సులేమాన్ అల్-తాజిర్ (అరబిక్: سليمان التاجر) పర్షియా (ఇరాన్) కు చెందిన ఒక అరబ్ వ్యాపారి, యాత్రికుడు, రచయిత. వ్యాపారంలో భాగంగా సుమారు క్రీ.శ 850 ప్రాంతాలలో భారతదేశం, చైనా లలో పర్యటించి, తన యాత్రా విశేషాలను నమోదు చేసాడు. అతను పాల సామ్రాజ్యపు కాలంలో బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) సందర్శించి, అక్కడ తయారవుతున్న సన్నని, నాజూకైన నూలు వస్త్రాల నాణ్యతను చూసి అబ్బురపడ్డాడు. ముఖ్యంగా చైనాను టాంగ్ రాజవంశం పాలిస్తున్న కాలంలో సులేమాన్ గ్వాంగ్‌జౌ (చైనా లోని కాంటన్ రేవు) కు చేసిన ప్రయాణాలు, అక్కడి విశేషాల గురించిన అతని వర్ణనలు బాగా ప్రసిద్ధి పొందాయి. క్రీ.శ. 851లో చైనాలో తయారైన పింగాణీ నాణ్యతను చూసి అతను ఆశ్చర్యపోయాడు.
సులేమాన్ అల్-తాజిర్ గురించి పెద్దగా వివరాలు తెలియవు. ఇతను పర్షియాకు చెందిన ఒక వ్యాపారి. ఇతనికున్న రెండవ పేరు "అల్-తాజిర్"ను బట్టి, ఇతను ఒక "వ్యాపారి" అని కూడా నిర్ధారితమవుతున్నది.[1] అతని నివాస స్థలం బందర్ సిరాఫ్ (ప్రస్తుతం ఇరాన్ లోని ఒక నగరం). క్రీ.శ. 9 వ శతాబ్దపు మధ్యకాలంలో అతను వ్యాపార నిమిత్తం, ఇరాక్ నుంచి చైనా వరకు రాకపోకలు సాగిస్తూ ఉండేవాడు. అతను బాగ్ధాద్ నుంచి సరుకులతో బయలుదేరి బస్రా నుండి భారతదేశం, చైనాలకు నౌకా మార్గంలో ప్రయాణం చేసి, తిరుగుప్రయాణంలో చైనా నుంచి సరుకులు కొనుగోలు చేసి నౌకా మార్గంలో బస్రా లో దిగి, ఆపై బాగ్ధాద్కు చేరుకొనేవాడు. చరిత్రలో సులేమాన్ సౌదాగర్ (సులైమాన్ వ్యాపారి) గా ప్రసిద్ధికెక్కిన ఇతను క్రీ.శ 850 కాలంలో బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్), చైనాలను సందర్శించాడు. అతను భారత, చైనాలకు జల మార్గంలో ప్రయాణించినపుడు, తన యాత్రా విశేషాలను, సందర్శించిన దేశాలలోని ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ, క్రీ.శ. 851 ప్రాంతంలో తన ప్రయాణ కథనాన్ని ఆసక్తికరంగా రాశాడు. ఇతని యాత్రా కథనం "చైనా , భారతదేశ ప్రసిద్ధ సంబంధం" (Aḥbār aṣ- Ṣīn wa l-Hind) గ్రంథంలోని మొదటి భాగంగా వెలువడి చరిత్ర ప్రసిద్ధికెక్కింది.
హిందూ మహాసముద్రంలో సుడిగాలులవల్ల ఏర్పడే జల స్తంభాలను ([[:en:waterspout|waterspout) వర్ణిస్తూ ఆకాశంలోకి తెల్లటి మేఘం ఓడపైకి ఒకేసారి వ్యాపిస్తుందని, అది తన పొడవైన సన్నని తెల్లని నాలుకను సముద్ర ఉపరితలమీదకి చిమ్ముతుందని, ఆ అద్భుతమైన సుడిగాలి వర్షంలో చిక్కుకున్న నావలు కల్లోలభరితమవుతాయని వర్ణించాడు.
సులేమాన్ బస్రా (ఇరాక్) నుంచి చైనాకు జల మార్గంలో రాకపోకలు సాగిస్తున్నప్పుడు, దారి మధ్యలో దక్షిణ భారతదేశ తీరాన్ని చుట్టి వెళ్ళేవాడు. అతను హిందూ మహాసముద్రాన్ని దారియా-ఎ-హరగంద్ (దక్షిణ భారతదేశాన్ని తాకే సముద్రం) అని పిలిచాడు. ఇక్కడ 1900 దీవులున్నాయని, అన్నింటికంటే చివరిగా వున్న దీవి సిరని ద్వీపం (Sirandip సిలోన్) అని పేర్కొన్నాడు.[2] ఇక్కడ కొబ్బరి చెట్లు పుష్కలంగా ఉన్నాయని, సముద్రంలో అంబర్ గుట్టలుగుట్టలుగా ఉత్పత్తి అవుతుందని, ప్రజలు మంచి కష్టజీవులని, అక్కడ సంపదను గవ్వలతో కొలుస్తారని, దీవులను ఒక స్త్రీ పరిపాలిస్తున్నదని, ఆమె కోశాగారం గవ్వలతో నిండిపోయివుందని రాసాడు.[2] సిరవీ ద్వీపంలో ముత్యాల సాగు అవుతుందని, అక్కడ ఒక పెద్ద పర్వతంపై 70 మూరల పొడవున్న ఆదాము (Adam) పాదాల యొక్క రాతి ముద్రలను చూశానని వర్ణించాడు. [3]
అతను భారతదేశంలోని మరి కొన్ని ద్వీపాలను వివరిస్తూ, ఆ ద్వీప ప్రజలకు చాలా బంగారం ఉందని తెలుపుతూ అక్కడి వింత ఆచారాన్ని వివరించాడు. ఆ ద్వీపంలో పురుషులు, పోరాటంలో తన శత్రువు తల నరికి తెచ్చేంత వరకు వివాహం చేసుకోకూడదనే ఒక ఆచారం ఉంది. ఒక తలను నరికితే, అతను ఒకరిని మాత్రమే వివాహం చేసుకొంటాడు. ఒకవేళ యాభై మంది తలలను నరికినట్లయితే, అతను యాభై మంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. రమని (Ramni) వంటి దీవులలోను, అండమాన్ దీవులలోను నరమాంస భక్షకులున్నారని తెలిపాడు.
