స్వర్గం నరకం (1975 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | దాసరి నారాయణరావు, మోహన్ బాబు, అన్నపూర్ణ, జయలక్ష్మి, ఈశ్వరరావు |
నిర్మాణ సంస్థ | రవి చిత్ర ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 22 నవంబరు 1975 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
స్వర్గం నరకం 1975 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహ ఫిల్మ్స్ పతాకంపై ఎం.కె.మావులయ్య, పి.ఎస్.భాస్కరరావులు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు[1][2][3]. మోహన్ బాబు, దాసరి నారాయణరావు, అన్నపూర్ణ, జయలక్ష్మీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు[4]. ఈ సినిమా ద్వారా మోహన్ బాబు, అన్నపూర్ణ, ఈశ్వరరావు, జయలక్ష్మీ లు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా నంది ఉత్తమ చిత్రంగా పురస్కారం పొందింది[5][6][7]. ఈ సినిమా 1978 లో బాలీవుడ్ లో "స్వర్గ్ నరక్" గా చిత్రీకరించబడినది. తమిళంలో కూడా "సొర్గం నరగం" గా చిత్రీకరించారు.[8]
ఈ కథ ముగ్గురు జంటల చుట్టూ తిరుగుతుంది. అందులో మొదటి జంట ఆచార్య (దాసరి నారాయణ రావు), ఇతరుల తప్పులను ఎల్లప్పుడూ తనకనుగుణంగా ఉపయోగించుకునే తన భార్య మీరి తో కలసి డబ్బు సంపాదిస్తుంటాడు. రెండవ జంట అన్నపూర్ణ (అన్నపూర్ణ), మోహన్ (మోహన్ బాబు) లది. మూడవ జంట ఈర్ష, అసూయలతో కూడుకొని ఉన్న జయ (జయలక్ష్మి), విక్రమ్ (ఈశ్వరరావు) లది.
మొదటి జంట సంతోషంగా వివాహం చేసుకుంది. రెండవ జంట మోహన్ తల్లితో కలసి జీవిస్తుంటుంది. మోహన్ అర్థ రాత్రివరకు క్లబ్బులలో పార్టీలలో గడుపుతూ ఇంటికి ఆలస్యంగా వస్తూంటాడు. అతని భార్య అన్నపూర్ణ ప్రతి రాత్రి తన భర్త కోసం ఓపికగా ఎదురుచూస్తుంది. మూడవ జంటలో జయ తన భర్త రాధతో కలసి ఉండటాన్ని చూసి వారి మధ్య ఏదైనా అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తుంది. వికీ దానికి తిరస్కరించినపుడు ఆమె అతనిని వదిలి వేస్తుంది. మరోవైపు మోహన్ తన ఇంటిని వదిలి పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కానీ విధి మరోలా ఉండి అతను ప్రమాదంలో గాయాలపాలు అవుతాడు. అతను కోలుకొనే కాలంలో అతని భార్య అన్నపూర్ణ సపర్యలు చేస్తూ ఆమె అతనికి ఎంత ముఖ్యమో నిరూపిస్తుంది. అతను పశ్చాత్తాపం చెందుతాడు. అతను మంచి మనిషిగా మారుతాడు. మరోవైపు జయ తన కుటుంబాన్ని అనుమానాలతో పాడు చేసుకుంటుంది. రాధ విషాద ఆత్మహత్య తరువాత విక్కీ తన ఇంటిని వదిలి పెట్టవలసి వస్తుంది. ఈ సమయంలో, ఆచార్య ఈ జంటను చక్కదిద్దడానికి అడుగులు వేస్తాడు. అతను అనుసరించే కొన్ని కార్యక్రమాల వల్ల ఆ జంటను ఎలా కలిపారో మిగిలిన కథలో ఉంటుంది.