సుమ కనకాల | |
---|---|
![]() | |
జననం | సుమ 1974 మార్చి 22 కేరళ, భారతదేశం |
వృత్తి | వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాజీవ్ కనకాల |
పిల్లలు | ఇద్దరు.. రోషన్, మనస్విని |
బంధువులు | లక్ష్మీదేవి కనకాల (అత్తగారు), దేవదాస్ కనకాల (మామగారు) |
సుమ (జననం: మార్చి 22, 1974) ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో (యాంకర్లలో) ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.[1]
కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, వ్యాఖ్యానం (యాంకరింగ్) చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం (యాంకరింగు) చేసి మంచి గుర్తింపును పొందింది.టివీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ (ఆడియో రిలీజు) కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది. 1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప. సుమ తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి పి.విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు.సుమ తల్లిదండ్రులు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండటంతో సహజంగా తెలుగు భాషమీద పట్టు సాధించింది. చదువులో ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో, తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటుంది. ఆమె 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.[2]