చైనా కంటే భారత్ రెండింతలు పెద్దదని, అయితే చైనాలో జనసాంద్రత ఎక్కువగా ఉందన్నాడు.[4] [5] చైనాతో పోలుస్తే, భారతదేశంలో రాజ్యాల సంఖ్య చాలా ఎక్కువని వెల్లడించాడు.[4]
ఆనాడు దక్షిణ భారతదేశ తీరప్రాంతంలో విస్తరించిన నాలుగు పెద్ద రాజ్యాల గురించి వివరించాడు.[6] వాటిల్లో మొదటిది బల్హారా (Bulhara) (రాష్ట్రకూటులు) రాజ్యం. సముద్ర తీరంలో వున్న ఈ రాజ్యం కుంకుం (కొంకణ) సరిహద్దు నుంచి ప్రారంభమై ఆసియా ఖండంలోపలి భాగానికి విస్తరించివుంది. దీని రాజుకు అరబ్బులతో చక్కని మైత్రి ఉండేదని తెలిపాడు.[6] నిజానికి అరబ్బుల పట్ల బల్హారా రాజుకు మించిన అభిమానం ఉన్న రాజు వేరొకడు లేడని, అతను భారతదేశ సార్వభౌమాధికారిగా గుర్తించబడ్డాడని, అతను తన చుట్టూరా వున్న అనేక శత్రు రాజులతో యుద్ధాలు కొనసాగిస్తూ ఎల్లప్పుడూ విజయం సాధించేవాడని సులేమాన్ వివరించాడు. [7] బల్హార (వల్లభ) అనేది భారతీయ రాజులందరికీ సాధారణంగా వర్తించే ఒక బిరుదు (title) మాత్రమే. నేడు బల్హారా రాజ్యాన్ని రాష్ట్రకూటుల రాజ్యంగా భావిస్తున్నారు. [8]
రెండవది హరాజ్ లేదా గుర్జర్ (Haraj/ Gujra) రాజ్యం: దీని రాజు గుర్జర ప్రతీహార మిహిర భోజుడు. సులేమాన్ సౌదాగర్ ప్రఖ్యాత (గుర్జర్) ప్రతీహార చక్రవర్తి మిహిర భోజుని రాజ్యాన్ని వర్ణించాడు. "రాజు భారీ సైన్యాన్ని నిర్వహించేవాడని, అతని సైన్యంలో మేలుజాతి గుర్రాలు, ఒంటెలు అసాంఖ్యంగా ఉండేవి. అతనితో పోల్చదగిన అశ్వికదళం మరే ఇతర భారతీయ రాజుకు లేదు.[8] [9] రాజ్యం సిరిసంపదలతో తులతూగుతుంది. అతని రాజ్యంలో దొంగల భయమనేది లేదు. కానీ దేశం మొత్తంలో మహ్మదీయ మతానికి అతన్ని మించిన విరోధి లేడు." [6]అంటూ సులేమాన్, మిహిర భోజుడు ముస్లింలకు బద్ద శత్రువుగా వున్నాడని తెలియచేసాడు.[9]
మూడవ రాజ్యం తాసెక్ (Tasek). ఇది నేటి ఔరంగాబాద్ (మహారాష్ట్ర) పరిసర ప్రాంతంగా భావించబడింది. అంత ప్రముఖమైన రాజ్యం కానప్పటికీ వీరు కూడా అరబ్బులతో మైత్రి నెరిపేవారు. నాల్గవది రహామీ (Rahmi). రహామీ రాజ్యాన్ని బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతంతో కూడిన పాల రాజ్యంగా భావించబడింది. ఈ రహామీ రాజ్యపు రాజులకు అత్యధిక సంఖ్యలో కోటలు ఉండేవని, వారి ఆధీనంలో భారీ సేనలు ఉన్నాయని, రాజ సైన్యంలో 50 వేల ఏనుగులు వున్నాయని,[6] ఈ రాజుకు చక్కని నూలు వస్త్రాలు ధరించడం ప్రీతి అని పేర్కొన్నాడు.
