సైరా నరసింహా రెడ్డి | |
---|---|
దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
రచన | సాయి మాధవ్ బుర్రా (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | సురేందర్ రెడ్డి |
కథ | పరుచూరి సోదరులు |
నిర్మాత | రాం చరణ్ తేజ |
తారాగణం | చిరంజీవి అమితాబ్ బచ్చన్ (అతిథి పాత్ర జగపతి బాబు సుదీప్ విజయ్ సేతుపతి నయన తార అనుష్క శెట్టి తమన్నా రవి కిషన్ నీహారిక కొణిదెల |
ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | Songs: అమిత్ త్రివేది[1][2] Score: Julius Packiam |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | UV Creations (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ) Excel Entertainment AA Films (హిందీ డబ్బింగ్ వెర్షన్ ) |
విడుదల తేదీ | 2 అక్టోబరు 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.[3][4] ఈ సినిమా టీజర్ 2018 ఆగస్టు 20 న విడుదల అయ్యింది.[5]
చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా సినిమా తీయాలని చాలా కాలంగా చర్చలు నడిచాయి. అయితే వివిధ నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావటంతో విసిగిపోయి చివరికి ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లుగా రాంచరణ్ జూలై 2017లో ప్రకటించాడు.[3]
"తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద సినిమాలలో ఇది కూడా ఒకటి అవుతుంది. దీనికి బడ్జెట్ ఇంత అని కేటాయించలేదు. నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతటినీ నేనే భరిస్తాను. ఎందుకంటే ఈ సినిమా, నాన్నగారి చిరకాల స్వప్నం" అని టీజర్ విడుదల తర్వాత ఒక ముఖాముఖిలో రాం చరణ్ తెలిపారు.[6]
"నీ రెండవ సినిమాలోనే నువ్వు యుద్ధవీరుని పాత్ర పోషించావు. 150 సినిమాలు చేసినా నాకు అలాంటి అవకాశం రాలేదు. " అని నాన్నగారు నాతో ఒక మారు అన్నారు. ఈ పాత్రపై ఆయనకు ఒకింత ఈర్ష్య కూడా కలిగింది. ఆ రోజు నుండే ఆయన కలను నిజం చేయటానికి ఇటువంటి చిత్రం నిర్మించాలని అనిపించేదని రాం చరణ్ తెలిపారు.
సురేందర్ రెడ్డి వంటి యువ దర్శకుడు ఇంత భారీ ప్రాజెక్టుకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగలరా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ "ప్రతిభకు మాకు కొదవ లేదు. అన్ని రకాల సినిమాలు చేయాలి. సినిమా కోసం తాను చేసిన పరిశోధన, అందించిన పకడ్బందీ స్క్రిప్టుతో మేము అనుకొన్న దానికంటే సురేందర్ చాలా ఎక్కువగానే కష్టపడ్డాడు." అని రాం చరణ్ తెలిపారు.
సినిమా విజయవంతం అవుతుందా అనే ప్రశ్నకు "జయాపజయాల గురించి నేను పెద్దగా పట్టించుకోదలచుకోలేదు. ఫలితం ఏదయినా నేను సంతోషంగానే ఉంటాను ఎందుకంటే నాన్నగారి కలను నిజం చేయటానికి మేము శాయశక్తులుగా ప్రయత్నిస్తున్నాము. స్క్రిప్టుకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాము. వ్యక్తిగతంగా మాత్రం అన్ని రికార్డులను ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టాలని నేను కోరుకొంటున్నాను." అని తెలిపారు.
ఇదే ముఖాముఖిలో సురేందర్ రెడ్డి, "మేము చాలా పరిశోధించాం. బ్రిటీషు ప్రభుత్వం నరసింహారెడ్డికి విధించిన మరణ శిక్షలో అతని గురించి క్షుణ్ణంగా తెలిపింది. 10,000 మంది సైన్యంతో నరసింహారెడ్డి బ్రిటీషు ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చిరంజీవిగారి సినిమాలను మొదటి వరుసలో కూర్చొని చూసేవాడిని. ఇప్పుడు ఆయన సినిమాకే దర్శకత్వం వహించటం, పైగా అమితాబ్ వంటి వారు ఈ సినిమాలో ఉండటం నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. అమితాబ్ గారైతే కేవలం చిరంజీవిగారి కోసమే ఈ సినిమాకు ఒప్పుకున్నారు. తర్వాత నేను కథ చెప్పటంతో అది ఆయనను ఆకట్టుకొంది. వారు సంతోషంగా సినిమా చేయటానికి అంగీకరించారు." అని తెలిపారు.
