స్పార్టకస్ (పుస్తకం)

స్పార్టకస్
కృతికర్త: హోవర్డ్ ఫాస్ట్
అనువాదకులు: ఆకెళ్ళ కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1955

స్పార్టకస్ పుస్తకం హోవర్డ్ ఫాస్ట్ ఆంగ్లంలో రాసిన నవలకు తెలుగు అనువాదం. ఈ పుస్తకాన్ని ఆకెళ్ళ కృష్ణమూర్తి తెలుగులోకి అనువదించారు.

రచన నేపథ్యం

[మార్చు]

హోవర్డ్ ఫాస్ట్ ఆంగ్లంలో రచించిన చారిత్రిక నవల స్పార్టకస్. కమ్యూనిస్టు సానుభూతిపరుడైన రచయిత క్రీ.పూ.71 నాటి రోమన్ సమాజంలో జరిగిన బానిసల యుద్ధం నేపథ్యంగా ఈ నవల రాశారు. కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలక సభ్యుడు కావడంతో కారాగారవాసం అనుభవించాల్సి వచ్చింది. 1950లో జైలు జీవితం గడుపుతూండగానే స్పార్టకస్ నవల రాయాలన్న భావం ఫాస్ట్ కి కలిగింది. స్పార్టకస్ నవల 1951లో రచించి, స్వయంగా ముద్రించారు.
ఆ నవలను ఆకెళ్ళ కృష్ణమూర్తి తెలుగులోకి అనువదించగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1955లో తొలిగా ముద్రించింది. 1981లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ రెండవ ముద్రణ చేసింది. అనంతరం 2000, 2007, 2008ల్లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారే పునర్ముద్రణలు చేశారు.[1]

రచయితల గురించి

[మార్చు]

మూల రచయిత

[మార్చు]

హోవర్డ్ ఫాస్ట్ 1914లో అమెరికాలో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని కన్నెక్టికట్లో నివసిస్తున్నారు. 67 ఏళ్ళకు పైగా సాహిత్య జీవితం నెరపుతున్నారు. 75కు పైగా నవలలు, అనేక చిన్న కథలు రాశారు. ఇ.వి.కన్నింగ్ హోమ్ అన్న కలంపేరుతో మిస్టరీ నవలలు కూడా రాశారు. ఫాస్ట్ అత్యంత పేదరికంలో పుట్టి పెరిగారు. పదేళ్ళ వయసు నుంచి వివిధ వృత్తులు చేపట్టారు. దినపత్రికలు వేయడం, సిగరెట్ల తయారీ, కసాయి దుకాణం శుభ్రం చేయడం, దుస్తుల ఫాక్టరీలో పని, ఓడల రవాణాలో గుమాస్తాగా ఎన్నో పనులు చేశారు. రకరకాల పనులు చేస్తూ ఉన్నత పాఠశాల పూర్తి చేశారు.
జాక్ లండన్ రాసిన ఉక్కు పాదం నవల చదివి సోషలిజం వైపుకు మొగ్గారు. ఆయన 1944-57 మధ్య అమెరికా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నారు. అమెరికాలో వామపక్షీయులను సంవత్సరాల పాటు వేధించిన మాక్ కార్తిజం నుంచి ఎలాగో బతికి బట్టకట్టారు. అతని జీవితమంతా ఫోనుల టాపింగ్, అమెరికా గూఢచారి విభాగం(ఎఫ్.బీ.ఐ.) నిఘాలతో గడిచిపోయింది. అమెరికా సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ పేర్లు ఇవ్వనిరాకరించినందుకు ఆయనకు జైలు శిక్ష కూడా పడింది.
ఆయన రాసిన స్పార్టకస్, The Passion of Sacco & Vanzetti, Freedom Road నవలు బాగా ప్రఖ్యాతి చెందాయి.[2]

అనువాదకుడు

[మార్చు]

స్పార్టకస్ నవలను ఆకెళ్ళ కృష్ణమూర్తి తెలుగులోకి అనువదించారు. ఆయన జనవరి 8, 1930లో పశ్చిమగోదావరి జిల్లా అట్లపాడులో జన్మించారు. విశాఖపట్నం హిందుస్తానీ షిప్ మార్టులో ఉద్యోగం చేస్తూ అక్కడ కార్మిక సంఘానికి నాయకత్వం వహించారు. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ముఖ్య కార్యకర్తగా పనిచేశారు. అనేక పత్రికల్లో ఆయన గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. విశాఖ రచయితల సంఘంలో 1953లో చేరారు. 1955లో రావి శాస్త్రితో ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగింది. అల్పజీవి నవల తరువాత రావి శాస్త్రి రచనల్లో వచ్చిన మార్పుకు మార్క్సిస్ట్ అయిన ఆకెళ్ళ స్నేహం కూడా ప్రధాన కారణంగా చెప్తారు. 1993 డిసెంబర్ 13న ఆకెళ్ళ మరణించారు.[3]

కథాంశం

[మార్చు]

క్రీ.పూ. 71 సంవత్సరంలో ప్రారంభమయ్యే నవల రోమన్ సామ్రాజ్యంలోని బానిసల తిరుగుబాటును కేంద్రీకృతం చేసుకుని సాగుతుంది. స్పార్టకస్ అనే బానిసల తిరుగుబాటు నాయకుని జీవితాన్ని గురించి ఈ నవల వివరిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. స్పార్టకస్:మూ.హోవర్డ్ ఫాస్ట్, అ.ఆకెళ్ళ కృష్ణమూర్తి:హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురణ:2008 ముద్రణ
  2. స్పార్టకస్: 2008 హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ముద్రణ: వెనుక అట్టపై రచయిత వివరాలు
  3. స్పార్టకస్: 2008 హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ముద్రణ: వెనుకమాట