భారతీయ రాజులకు ఎంత సైన్యం ఉన్నప్పటికీ, వారు తమ సైనికుల జీతాలివ్వడం గాని, సైన్యాన్ని నిర్వహించడానికి అవసరమయ్యే ఖర్చుల గురించి పట్టించుకోరు. పవిత్ర యుద్ధం జరిగినప్పుడు మాత్రమే రాజు సైన్యాన్ని పిలుస్తాడు. చైనాలో, సైనికులకు అరబ్బుల మాదిరిగానే జీత భత్యాలు చెల్లిస్తారు. [5]
యుద్ధాన్ని ఒక సాహస క్రీడగా భావించే ఆనాటి భారతీయ రాజులు, ఏ చిన్న అవకాశం దొరికినా, కీర్తికాముకత్వంతో బలప్రయోగాలకు దిగేవారు. దీన్ని సూచిస్తూ సులేమాన్, "భారతదేశపు రాజులు తమ పొరుగురాజ్యాలను ఆక్రమించుకోవాలనో, రాజ్య విస్తరణ కాంక్షతోనో యుద్దాలు చేసేవారు కారు.[10] ఓడిన రాజ్యాన్ని గెలిచిన రాజ్యంలో విలీనం చేసుకొన్న సంఘటన ఒక్కటి కూడా తన దృష్టికి రాలేదు" అని పేర్కొన్నాడు.[10] ఇతని యాత్రాకథనంలో భారతదేశంలోని యుద్ధ రాజ్యాలు, వారి సైనిక పాటవం గురించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. అదే సమయంలో చైనాలో అటువంటి యుద్ధ శక్తుల గురించి అసలు ప్రస్తావించక పోవడం గమనార్హం.
భారతదేశంలోని శిక్షాస్మృతి గురించి సులేమాన్ వివరిస్తూ, వ్యభిచారానికి పాల్పడితే వధించేవారు. దొంగతనానికి పాల్పడితే మాత్రం అది ఎంత చిన్న మొత్తమైనప్పటికీ మరణ శిక్ష విధించేవారు. బందిపోట్లకు, దారిదోపిడీలకు ఉరిశిక్ష పడేది అని తెలిపాడు. భారతదేశంలో దొంగలకు శిక్షగా వారి ఆసనంలో పదునైన శూలాన్ని గుచ్చి, అది వారి కంఠాన్ని చీల్చుకొని బయటకు వచ్చేంత వరకు దానిపై నించోబెట్టి భయంకరంగా శిక్షించేవారని అతను రాశాడు. చైనాలో కూడా దొంగలకు (దొంగిలించిన విలువతో నిమిత్తంలేకుండా) దొరికిన వెంటనే మరణశిక్ష అమలుచేసేవారు.[6]
భారతదేశంలో ఒక పురుషుడు ఒక స్త్రీని లేవదీసుకొనిపోతే వారిరువురినీ చంపేసేవారు.[11] ఒకవేళ అందులో స్త్రీ ప్రమేయమేమీ లేదని తేలితే మాత్రం పురుషునికి మాత్రమే మరణ శిక్ష పడేది. ఒకవేళ అందుకు స్త్రీ సమ్మతి కూడా ఉందని తేలితే, ఇరువురికీ మరణశిక్ష విధిస్తారు.[11] [12]
భారతదేశంలో మరణ శిక్షార్హమైన కేసులలో నేర విచారణ ప్రక్రియలో నిజ నిర్దారణ కోసం దివ్య పరీక్షలు నిర్వహించేవారు.[13] ఎర్రగా కాల్చిన ఇనుప వూసలతో అరచేతులపై వాతలు పెట్టి, 3 రోజుల తరువాత ఆ చేతులపై కాలిన చిహ్నాలు కనిపించకపోతే అతన్ని అమాయకుడని నిర్ధారించేవారు. అతనిపై తప్పుడు ఆరోపణలను చేసిన ఫిర్యాదిదారుడు నిలువెత్తు బంగారాన్ని రాజుకు సమర్పించుకొనేవాడు.[13] మరికొన్నిసార్లు సలసల కాగే నీటిలో ఇనుప ఉంగరం వేసి, దానిని చేతులతో తీయమనేవారు. సులేమాన్ "నేను స్వయంగా ఈ పరీక్షకు నిలబడ్డ ఒకరిని చూసాను. అతని చేతులకి గాయాలు కాపోవడంతో అతనిపై నేరం ఆరోపించిన వ్యక్తి, నిలువెత్తు బంగారాన్ని రాజుకు సమర్పించుకొన్నాడు" అని దివ్య పరీక్షలను వివరించాడు.[14] భారతదేశంలో నిజాలు రాబట్టడానికి చెరసాలలో వున్న వ్యక్తులకి 7 రోజుల పాటు అన్న పానీయాలు ఇవ్వకుండా మాడ్చేవారు.[15]
న్యాయపాలనలో భారతదేశంలో కన్నా, చైనాలో మెరుగైన స్థితి వుండేదని సూచిస్తూ, చైనాలో ధర్మగంటల ఉనికిని వెల్లడించాడు. చైనాలో ప్రతీ రాజ్యంలోను, ప్రతీ నగరంలోనూ, ఆ నగర గవర్నర్ కార్యాలయం వద్ద తప్పనిసరిగా ధర్మ గంటలు ఏర్పాటు చేయబడ్డాయని, న్యాయార్థులు, వీటికి కట్టిన తాడును లాగి ఆ ధర్మ గంటను మోగిస్తే, ఆ నగర గవర్నర్ సమక్షంలో వారికి న్యాయం జరిగేదని సులేమాన్ విశిష్టంగా తెలిపాడు.[16]