చిరంజీవి గురువుగా కేవలం ఒక చిన్న పాత్ర పోషించటం, చిరంజీవితో ఉన్న అనుబంధంతో అమితాబ్ తన పాత్రకు గాను పారితోషికం తీసుకోవటానికి నిరాకరించారు. పారితోషికం స్వీకరించమని చిరంజీవి ఒత్తిడి చేసిననూ అమితాబ్ సున్నితంగా తిరస్కరించారు. అయితే చిరంజీవి అమితాబ్ కు మూడు కోట్ల విలువ గల నగలను బహూకరించారని సినీ పరిశ్రమ చెప్పుకొంటున్నట్లు హన్స్ ఇండియా పేర్కొంది.[7]
చిరంజీవి 62వ పుట్టినరోజున తన అభిమానులకు కానుకగా రాం చరణ్ తేజ, 2017 ఆగస్టు 22న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. బ్రిటీషు దుష్పరిపాలనను ఎదురించిన తొట్టతొలి వీరుడు, ప్రపంచానికి తెలియని యోధుని చరిత్ర, బ్రిటీషు నియంతృత్వాన్ని నిరసించిన తపస్వి, రేనాటి సూర్యుని వీరగాథ అనే ఉపశీర్షికలతో ఈ మోషన్ పోస్టర్ ప్రారంభమవుతుంది. దూరంగా ఉన్న ఒక కోటపై తగలబడుతోన్న బ్రిటీషు జెండా, కోట గోడలపై బ్రిటీషు వ్యతిరేక నినాదాలు చేస్తున్న భారతీయులు, కోట గోడ క్రింద యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల శవాల కుప్పలు, వీటన్నింటినీ ఒక ఎత్తైన ప్రదేశం నుండి చూస్తోన్న నరసింహారెడ్డి ఈ మోషన్ పోస్టర్ లో కనబడటం జరుగుతుంది. 18వ శతాబ్దపు ఆహార్యంలో ఉన్న చిరంజీవి విల్లంబులు ధరించటమే కాక ఒక ఖడ్గాన్ని కూడా చేతబూని ఉంటాడు. చిట్టచివరన సై రా నరసింహారెడ్డి అనే కేక వినబడగా, దానికి వంత పాడుతూ మరి కొందరు సై సై రా అని అరవటంతో మోషన్ పోస్టర్ అంతమౌతుంది.[8]
విడుదలైన 24 గంటలలోనే ఒక మిలియను వ్యూ లను నమోదు చేసుకొని ఈ మోషన్ పోస్టర్, తెలుగు సినీ పరిశ్రమలోనే రికార్డు నెలకొల్పినది.[9]
ఈ చిత్ర కథానాయికగా నయనతారను ఎంచుకోవాలని చిత్ర బృందం పరిశీలించింది.[4] మరో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను సంప్రదించారు.[10][11] కన్నడ నటుడు ఉపేంద్రని ప్రత్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు.[3]
ఐతే 2017 ఆగస్టు 22 న కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా విడుదల చేసిన ఒక వీడియోలో ముఖ్య తారగణం, సాంకేతిక నిపుణులు ప్రకటించబడ్డారు. ఈ వీడియో ప్రకారం అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, నయనతార, విజయ్ సేతుపతిలు ముఖ్య తారాగణం.[12]
బాలీవుడ్ చారిత్రక కల్పితాలైన రాం లీలా, బాజీరావ్ మస్తానీ లకు పనిచేసిన డిజైనర్ అంజు మోదీని ఈ చిత్రంలో దుస్తులను, ఆభరణాలను కూర్చటానికి ఎంపిక చేసుకొన్నారు. అదివరకే పలు చిత్రాలలో చిరంజీవికి దుస్తులను కూర్చిన అతని పెద్ద కుమార్తె సుస్మిత అంజుకు సహాయంగా ఉన్నారు.[13]
కాస్ట్యూములు ఖరారు చేయటానికే ఏడాది పట్టినట్లు సుష్మిత తెలిపారు. "అప్పటి తరం వాడే నూలు, వాటి రంగులు వేరు. వాటిని యథాతథంగా చూపటానికి చేనేత నిపుణులను సంప్రదించవలసి వచ్చింది." అని తెలిపారు.
