సెల్లప్పన్ నిర్మల (జననం 1952 లేదా 1953) 1986 లో భారతదేశంలో మొదటి హెచ్ఐవి కేసును కనుగొన్న భారతీయ వైద్యురాలు. 1985 లో 32 సంవత్సరాల వయస్సులో, ఆమె చెన్నై లో మైక్రోబయాలజీ విద్యార్థిగా పనిచేస్తోంది. తన పరిశోధన కోసం, రక్త నమూనాలను సేకరించి, వాటిని హెచ్ఐవి కోసం పరీక్షించడం ప్రారంభించింది, వాటిలో భారతదేశంలో సేకరించిన మొదటి పాజిటివ్ నమూనాలు కూడా ఉన్నాయి.
నిర్మల ఒక సాంప్రదాయ భారతీయ కుటుంబంలో పెరిగింది. ఆమె భర్త వైద్య పరిశోధనకు వెళ్ళమని ప్రోత్సహించాడు. 1982 లో తన గురువు ప్రొఫెసర్ సునీతి సోలమన్ నుండి వైరస్ గురించి పరిశోధించాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. [1] ఆ సమయంలో, హెచ్ఐవి అనేది దేశంలో సామాజికంగా నిషిద్ధ పదం. ముంబై, పూణే నుండి సేకరించిన రక్త నమూనాల్లో హెచ్‌ఐవి పాజిటివు ఫలితాలు రాలేదు.
అధిక హెచ్‌ఐవి ముప్పు ఉందని అనుమానించిన సమూహాల నుండి సుమారు 200 రక్త నమూనాలను ఈ పరిశోధనలో భాగంగా సేకరించారు, వీటిలో నిర్మల సేకరించినవి 80 ఉన్నాయి. చెన్నైలో పరీక్షా సౌకర్యాలు లేకపోవడం వల్ల, సోలమన్ వాటిని 200 కిలోమీటర్ల (120 మైళ్ళు) దూరంలో ఉన్న వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి & ఆసుపత్రిలో పరిశోధించేలా ఏర్పాట్లు చేశారు. [2] భారతదేశంలో హెచ్ఐవి ఉందని ఈ నమూనాల్లో తేలింది. ఈ సమాచారాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు పంపించగా, అది ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి, తమిళనాడు ఆరోగ్య మంత్రి హెచ్ వి హండేలకు తెలియజేసింది. [3] తరువాత హెచ్ ఐవి దేశంలో అంటువ్యాధిగా మారింది. [4]
1987 మార్చిలో తమిళనాడులో ఎయిడ్స్ కోసం నిఘా అనే పరిశోధనా వ్యాసాన్ని సమర్పించిన నిర్మల ఆ తర్వాత చెన్నైలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌లో చేరింది. ఆమె 2010 లో పదవీ విరమణ చేసింది.