భారతదేశంలో అనేక చెట్లున్నప్పటికీ ద్రాక్ష, ఖర్జూరం లేవని సులేమాన్ రాసాడు.[4] అదేవిషంగా అరేబియాలో లేని ఓ ప్రత్యేకమైన చెట్టు భారతదేశంలో ఉందని రాసాడు. బహుశా అది మామిడి చెట్లు గురించి రాసి ఉంటాడని భావిస్తున్నారు. భారతదేశంలోను, చైనాలోనూ తాటి చెట్లను చూడటం మామూలు విషయం కాదు.[4] అరబ్బులు తెలీని ఎన్నో రకాల చెట్లు ఈ రెండు దేశాలలోను ఉన్నాయి.[4] చైనాలో కన్నా భారతదేశంలోనే దానిమ్మ చెట్లు పుష్కలంగా ఉంటాయి.[4]
భారత్, చైనాలలో చిరుతపులులు, తోడేళ్ళు వున్నాయి కానీ ఇరుదేశాలల్లోను సింహాలు మాత్రం లేవు అని రాసాడు.[15] భారతదేశంలో విశిష్టంగా కనిపించే ఒంటికొమ్ము ఖడ్గమృగాన్ని వర్ణిస్తూ, ఏనుగులు కూడా దానిని చూసి భయపడతాయని తెలిపాడు.[17] భారతదేశంలో కంటే చైనా లోనే గుర్రాలు అత్యధికంగా ఉన్నాయి.[18] కానీ చైనాలో ఏనుగులు లేవు. [18] ఏనుగులు శకున జంతువులు కావడంతో చైనీయులు వాటి ఉనికిని సహించలేకపోవడమే దీనికి కారణం.[5]
కొంతమంది భారతీయులు అడవులలో నివసిస్తారు. వారు వన మూలికలు, పండ్లు తప్ప మిగతా అన్నింటికీ దూరంగా ఉంటారు. వారు (సన్యాసులు) స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండటంకోసం తమ శరీర గుప్త అవయవాలను ఇనుప కట్టులతో (Iron buckles) బిగిస్తారు.[19] [12] మరికొందరు నగ్నంగా తిరుగుతూ సూర్యునికి అభిముఖంగా నిలబడి ఉంటారు.[14] "సూర్యుడికి అభిముఖంగా తన ముఖాన్ని తదేకంగా నిలిపి ఉంచిన భంగిమలో ఉన్న వ్యక్తిని చూశాను. దాదాపు 16 ఏళ్ల తర్వాత భారతదేశానికి తిరిగొచ్చినప్పుడు అతను అదే స్థలంలో, అదే భంగిమలో ఉండటాన్ని చూశాను. అతను సూర్యుని వేడికి తన కంటి చూపును కోల్పోకపోవడం నన్ను విస్తుపోయేలా చేసింది." అంటూ సులైమాన్ వివరించాడు.[19][12]
శరీర శుభ్రతలో భారతీయుల, చైనీయుల మధ్యగల వైరుధ్యాలను ప్రస్తావిస్తూ, ప్రతిరోజూ, భారతీయులు తమను తాము శుద్ధి చేసుకోవడానికి ఉదయం పూట ఆహారం తీసుకునే ముందు విధిగా స్నానం చేస్తారు. కొన్నిసార్లు రోజుకు అనేక సార్లు కూడా స్నానం చేస్తారు. [6] అయితే భార్యలతో సంభోగించిన తరువాత స్నానం చేసే అలవాటు భారతీయులకు గాని, చైనీయులకు గాని లేదు.[20]
భారతీయులు నోటి పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యతనిస్తారు. భారతీయులు నోరు శుభ్రం చేసుకోకుండా, స్నానం చేయకుండా ఆహారం తినరు. కానీ చైనీయులు అలా చేయరు.[6] [20] అలాగే చైనీయులకు మలవిసర్జన తర్వాత శుభ్రం చేసుకోవడం తెలియదు. వారు కేవలం కాగితంతో తుడుచుకుంటారు అని వివరించాడు.[6] [20]
భారతీయులు తమ ముఖాలపై పొడవాటి గడ్డాలు పెంచుతారు. మూడు మూరల పొడవున్న గడ్డాన్ని తాను స్వయంగా చూశానని సులేమాన్ పేర్కొన్నాడు.[20] ఆప్తులు చనిపోతే ప్రజలు తల గొరికించుకొని, గడ్డాలు తీసేసేవారు.[15] ముసల్మానుల మాదిరిగా మీసాలను చక్కగా కత్తిరించుకోవడం (Trimming) భారతీయులకు తెలీదు.[20] చైనీయులలో చాలా మందికి సహజంగానే గడ్డాలు లేవు అని తెలిపాడు.[15] భారతీయులు, చైనీయులు ఎవరూ కూడా సున్తీ చేసుకోలేదు.[15]
భారతీయుల ప్రధాన ఆహారం బియ్యం. వారు గోధుమలు తినరు.[11] చైనీయులు బియ్యం, గోధుమలు రెండింటినీ ఆహారంగా స్వీకరిస్తారు.[11] చైనీయులు బియ్యంతో చేసిన ఒక రకమైన వైన్ (wine)ను సేవిస్తారు.[21] భారతదేశంలో కొన్ని దీవులలోని ప్రజలు హుక్కా తింటారు, త్రాగుతారు కూడా అని తెలిపాడు.
