సౌదీ అరేబియాలో హిందూమతం 3వ అతిపెద్ద మతం. దేశ జనాభాలో దాదాపు 1.3% మంది హిందువులు. 2020 నాటికి, సౌదీ అరేబియాలో దాదాపు 4,51,347 మంది హిందువులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు, నేపాలీలు. [1] సౌదీ అరేబియాకు భారతీయులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. హిందువుల సంఖ్య కూడా పెరుగుతోంది. సౌదీ అరేబియాలో హిందూ మతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం. 2001 నుండి ఇక్కడ హిందూమతం అభివృద్ధి చెందుతోంది.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2000 | 1,29,640 | — |
2010 | 3,01,636 | +132.7% |
2020 | 4,51,347 | +49.6% |
సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ రాజ్యం. [2] సున్నీ ఇస్లాం అనేది రాష్ట్ర అధికారిక మతం. ఇస్లాం మినహా వేరే ఏ మతాన్ని బహిరంగంగా ఆచరించేందుకు అనుమతి లేదు. ముస్లింలకు మాత్రమే పౌరసత్వం పొందేందుకు అనుమతి ఉంది. దేశంలో నివసిస్తున్న హిందువులందరూ ప్రవాసులు, పని అనుమతితోనో, పర్యాటకులు గానో వచ్చిన వారే. [3]
ఇటీవలి సంవత్సరాలలో, చాలా మంది భారతీయులు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్ళినప్పటికీ, అంతకుముందు వెళ్ళిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే. కానీ 2001 తర్వాత ఇతర మతాల జనాభా పెరిగింది. ప్రధానంగా హిందువులు, నేపాలీ డయాస్పోరా కూడా ఉన్నారు. [4] హిందువుల జనాభా తగినంతగా ఉన్నప్పటికీ, ముస్లిమేతరులకు హిందూ దేవాలయం లేదు. మరే ఇతర ప్రార్థనా స్థలం కూడా లేదు. ముస్లిమేతరుల మత స్వేచ్ఛ కూడా చాలా పరిమితం.
ఇతర ముస్లిమేతర మతాల మాదిరిగా, హిందువులకు కూడా సౌదీ అరేబియాలో బహిరంగంగా పూజలు చేయడానికి అనుమతి లేదు. సౌదీ అరేబియా అధికారులు హిందూమత పరమైన వస్తువులను ధ్వంసం చేసినట్లు కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. [5] [6] సౌదీ అధికారులు హిందూ చిహ్నాలను విగ్రహాలుగా అర్థం చేసుకుంటారు. ఇస్లాం విగ్రహారాధనను తీవ్రంగా ఖండిస్తుంది. విగ్రహారాధన చేసే మతాచారాల విషయంలో సౌదీ అధికారుల కఠినమైన ధోరణికి ఇదే పునాది కావచ్చు. [7] ముస్లింలు ఇస్లాంను విడిచిపెట్టడానికి అనుమతించరు. మతభ్రష్టత్వానికి మరణశిక్ష విధిస్తారు. బైబిళ్లు, భగవద్గీత, అహ్మదీ పుస్తకాలు వంటి ముస్లిమేతర మతవస్తువుల పంపిణీ నిషిద్ధం. ముస్లిమేతరులు మతమార్పిళ్ళు చేయడం చట్టవిరుద్ధం.
2005 మార్చి 24 న, సౌదీ అధికారులు రియాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్న తాత్కాలిక హిందూ మందిరంపై దాడి చేసి, అక్కడ దొరికిన మతపరమైన వస్తువులను ధ్వంసం చేశారు. [8]
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
2000 | 0.6% | - |
2010 | 1.1% | +0.5 |
2020 | 1.3% | +0.2% |