"ఇది కల్పిత కథ కాదు, ఒక చారిత్రక గాథ. ఆ తరం ఆహార్యాన్ని అర్థం చేసుకోవటానికి పలు పుస్తకాలను, ఇతర మూలాలను చదవవలసివచ్దింది. నరసింహా రెడ్డి ఛాయాచిత్రాలు లేవు. కేవలం ఒక చిత్రపటం మాత్రమే ఉంది. ఒకే ఒక చిత్రపటం చూసి ఒక సినిమానే చేసేయాలనుకోవటం కథకు అన్యాయం చేయటమే అవుతుంది. పాలెగాళ్ళ గురించి అప్పటి తరం ఇతర మనుషుల గురించి తెలుసుకోవలసి వచ్చింది. అప్పటి రవాణా, ఆయుధాలు, సరుకు-సరంజామా, ఇంటిలో వినియోగించబడే వస్తువులపై NIFT కు చెందిన విద్యార్థి బృందంతో కలిసి పరిశోధన చేయవలసి వచ్చింది. అంజు మోది నుండి వస్త్రాలు తెప్పించాం కానీ, మా సమిష్టి కృషి ఫలించలేదు. మా అవసరాలను తాను అర్థం చేసుకోలేకపోయేది. అందుకే నేను హైదరాబాదు మకాం మార్చా. కళ లో రాజీవన్, ఆహార్యం లో నేను పరిశోధనలు జరిపాం. మొదట కేవలం నాన్నగారి దుస్తులను మాత్రం డిజైన్ చేయాలనుకొన్నా. కానీ తర్వాత నయన్/తమన్నా ల దుస్తుల బాధ్యతలను కూడా తీసుకొన్నా. నాన్నగారికి ముదురు రంగుల దుస్తులను వాడాము. ఖద్దరు, ముల్ ములు, పట్టు వంటి వస్త్రాలను వాడాము. అప్పట్లో భారతదేశం లో చేనేతలకు లోటు లేదు." అని సుష్మిత తెలిపారు [14]
ఈ సినిమాకి కావలసిన సెట్టింగులను రాజస్థాన్, కేరళలోని పొల్లాచ్చిలలో వేసారు.[15]
2017 సెప్టెంబరులో షూటింగు ప్రారంభం కావలసింది. అయితే ముందు తెలుపబడినట్లుగా కాకుండా కెమెరామెన్ రవి వర్మన్ బదులుగా రత్నవేలును తీసుకొనవలసి వచ్చింది. కానీ రత్నవేలు అప్పటికే రాం చరణ్ తేజ నటిస్తున్న రంగస్థలంకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు. దీనితో ఈ చిత్రం యొక్క షూటింగు ప్రారంభం ఆలస్యంగా మొదలయినది.[16]
2017, డిసెంబరు 6న హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విట్టెకర్ దర్శకత్వంలో ఒక కీలక పోరాట సన్నివేశంతో చిత్రం షూటింగు మొదలైనది.[17]
అప్పటి తరం దుస్తులు భారీగా ఉండటం యుద్ధ పరికరాలు ఇతర సామాగ్రి చాలా సమయం మోయటం వలన చిరంజీవికి సాయంత్రం కల్లా భుజం నెప్పి వేసేదని, తోలుతో చేసిన పాదరక్షలు చాలా సమయం వరకు వేసుకోవటం వలన అవి అతని పాదాలని కరిచేవని, అయినా చిరంజీవి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని సుష్మిత తెలిపింది. వీలైనన్ని సౌకర్యాలను చిరంజీవికి కల్పిస్తున్నామని, తాను ఈ ప్రాజెక్టుకు పనిచేయటం అతనికి కూడా గర్వకారణమేనని చెప్పుకొచ్చింది.
