సెల్వరాఘవన్ | |
---|---|
![]() | |
జననం | సెల్వరాఘవన్ కస్తూరి రాజా 1977 మార్చి 5 చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | శ్రీ రాఘవ |
వృత్తి | సినీ దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
సెల్వరాఘవన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా తుళ్ళువదో ఇల్లమై కోసం స్క్రిప్ట్ మీద పని చేసిన రాఘవ తరువాత వరుసగా కాదల్ కొండేన్, 7G బృందావన్ కాలనీ లాంటి ప్రేమ చిత్రాలు తీశాడు. తరువాత పుదుపేట్టై, మాయాక్కం ఎన్న లాంటి గ్యాంగ్ స్టర్ సినిమాలు తీశాడు. కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా తీశాడు. రాఘవ నేరుగా తెలుగులో తీసిన సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. [1]
సెల్వరాఘవన్ 1977 మార్చి 5 న చెన్నైలో జన్మించాడు. తండ్రి కస్తూరి రాజా ప్రముఖ సినీ దర్శకుడు. ఇతనికి మరో ప్రముఖ నటుడైన ధనుష్ తమ్ముడు. అంతేకాక ఇతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ వైద్యులే. ఇతనికి చిన్నప్పుడే రెటీనా సంబంధిత క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఒక కన్ను తొలగించాల్సి వచ్చింది. అందుకని బయటకు వచ్చేటప్పుడు ఎక్కువగా కళ్ళద్దాలతో కనిపిస్తుంటాడు. డిసెంబరు 15, 2006న ఇతని మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ళ వైవాహిక జీవితం తర్వాత ఆగస్టు 9, 2009 న వీరిద్దరూ చెన్నైలోని ఓ కుటుంబ న్యాయస్థానంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తరువాత జూన్ 19, 2011న తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ పి. ఎస్. రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఇతనితో ఒక సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసి ఉన్నది.[2] ఈ దంపతులకు జనవరి 19, 2012 న లీలావతి అనే ఓ కూతురు కలిగింది.[3] అక్టోబరు 7, 2013 న ఓంకార్ అనే కుమారుడు పుట్టాడు.[4]
సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా సినీ నేపథ్యం కలవాడే అయినా తన పిల్లలను బాగా చదువుకోమని ప్రోత్సహించాడు. దాంతో సెల్వ మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.ఇ చేశాడు. కానీ అందులో తాను సరిపోనని భావించి వివిధ రంగాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండేవాడు. కొద్ది రోజులకు తాను రచయితగా పనిచేయడమంటే ఇష్టమని తెలుసుకున్నాడు. 1997లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తాన రాసిన కథలను చేతపట్టుకుని నిర్మాతల కోసం తిరిగాడు కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వలేదు. దాంతో అతను ఇంటిపట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. 2000 లో తన తండ్రి కస్తూరి రాజాకు కూడా అవకాశాలు సన్నగిల్లడంతో కుటుంబం ఆర్థికంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నది. తమ దగ్గర మిగిలున్న సొమ్ములతో తుళ్ళువదే ఇల్లమై అనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 2002 లో వచ్చిన ఈ సినిమాకు సెల్వరాఘవన్ కథ నందించాడు. ఇందులో అతని తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. ఆరుగురు హైస్కూలు కుర్రాళ్ళ కథతో తయారైన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చాడు. ఈ సినిమాకు మొదట్లో అంతంత మాత్రమే ఆదరణ వచ్చినా టీనేజర్ల నుంచి మంచి స్పందన వచ్చి చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సెల్వరాఘవన్ నిజానికి ఆ సినిమాకు దర్శకత్వం వహించింది తానేనని, డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవడం కోసం అప్పటికే దర్శకుడిగా పేరున్న తన తండ్రి కస్తూరి రాజా పేరు వాడుకున్నానని చెప్పాడు.