భారతీయులు ఓ వస్త్రాన్ని (ధోవతి) మొలకు చుట్టుకొని, దానినే ఉత్తరీయంగా కూడా వేసుకొంటారు. స్త్రీ-పురుషులిరువురూ బంగారు ఆభరణాలను ధరిస్తారు. బెంగాల్లో తయారైన సన్నని నాజూకైన నూలు వస్త్రాల ఘనతను చూసి సులేమాన్ సౌదాగర్ చాలా ఆశ్చర్యపోయాడు. "భారతదేశంలో తయారైన వస్త్రాలు ప్రపంచంలో మరెక్కడా తయారు కావు. అవి ఎంత సన్నగా ఉంటాయంటే ఒక తాను గుడ్డ సైతం ఓ చిన్న ఉంగరంలో పడుతుంది. ఇవి నూలు వస్త్రాలు. నేను వీటిని స్వయంగా చూసాను."
9 వ శతాబ్దంలో తత్వ, వైద్య, ఖగోళ శాస్త్రాలలో భారతదేశం ఎంతో ముందంజలో వుందని సూచిస్తూ సులేమాన్ "భారతీయులు తత్వశాస్త్రంలోను, వైద్య శాస్త్రంలో సిద్ధహస్తులు. చైనీయులు వైద్యశాస్త్రంలో నిపుణులు. చైనీయులకన్నా భారతీయులే ఖగోళశాస్త్రాన్ని ఎక్కువగా అభ్యసిస్తున్నారు. అరబిక్ మాట్లాడని మహమ్మదీయులు భారతదేశంలో ఎవరూ లేరు." అని పేర్కొన్నాడు. [5]
భారతీయులు, చైనీయులు ఇరువురూ, తాము పూజించే విగ్రహాలు మాట్లాడతాయని వూహించుకొంటారు.[20] పైగా వాటితో సంభాషిస్తూ, సమాధానాలు కూడా ఇచ్చేవారని సులేమాన్ పేర్కొన్నాడు.[15] అదేవిధంగా ఇరు దేశీయులు మాంసం కోసం మేకల మూతుల మీద చచ్చేంతవరకు బాది చంపుతారు. అంతే తప్ప మహ్మదీయుల మాదిరిగా వారికి మేకల గొంతును కోసి చంపే అలవాటు లేనే లేదు.[15]
భారతీయులు తమ భార్యలు ఋతుస్రావం సమయంలో వున్నప్పుడు వారిని అసలు తాకరు. పైగా వారిని ఇంటిబయట కూర్చోబెడతారు.[4] దీనికి విరుద్ధంగా చైనీయులు తమ భార్యలు ఋతుస్రావం సమయంలో వున్నప్పుడు కూడా వారితో చక్కగా సంపర్కం పెట్టుకొంటారు. [22] వారితో కలిసిమెలసి తిరుగుతారే తప్ప వారిని ఇంటిబయట కూర్చోబెట్టే అలవాటు చైనీయులకు లేదు.[4]
సులేమాన్ సిరనీ ద్వీప (సిలోన్) రాజు అంత్యక్రియలు స్వయంగా చూసాడు.[12] భారతీయులు శవాలను దహనం చేసే ఆచారాన్ని సార్వత్రికంగా పాటిస్తారు అని తెలియచేసాడు.[14] భారతదేశంలో 9 వ శతాబ్దంలో సతీ సహగమన ఆచారం ఉందని సులేమాన్ పేర్కొంటూ, ఇక్కడ రాజు చనిపోతే అతని భార్యలు చితినిప్పులో దూకి అతనితో పాటు సజీవంగా దహనమయ్యేవారని, అయితే రాణుల కిష్టం లేకపోతె వారికిది తప్పనిసరి కాదని వివరించాడు.[14]
సులేమాన్ టాంగ్ రాజవంశకాలంలో గ్వాంగ్‌జౌ లో దిగి చైనా దేశాన్ని సందర్శించాడు. చైనా దేశపు భౌగోళిక స్థితిగతులు, రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలను తన యాత్రాకథనంలో పొందుపరిచాడు.
సులేమాన్, చైనాలో టీ (తేనీరు) గురించి ప్రస్తావించిన తొలి మధ్యప్రాచ్య యాత్రికుడు (Middle Eastern traveler), తొలి చైనీయేతర రచయితగా పరిగణించబడ్డాడు. చైనా రాజు పట్టు (సిల్క్) వ్యాపారం, ఉప్పు క్వారీల నుండి వచ్చే ఆదాయాన్ని తన కోసం ప్రత్యేకంగా ఉంచుకుంటాడని సులేమాన్ వ్యాపారి తెలిపాడు. చైనీయుల తేనీటి పానీయాన్ని సూచిస్తూ, చైనీయులు ఒక రకమైన మూలికలను వేడి నీటిలో కలుపుకొని తాగుతారు. ఈ వేడినీటి పానీయాన్ని సఖ్ అని పిలుస్తారు. ఈ రకమైన మూలికలను పుష్కలంగా విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా రాజు తనకోసం రిజర్వ్ చేసుకుంటాడని ఆయన వివరించారు.