2018 ఆగస్టు 20 న ఈ చిత్రం యొక్క టీజర్ విడుదలయ్యింది.[18]
భారతీయులను బానిసలుగా వాడుకొంటున్న సన్నివేశాల మధ్యలో, బ్రిటీషు రాజ్యాన్ని ఎదురించిన మొదటి సగటు భారతీయుడు, 18వ శతాబ్దానికి చెందిన, చరిత్ర మరచిన వీరుడి కథ అని ఉపశీర్షికలను చూపుతూ, సమ్మెట పోట్లకు గురవుతోన్న ఖడ్గాన్ని చూపించి, నల్లని దుస్తులలో పెద్ద కోటపై విప్లవ బావుటాను ఎగురవేస్తోన్న నరసింహారెడ్డిని పరిచయం చేస్తుంది ఈ టీజర్. "ఈ యుద్ధం ఎవరిది?" అని సామాన్య పౌరులను ప్రేరేపిస్తూ ప్రశ్నించిన నరసింహారెడ్డికి వారు, మనది అని సమాధానమివ్వటం టీజర్ లో చూడవచ్చు. ఆగ్రహంతో ఊగిపోతున్న ఒక తెల్లదొర, ఆంగ్ల యాసలో నా-ర-షి-మ్మా-రె-డ్డీ! అని అరవగా ఖడ్గాన్ని తిప్పుతూ గుర్రం పై పొదలమాటు నుండి ఆ పాత్రలో చిరంజీవి కెమెరా ముందుకు రావటం అభిమానులను ఉర్రూతలూగించింది. చివరగా "Happy Birthday to Mega Star Chiranjeeevi" అని 2019 లో విడుదల అనే ఉపశీర్షికలతో టీజర్ ముగుస్తుంది.
నరసింహారెడ్డిగా చిరంజీవిలో తీవ్రత కనబడిందని, చిత్ర వర్గం చాలా పరిశోధన చేసినట్టు అనిపించిందని, ఇటువంటి టీజర్ గురించి తమ పాఠకులకు తెలియజేయగలగటం తమకు గర్వకారణమని వార్తా పత్రికలు ప్రచురించాయి. అమితాబ్ నరసింహారెడ్డికి గురువు పాత్ర అని, విజయ్ సేతుపతి నరసింహారెడ్డికి నమ్మిన బంటు అయిన ఓబయ్య పాత్ర అని, నయన తారకి నరసింహారెడ్డి భార్య అయిన రాజకుమారి నయనా దేవి పాత్ర అని, తమన్నాకి తమిళ్ అనే యువతి పాత్ర అనీ ఇతర పాత్రలలో సుదీప్, జగపతి బాబు, హుమా కురేషీ, రవి కిషన్ లు ఉన్నారని తెలిపాయి.[19][20][21]
తమన్నా తన ట్వీటులో, "సాహసం, పట్టుదల, స్వాతంత్రాల పురాణ గాథను ఆస్వాదించండి. జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవిగారు, మీ ప్రతిభతో మమ్మల్ని ఎప్పటికీ ఇలానే రంజింపజేయాలని కోరుకొంటున్నాను!" అని పేర్కొన్నది.[22]
విడుదలైన 24 గంటలలోనే కోటి ఇరవై లక్షల వ్యూస్ సాధించినట్లు, తెలుగు సినీ చరిత్రలోనే ఇది రికార్డుగా చిత్ర యూనిట్ ప్రకటించారు [23].
చిత్రం ముగింపులో ఎనిమిది నిముషాల నిడివిగల పోరాట సన్నివేశం చిత్రీకరించటానికి 54 కోట్లు ఖర్చు అయ్యాయని ఇండియా టుడే ప్రచురించింది [24]. మొత్తం చిత్రం నిర్మించటానికి 200 కోట్లు ఖర్చు అవ్వవచ్చని ఒక లెక్క వేసింది. తాను ముందుగానే చెప్పినట్లు రాం చరణ్ నిర్మాణ వ్యయం విషయంలో వెనుకడుగు వేయనట్లు పేర్కొంది.
