తుంటే వసుధ కార్తీక్ తో ఎక్కువ సమయం గడపాలనుకుంటుంది. రెండు ఒకేసారి జరగని విషయాలు కనక వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. తనతో కలిసి బ్రతకడం వసుధకు ఇష్టం లేదని తెలుసుకున్న కార్తీక్ తనపై ఉన్న ప్రేమతో తనకి విడాకులిస్తానని తన తండ్రి దగ్గరికి పంపిస్తాడు.ఇదంతా విన్న తరువాత కూడా సంధ్య కార్తీక్ ను ప్రేమిస్తునే ఉంటుంది. వసుధ స్థానంలో తనుండుంటే కార్తీక్ ను వదులుకోనని, అర్థంచేసుకునేదానినని భావిస్తుంది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దాకా సాగిన వీరి ప్రయాణంలో సంధ్య కార్తీక్ ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటుంది. విశాఖపట్నం చేరుకున్నాక కార్తీక్ సంధ్యని తన ఇంటికి రమ్మంటాడు. అక్కడ తన తల్లి తండ్రులకు సంధ్యను మీ కాబోయే కోడలని పరిచయం చేసిన కార్తీక్ ఆశ్చర్యపోయిన సంధ్యకు నిజం చెప్పేస్తాడు. తన చేతుల మీదుగా జరిగిన తన సనెహితులు రవి-కల్పికల పెళ్ళి తను చెప్పిన కథలాగే సాగిందని తనని అర్థంచేసుకునే అమ్మాయిని పొందాలని కార్తీక్ ఆశపడుతుంటాడు. ఇటలీలో సంధ్యను చూసి ప్రేమలో పడ్డ కార్తీక్ తనను సంధ్య అర్థంచేసుకోవాలని ఈ కథను తన కథగా చెప్తాడు కార్తీక్.
దానితో కార్తీక్ పై కోపంతో సంధ్య రగిలిపోయింది. తనని పిచ్చిదాన్ని చేసి, లేని పోనివి చెప్పి తన నమ్మకాన్ని దెబ్బతీశావని కార్తీక్ ని నిందిస్తుంది. నిన్ను మర్చిపోవడం కష్టమని తెలిసినా కచ్చితంగా నిన్ను కలవనని చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కార్తీక్ మొదట బాధపడ్డా తరువాత ఎప్పటిలాగే సహనంతో జీవిస్తుంటాడు. తన తల్లి (జయసుధ) సలహా మీద సంధ్య తనని ఎంతగానో ప్రేమిస్తున్న తన బావ గౌతం (నారా రోహిత్) ని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. గౌతంతో కార్తీక్ గురించి చెప్పిన సంధ్య ఆ తర్వాత కార్తీక్ ని మర్చిపోలేక పోతుందన్న విషయాన్ని గౌతం గ్రహిస్తాడు. నిశ్చితార్థం ఉదయాన గౌతం సంధ్య వేలికి ఉంగరం తొడగటానికి వెనుకాడుతూ తను కార్తీక్ ని కలిసిన విషయం సంధ్యకూ, తమ కుటుంబాలకీ చెప్తాడు.
సంధ్యను పెళ్ళిచేసుకోబోతున్నాని గౌతం కార్తీక్ కు చెప్పడానికి తనుండే చోటికి వెళ్తాడు. కానీ తన మదిలో మెదిలే కొన్ని సందేహాలకు జవాబిమ్మంటాడు గౌతం. అబద్ధం చెప్తే సంధ్య బాధపడుతుందని తెలిసినా తనకి ఎందుకు అబద్ధం చెప్పారని కార్తీక్ ని అడిగాడు. కార్తీక్ తను చెప్పిన అబద్ధం తన, సంధ్య, రవి, కల్పికల జీవితాలకు ముఖ్యమైనదనీ, తను చెప్పిన అబ్వద్దాన్నే అర్థంచేసుకోలేని సంధ్య తనను ఏమాత్రం అర్థంచేసుకోలేదని తెలుసుకున్నాని చెప్తాడు. తన పెళ్ళి గురించి చెప్పడానికి వెళ్ళిన గౌతం కార్తీక్ మనస్తత్వానికీ, మనోబలానికీ తన ధైర్యం, నమ్మకం కోల్పోతాడు. సంధ్యకు తనకంటే కార్తీక్ సరైన జీవిత భాగస్వామి అని వివరిస్తాడు.
ఇదంతా విని కార్తీక్ తో కలిసి బ్రతకాలని సంధ్య కార్తీక్ ఇంటికి వెళ్తుంది. కానీ కార్తీక్ తల్లిదండ్రుల ద్వారా తను సంధ్యను కలవకూడదని నిర్దాక్షిణ్యంగా ఊటీ వెళ్ళిపోయాడని తెలిసి కుమిలిపోతుంది. మూడు నెలల తర్వాత తను కూడా ఊటీ వెళ్ళి కార్తీక్ ని కలుస్తుంది. అప్పటికే గతాన్ని మర్చిపోలేక బెదిరి పారిపోతున్న కార్తీక్ ని ఆపి తన ప్రేమను తెలియజేస్తుంది. కార్తీక్, సంధ్య కలవడంతో కథ సుఖాంతమౌతుంది.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం యొక్క పాటలని ఆదిత్య మ్యూజిక్ వారు 2012 డిసెంబరు 5 న మార్కెట్లో నేరుగా విడుదల చేసారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం యొక్క పాటలకి ప్రెక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
పాట | గాయకులు | నిడివి | రచన |
---|---|---|---|
"మేడ్ ఫర్ ఈచ్ అదర్" | దేవి శ్రీ ప్రసాద్ | 4:26 | రామజోగయ్య శాస్త్రి |
"జగ జగ జగదేక వీర" | వేణు, రాణినారెడ్డి | 4:47 | రామజోగయ్య శాస్త్రి |
"రచ్చ రంబోల" | జావెద్ అలి, రీట | 4:19 | శ్రీ మణి |
"గుస గుస" | సాగర్, సునీత | 3:37 | అనంత శ్రీరాం |
"కాటుక కళ్ళు" | 'ఖుషీ' మురళి, శ్వేత మోహన్, చిన్న పొన్ను | 3:58 | చంద్రబోస్ |
123తెలుగు తమ సమీక్షలో "సారొచ్చారు క్లీన్ ఫ్యామిలీ సినిమా. రవితేజ నుండి కిక్ కోరుకునే వారు నిరాశ పడతారు కానీ పరుశురాం చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం అభినందనీయం. పెళ్ళికి ముందు ప్రేమ ఇంపార్టెంట్ కాదు పెళ్లి తరువాత ప్రేమ ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం చేసాడు" అని చెప్పారు.[5] వన్ ఇండియా తమ సమీక్షలో "ఏదైమైనా రవితేజ రెగ్యులర్ కామెడీ,యాక్షన్ సినిమాలుకు వెళ్లి ఎంజాయ్ చేసేవారికి ఈ చిత్రం పెద్దగా కిక్ ఇవ్వదు..... ఫ్యామిలీలకు వీకెండ్ లో ఈ చిత్రం మంచి ఆఫ్షనే. అద్బుతం కాకపోయినా ఓకే అనిపిస్తుంది. ప్రేమలో ఉండి త్వరలో పెళ్లి చేసుకుందామనుకునే వాళ్లు అయితే ఒకసారి ఈ చిత్రం చూస్తే ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉంది" అని చెప్పారు.[6]