స్వరాజ్ పార్టీ, 1923 లో భారతదేశ స్వపరిపాలనే ధ్యేయంగా ఏర్పాటు చేయబడ్డ రాజకీయ పార్టీ.దీని వ్యవస్థాపకులు విఠల్ భాయ్ పటేల్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. ఇది 1922లో గయ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం తర్వాత ఏర్పాటైంది. ఈ సమావేశంలో ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కావాలనీ, భారత్ ను పరిపాలించే అధికారం తమ చేతిలోనే ఉండాలని సభ్యులు తీర్మానించారు. ఇందులో ముఖ్యమైన సభ్యుడు విఠల్ భాయ్ పటేల్, దీని అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్, కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ.
దాస్, నెహ్రూలు బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వారి చేతిలోనుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. బెంగాల్ ఒడంబడిక తర్వాత 1923 ఎన్నికల్లో చాలామంది స్వరాజ్ పార్టీ అభ్యర్థులు గెలిచి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చట్టసభలో ప్రభుత్వ అన్యాయాల్ని వ్యతిరేకించారు.[1] చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత ఈ పార్టీ చీలిపోయింది.[2]
చౌరీ చౌరా సంఘటన కారణంగా ఉద్యమకారుల చేతిలో రక్షకభటులు కొంతమంది మరణించడంతో 1922 ఫిబ్రవరి 5 న గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తాత్కాలికంగా రద్ధు చేశాడు.