ఈ పోరాట సన్నివేశం జార్జియాలో చిత్రీకరించబడింది. చిత్ర యూనిట్ 150 మందిని హైదరాబాద్ నుండి జార్జియాకు తీసుకెళ్ళింది. వీరితో బాటు 600 మంది స్థానికులను కూడా సన్నివేశం కోసం సమకూర్చుకొంది. ఒక బహిరంగ మైదానంలో ఐదు వారాలుగా ఈ పోరాట సన్నివేశం చిత్రీకరించబడింది.
2017 నవంబరులో అన్నపూర్ణ స్టూడియోస్లో 2 కోట్ల విలువ గల సెట్ సామాగ్రిని నాశనం చేస్తూ ఒక మారు, 2019 మేలో కోకాపేట్ లో 3 కోట్ల విలువ గల సెట్ సామాగ్రిని బూడిద చేస్తూ రెండవ మారు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి [25].
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక రోజు ముందుగా మెగా అభిమానులకు ఒక "చిరు" కానుకతో ఆశ్చర్యంతో ముంచెత్తింది. షూటింగ్ ఎలా తీయబడిందో చూపిస్తూ ద మేకింగ్ అనే వీడియోను విడుదల చేసింది.[26]
అదివరకు విడుదలైన టీజర్ లో నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కోట పై నిలబడి విప్లవ బావుటా ఎగురవేసే సన్నివేశం ఉంది. ఆ కోట నిర్మాణపు దృశ్యాలతో మేకింగ్ వీడియో ప్రారంభం అవుతుంది. కర్నూలు, కడప జిల్లాలతో బాటు మద్రాసు ప్రెసిడెన్సీ దక్షిణ భాగపు మ్యాపు, ఆ యుగంలో వినియోగించబడిన యుద్ధ సామాగ్రి దృశ్యాలతో మేకింగ్ వీడియో వీక్షకులను ఆకట్టుకొంది. కొన్ని పోరాట సన్నివేశాల తర్వాత లీ విట్టేకర్ స్వయానా కనిపించి ఆంగ్లంలో "మీరు మునుపెన్నడూ చూడని పోరాట సన్నివేశాలను చూస్తారు" అని తెలుపుతాడు. పొడవాటి నదిలో తెప్పలపై తరలి వెళుతోన్న సైనికులు, వాటికి దర్శకత్వం వహిస్తూ ఎత్తైన ప్రదేశం నుండి సురేందర్ రెడ్డి; తారాగణాన్ని ధ్రువపరుస్తూ చిత్రంలో వారి దృశ్యాలతో అప్పటి వరకు సినిమా ముందుకెళుతుందా అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చింది. నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి పరుగులు, కత్తి-డాలులు చేతబూని ఉగ్రమైన అవతారంలో ఆంగ్లేయుల నరమేథం సృష్టించే సన్నివేశాలతో వీడియో అంతం అవుతుంది. టీజర్ 2019 ఆగస్టు 20 అని ఈ వీడియో ప్రకటించింది.[27]
2019 ఆగస్టు 20 న చిత్రం యొక్క అధికారిక టీజర్ విడుదలైంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద హిందు, Chiranjeevi roars like a lion in new ‘Sye Raa Narasimha Reddy’ teaser (చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్ లో సింహం లా గర్జించారు) అని పేర్కొంది.[28]. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో టీజర్ విడుదలైంది.