చైనీయులకు సొంత మతం లేదని సులేమాన్ తెలియచేసాడు. వారు ఆచరించే మతం (బౌద్ధం) భారతదేశం నుండి స్వీకరించబడింది. వారి కోసం విగ్రహాలను తెచ్చిన భారతీయులను, చైనీయులు వారి మత గురువులుగా భావించారు.[5] చైనా, భారతదేశ ప్రజలు ఆత్మల పరకాయప్రవేశాలను (metaempsychosis) నమ్ముతారు.[4] [22] ఇరువురూ ఒకే మతపరమైన సూత్రాలను విశ్వసిస్తున్నప్పటికీ, వారి మత సూత్రాలు స్పృశించే అనేక అంశాలలో వారు విభేదిస్తున్నారు.[4] చైనీయులు విగ్రహారాధకులైనప్పటికీ వారి ఆరాధనా శైలి తన స్వంత మతానికి దగ్గరగా ఉందని సులైమాన్ గ్రహించాడు.[15] [20]
ఇళ్ల నిర్మాణంలో ఇరు దేశాల మధ్య కనిపించిన తేడాలను ప్రస్తావిస్తూ సులేమాన్ సౌదాగర్, చైనీయుల ఇళ్లు, గోడలు ఎక్కువగా కలపతో తయారు చేయబడ్డాయని,[20] భారతీయులు తమ ఇళ్లను రాళ్లు, ప్లాస్టర్, బంకమట్టి, కాల్చిన ఇటుకలతో నిర్మించుకుంటారని వివరించాడు.[11] చైనీయులు కూడా కొన్నిసార్లు ఇదేవిధంగా తమ ఇళ్లను నిర్మిస్తారు. భారతీయులకు తమ ఇళ్ల గచ్చులపై బండలు పరిపించే అలవాటు లేదు అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు.
సులేమాన్ చైనాలో భూమి శిస్తు లేదని, పోల్ టాక్స్ (తలకింత పన్ను పద్ధతి) ఉండేదని, అది పురుషులపై మాత్రమే ఉండేదని, అది కూడా ఆ వ్యక్తి యొక్క స్తోమత, స్థితిగతుల బట్టి నిర్ణయమయ్యేదని తెలియచేసాడు.[23] చైనాలో మగపిల్లవాడు పుట్టిన వెంటనే అతని పేరు ప్రభుత్వ రిజిస్టర్ లలో నమోదవుతుంది. దానితో అతనికి 18 ఏళ్ళు నిండినప్పుడు, పోల్ టాక్స్ పరిధిలోకి సహజంగానే వచ్చి పన్ను చెల్లిస్తాడు.[24]
భారతీయుల కన్నా చైనీయులు చాలా అందంగా వుంటారు.[25] అందంలో వారు అరబ్బులకు కొంత దగ్గరగా వుంటారు. ముఖ వర్చస్సులోనే కాక ధరించే దుస్తులలోను, వేడుకలలోను, ఊరేగింపులలలోను, గుర్రపు స్వారీలోను, పద్ధతులలోను అన్ని విధాలా చైనీయులు, భారతీయుల కన్నా మిన్నగా వుంటారు.[25] చైనీయులు పొడుగాటి దుస్తులు, నడుము చుట్టూ బెల్టులు, దట్టీలు ధరిస్తారు.[25] భారతీయులు ధోవతిని, పైన ఉత్తరీయాన్ని ధరిస్తారు. చైనాలో గుడ్డివాళ్ళు, ఒంటికన్ను వాళ్ళు, వికృతంగా వున్నవాళ్ళు ఎక్కువగా లేరు. ఇటువంటివారు భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు. [26]
సులేమాన్ 9వ శతాబ్దపు భారతదేశం, చైనా దేశాలను తులనాత్మకంగా పరిశీలించిన మీదట, భారతదేశం కన్నా చైనా మరింత అభివృద్ధి చెందుతున్న దేశం అని గుర్తించాడు. [5] భారతదేశంలో చాలా రాజ్యాలకు, ఎడారులు తప్ప సరైన నగరాలు లేవు.[18] దీనికి విరుద్ధంగా చైనాలో ప్రతీ ప్రాంతంలోనూ అత్యధిక సంఖ్యలో కోటలతో కూడిన పెద్ద పెద్ద నగరాలు వున్నాయిని తెలిపాడు.[18] భారతదేశంలో కన్నా చైనాలోనే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన శీతోష్ణస్థితి ఉన్నాయని తెలియచేసాడు [5]
చైనాలో 200 కు పైగా నగరాలు ఉన్నాయని, చైనాకు అతి ముఖ్యమైన రేవు కాన్షు (Cansu) (ఇది ప్రస్తుత గ్వాంగ్‌జౌ లేదా కాంటన్ రేవు పట్టణం) అని, ఈ రేవు నుంచే అరబ్బులు చైనాలో అడుగుపెట్టేవారని సులేమాన్ పేర్కొన్నాడు. [27] క్రీ.శ. 851లో, అతను టాంగ్ రాజవంశ కాలంలో గ్వాంగ్‌జౌకు వెళ్లి చైనీస్ పింగాణీ, గొప్ప మసీదు, ప్రభుత్వ వ్యవస్థ మొదలైనవాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
అతను కాంటన్ రేవు పట్టణాన్ని (ప్రస్తుత గ్వాంగ్‌జౌ) సందర్శించినప్పుడు, అక్కడి స్థానిక అధికారులు విదేశీ సందర్శకుల గుర్తింపును ట్రాక్ చేయడానికి వేలిముద్ర రికార్డులను ఉపయోగించారని, దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక పన్నులు విధించారని పేర్కొన్నాడు. తరచుగా కురిసే వర్షాలు, సముద్రపు దొంగల కారణంగా చైనాకు దారితీసే సముద్రమార్గం ప్రమాదకరమైనదిగా వర్ణించాడు. చైనా సముద్రంలో కొన్ని ప్రాంతాలలో ఎగిరే చేపలు ఉండేవని, వాటిని సముద్ర మిడతలని (sea locust) పిలిచేవారని తెలిపాడు.