పవన్ కళ్యాణ్ నేపథ్య సంభాషణలతో అధికారిక టీజర్ ప్రారంభం కావటంతో మెగా అభిమానులలో పండగ వాతావరణం నెలకొంది. భారతదేశం ఇప్పటికీ జాతీయ వీరులను తలచుకొంటూనే ఉందని, కానీ దేశం మరచిన వీరులు కూడా కలరని, వారిలో రేనాటి సూర్యుడు నరసింహా రెడ్డి అని తెలిపే పవన్ సంభాషణలు ఆగిపోవటం, రౌద్రంతో రగిలిపోయే చిరంజీవి కళ్ళు కనబడటం ఒకే సారి జరుగుతాయి. చిరంజీవి గుర్రపు స్వారీ, కొన్ని పోరాట సన్నివేశాలతో పరిచయం అవుతాడు. తర్వాత రేనాటి ప్రజలకు ప్రేరణనిస్తూ చిరంజీవి సంభాషణ దృశ్యాలు కనబడతాయి. భారతదేశం మరచిన తొలి విప్లవ వీరుడిని కలవండి (Meet the first rebellion that India has forgotten) అనే వాక్యాలు, తెల్లదొరలను చీల్చి చెండాడుతున్న నరసింహారెడ్డి మరిన్ని పోరాట సన్నివేశాలు కనబడతాయి. చివరగా కత్తి పట్టి కదం త్రొక్కుతున్న చిరంజీవి దృశ్యంతో టీజర్ అంతం అవుతుంది. 02 అక్టోబరున తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలౌతోందని టీజర్ ఖరారు చేసింది [29].
తెలుగు టీజర్ లో పవన్ చేసిన సంభాషణలు, మలయాళంలో మోహన్ లాల్ చేశారు [30] .
అమెజాన్ ఇండియా, ఈ చిత్రం తాలూకు ప్రచారానికి సంబంధించిన హక్కులను సొంతం చేసుకొనటానికి ఆసక్తి చూపింది. 192 దేశాలలో చలామణి అయ్యే అమెజాన్ ప్రైం వీడియోస్ లో ఈ చిత్రం యొక్క ప్రచార దృశ్యాల చోటుకు 30 కోట్ల బేరాన్ని తెలిపింది.[36]
1. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం [37]
2. రేనాడు వీరులారా! చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి [38]
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి బదులుగా సైరా నరసింహారెడ్డి అని పేరు మార్చటం ఉయ్యాలవాడ స్థానికులకు నచ్చలేదు. ఇది ఒక స్వాతంత్ర్య సమరయోధుని జీవితగాథ అని, అతని పేరు మార్చటం సమంజసం కాదని, చిత్ర బృందానికి తమ అభిప్రాయభేదం తెలుపుతామని వారు తెలిపారు.[39]
మోషన్ పోస్టర్లో వినబడే నేపథ్య సంగీతం రెహమాన్ కూర్చినది కాదని, ఎస్ ఎస్ థమన్ కూర్చినది అని థమన్ ట్వీట్ చేయటంతో దుమారం రేగినది. అయితే మొదట దీనిని కేవలం ప్రాంతీయ చిత్రంగా రూపొందించాలనే ఆలోచనతో థమన్ ను సంగీతదర్శకుడిగా ఎంపిక చేయటం జరిగినదని, చివరి నిముషంలో ఇది ఒక అంతర్జాతీయ స్థాయి చలనచిత్రంగా నమోదు కావాలనే ఉద్దేశంతో రెహ్మాన్ ను ఎంపిక చేశామని సురేందర్ రెడ్డి తనతో చెప్పి తాను కూర్చిన సంగీతాన్నే మోషన్ పోస్టర్లో ఉపయోగిస్తామని తనకు ముందే తెలిపినట్లు కూడా థమన్ ట్వీట్లలో అంగీకరించాడు. కానీ మోషన్ పోస్టర్ లో ఎక్కడా తన పేరు కనబడకపోవటంతో నిరాశకు లోనయ్యాడని, అందుకే, తనకు తానే ఈ విషయాన్ని సాంఘిక మాధ్యమాల ద్వారా తెలుపదలచుకొన్నాడని థమన్ తెలిపారు.[40]
ఈ చిత్రంలో నటీనటులు/సాంకేతిక వర్గం సినిమా నుండి నిష్క్రమించారని పుకార్లు షికార్లు చేశాయి.[41][42][43] అయితే చిత్ర సన్నిహిత వర్గాలు వీటిని ఖండించాయి.[44]