గ్వాంగ్‌జౌ పట్టణంలో నివసించే స్థానిక ముస్లిం జనాభాకు సొంత మసీదు, బజార్ లు ఉన్నాయని తెలియచేసాడు. అంతేకాక అక్కడి స్థానిక ముస్లిం వర్గానికి స్వంతంగా ఇమామ్లు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వీరిని టాంగ్ చక్రవర్తి జువాన్‌జాంగ్ నియమించేవారు.[28] అక్కడి పింగాణీ తయారీ సాంకేతికతను పరిశీలించిన సులైమాన్ అక్కడ తయారవుతున్న పింగాణీ నాణ్యతను చూసి ఆశ్చర్యపోయాడు. గ్వాంగ్‌జౌలోని ధాన్యాగార వ్యవస్థను (storage system), గ్వాంగ్‌జౌ నగర పాలక సంస్థ, తన విధులను నిర్వహిస్తున్న తీరును కూడా పరిశీలించి తన యాత్రా కథనంలో నమోదు చేసాడు.[29]
సులైమాన్ యొక్క యాత్రా కథనం "అబ్బర్ అష్- సిన్ వా ఎల్-హింద్" (Aḥbār aṣ- Ṣīn wa l-Hind) గ్రంథంలోని మొదటి భాగంగా వెలువడి చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఈ అరబిక్ గ్రంథాన్ని తరచుగా "ట్రావెల్స్ ఆఫ్ ది మర్చంట్ సోలేమాన్" అని, "చైనా , భారతదేశ ప్రసిద్ధ సంబందాలు" (Famous Relation of China and India) అని కూడా పిలుస్తారు. ఈ అరబిక్ మాన్యుస్క్రిప్ట్ బాగ్దాద్ ఖలీఫత్ కు సదూరతీరాలలో వున్న దూర ప్రాచ్యం (Far East) లోని స్థితి గతులను వివరిస్తుంది. రెండు భాగాలుగా వున్న ఈ గ్రంథ మొదటి అర్ధ భాగానికి రచయితగా సులేమాన్ గుర్తించబడ్డాడు. దీనిలో సులైమాన్ వ్యాపారి తెలిపిన యాత్రా విశేషాలు తొలి భాగమైతే దానిని కొనసాగింపుగా రెండవ భాగంలో హసన్ ఇబ్న్ యాజిద్, అబూ జైద్ అల్ సిరాఫీలు (Abu Zaid Hassan al-Sirafi) చేసిన యాత్రా వర్ణనలు ఉంటాయి. క్రీ.శ. 851 నాటి ఈ గ్రంథ రచన 910 నాటికి పూర్తయింది.
భారత, చైనాలను సందర్శించిన విఖ్యాత ఇటలీ యాత్రికుడు మార్కోపోలో పర్యటనకు నాలుగు శతాబ్దాల ముందే, పర్షియన్ వ్యాపారి సులేమాన్ ఆల్ తాజిర్ భారత, చైనాలలో పర్యటించడం (క్రీ.శ 850 ప్రాంతంలో) జరిగింది. ఇతను భారతదేశాన్ని పాల, ప్రతీహార, రాష్ట్రకూట రాజులు పాలిస్తున్న కాలంలో బెంగాల్ ను, టాంగ్ రాజవంశకాలంలో చైనా దేశాన్ని సందర్శించాడు. తన ప్రయాణంలో ఇరుదేశాల ప్రజల యొక్క (9 వ శతాబ్దపు) స్థితిగతులను తులనాత్మకంగా పరిశిలించి, ఆసక్తికరమైన విశేషాలను తన యాత్రా కథనంలో పొందుపరిచాడు. ఇతని ప్రధాన ఉద్దేశం వ్యాపారమే అయినప్పటికీ, దానిలో భాగంగా ఇతను పొందుపరిచిన యాత్రా కథనం ఇతనికి చాలా పేరు తెచ్చిపెట్టింది.
సులేమాన్ యాత్రా కథనం "అబ్బర్ అష్- సిన్ వా ఎల్-హింద్" (Aḥbār aṣ- Ṣīn wa l-Hind) పేరిట క్రీ.శ. 851 లో అరబిక్లో ప్రచురించబడింది. మొత్తం మీద ఈ గ్రంథం క్రీ.శ. 9 వ శతాబ్దపు చైనా-భారతదేశాల గురించి అరబ్బులు, పర్షియన్లకు తెలిసిన సమాచారాన్ని సంకలనం చేసిందని చెప్పవచ్చు. ఇతని యాత్రాకథనం ద్వారనే 9 వ శతాబ్దపు భారత, చైనా దేశాల భౌగోళిక స్థితిగతులు, రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలను అరబ్ ప్రపంచం తెలుసుకోగలిగింది. తరువాతి కాలపు అరబిక్ భౌగోళిక శాస్త్రవేత్తలు ఇబ్న్ ఖోర్దాద్బే, అల్-మసూది వంటి వారు భారతదేశం, చైనాల గురించిన సమాచారం కోసం ఈ గ్రంథంపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఇది శతాబ్దాలుగా అరబ్ భౌగోళిక శాస్త్రవేత్తలకు ఒక ముఖ్య ఆధారవనరు (resource) గా నిలిచింది. ముఖ్యంగా టైఫూన్లలో కనిపించే జలస్తంభం వంటి అద్భుత వాతావరణ దృగ్విషయాలను, తిమింగలం లేదా అంబర్ వంటి సముద్ర విశేషాలను వివరిస్తున్నప్పుడు సులేమాన్ యొక్క వర్ణనలో కొంత కల్పన వున్నప్పటికీ, మొత్తం మీద ఇతని సముద్ర ప్రయాణం (Voyage), సముద్ర శాస్త్రాలకు (marine science) సంబంధించిన మొట్ట మొదటి అరబిక్ రిఫరెన్స్ (సూచన)గా పరిగణించబడింది.
సులేమాన్ ఆల్ తాజిర్ భారతదేశ యాత్రా వివరణను సమకూర్చిన మొట్టమొదటి అరబ్ యాత్రికుడు. తరువాతి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు యాకూబి (క్రీ.శ. 9 వ శతాబ్దం), మౌసూది (Al Masudi) (క్రీ.శ. 10 వ శతాబ్దం), ఇబ్న్ హాకల్ (Ibn Haqwal) (క్రీ.శ. 10 వ శతాబ్దం) లకు ఇతను మార్గదర్శకుడయ్యాడు.
ఇతని యాత్రాకథనం భారతదేశపు భౌగోళిక వివరాలతో పాటు, 9వ శతాబ్దపు భారతదేశంలో నెలకొని వున్న అనిశ్చిత రాజకీయ స్థితిగతులు, నేర విచారణ-శిక్షలు, మతం, సాంఘిక జీవనం, సన్యాసులు, మూఢ నమ్మకాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాల గురించిన వివరాలను ఆసక్తికరంగా తెలియచేస్తుంది. అదే విధంగా 9వ శతాబ్దపు చైనీయుల మతం, పన్నులు, ఇళ్ల నిర్మాణం, నగరాలు, ఆచార వ్యవహారాలు, పాలన గురించిన విశేషాలను వివరిస్తుంది. ముఖ్యంగా చైనీయుల తేనీటిని (tea) గురించి తొలిసారిగా ప్రస్తావించిన మధ్యప్రాచ్యపు యాత్రికుడు సులేమన్ మాత్రమే. ఇతని రాతల బట్టే చైనీయుల తేనీటి (tea) సేవనం గురించి తొలిసారిగా అరబ్ ప్రపంచానికి వెల్లడైంది. చైనా-భారతదేశాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను, విడివిడిగానే కాక తులనాత్మకంగా పోలుస్తూ చెప్పడం ఇతని యాత్రాకథనంలోని మరొక ప్రత్యేకత.
సులేమాన్ పొందుపరచిన వివరణలు బట్టి 8వ శతాబ్దంలో చైనా నగరీకరణలో అభివృద్ధి సాధిస్తే, భారతదేశం శాస్త్రజ్ఞానంలో ముందంజలో వుంది అని తెలుస్తుంది. చైనీయులతో పోలిస్తే భారతీయులు వ్యక్తిగతంగా శరీర పరిశుభ్రతలో మెరుగైన స్థాయిలో వున్నప్పటికీ, సామాజికపరంగా మూఢ నమ్మకాలతో వెనుక బడ్డారని తెలుస్తుంది. అయితే అందంలోనూ, వస్త్రధారణలోనూ, మర్యాద పద్ధతులలో (manners) చైనీయులు, భారతీయుల కన్నా మిన్నగా వుంటారని సులేమాన్ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో కన్నా చైనాలో న్యాయపాలన ప్రశంసార్హమైనది అని విదితమవుతున్నది. భారతీయులు, చైనీయులు-ఇరువురూ విశ్వసించే మతసూత్రాలు మౌలికంగా ఒకే రకంగా వున్నప్పటికీ, మతపరమైన అంశాలలో వారి మధ్య అనివార్యమైన విభేదాలు కూడా ఉన్నాయని అతని రాతల వల్ల తెలుస్తుంది. సులేమాన్ నిష్పాక్షిక పరిశీలనలను బట్టి, స్వయంగా చూసి చేసిన వ్యాఖ్యల బట్టి మొత్తం మీద 9వ శతాబ్దంలో భారతదేశం కన్నా చైనా మరింత అభివృద్ధి చెందుతున్న దేశం అని వెల్లడవుతున్నది.
Jewel of Chinese Muslim’s Heritage [3], Mohammed Khamouch, FSTC Limited, 2005
He was undoubtedly one of the outstanding political figures of India in ninth century and ranks with Dhruva and Dharmapala as a great general and empire builder.