స్వర్గద్వారి ఆలయం | |
---|---|
स्वर्गद्वारी | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 28°7′16.68″N 82°40′24.55″E / 28.1213000°N 82.6734861°E |
దేశం | నేపాల్ |
రాష్ట్రం | రాప్తి జోన్ |
జిల్లా | ప్యూతాన్ జిల్లా |
స్థలం | మహాభారత్ రేంజ్ |
ఎత్తు | 2,100 మీ. (6,890 అ.) |
సంస్కృతి | |
దైవం | విష్ణువు, శివుడు |
ముఖ్యమైన పర్వాలు | బైసాక్, కార్తీక పూర్ణిమ |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 1941 (1998 B.S.) |
స్వర్గద్వారి (నేపాలీ:स्वर्गद्वारी) హిందూధర్మం లో ఆవుల ప్రత్యేక పాత్రను గుర్తుచేసే నేపాల్ లోని ప్యూతాన్ జిల్లాలో ఉన్న ఒక కొండపై గల దేవాలయం, తీర్థయాత్ర ప్రదేశం. దీనిని గురు మహారాజ్ నారాయణ్ ఖత్రీ (స్వామి హంసానంద) స్థాపించాడని స్థల పురాణం చెబుతుంది, అతను తన జీవితంలో ఎక్కువ భాగం ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే వేలాది ఆవుల పాలు పితికి వాటితోనే తన జీవనం గడిపాడని ప్రతీతి.[1]
సాంప్రదాయ కథనాల ప్రకారం, స్వామి హంసానంద ఆవులను ఎక్కడికి తీసుకువెళ్లారో చూడడానికి అతని భక్తులు కొందరు అతనిని అనుసరించారు, కానీ వారు అతనిని కనుగొనలేకపోయారు. స్థానిక పెద్దలతెలిపిన పరంపర ప్రకారం, అతను రోల్పా నుండి ప్రస్తుత ఆలయ స్థలానికి వచ్చి, ఆ భూమి యజమానిని (భూస్వామి) తనకు భూమిని దానం చేయమని కోరాడు. అతను భూమిని తవ్వి పెరుగు కలిపిన అన్నం, అగ్నిని పొందాడు. ద్వాపర యుగంలో పాండవులు స్వర్గానికి వెళ్లే ముందు ఈ ప్రదేశంలో పూజలు చేసినప్పుడు వాటిని పాతిపెట్టారని అతను వివరించాడు. ఆ సమయంలో భూస్వామి ఆశ్చర్యపోయాడు. వెంటనే భూమిని అప్పగించేందుకు అంగీకరించాడు. ఆ తరువాత పవిత్ర అగ్ని అప్పటి నుండి నిరంతరం మండుతూనే ఉంటుంది. పవిత్ర అగ్ని ద్వారా వచ్చిన బూడిద తలనొప్పి, కడుపు నొప్పి వంటి వివిధ శారీరక రుగ్మతలను నయం చేస్తుందని ప్రజలు నమ్ముతారు.[2]
అతను తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు తన శక్తులలో కొంత భాగాన్ని కొంతమంది శిష్యులకు ఇచ్చాడు. అతను తన స్వంత కోరికతో భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన రోజున, అతను అలవాటుగా ధ్యానం చేసే స్థలంలో చాలా మంది ప్రజలు అతని చుట్టూ గుమిగూడారు. గురువు తన శిష్యులకు, ఇతర అనుచరులకు వీడ్కోలు పలికిన తరువాత తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అతనికి ఇష్టమైన ఆవు కూడా అదే క్షణంలో మరణించింది, తర్వాత మిగిలిన ఆవులు కొన్ని రోజుల్లోనే అద్భుతంగా అదృశ్యమయ్యాయి. గురువు మరణించిన ప్రదేశంలో ప్రతిరోజూ అదే సమయంలో ఆవులు తమ పాలను స్వయంగా స్రవిస్తున్నాయని కూడా కథనాలు ఉన్నాయి. అతను తన జీవితకాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకసారి ఆ ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడతాయని హెచ్చరిస్తూ పశువులను మేతకు తీసుకెళ్లవద్దని రోల్పాలి గోరక్షకులను కోరాడు. కానీ వారు నిరాకరించడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులకు జాతకం చెప్పేవాడు. అతను చాలా దయగలవాడు, ఎవరూ ఆహారం తీసుకోకుండా ఆలయం నుండి తిరిగి వెళ్లనిచ్చేవాడు కాదు. పేదలకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు. అతను పిల్లలకు వేద గ్రంథాలు, ఇతర మత గ్రంధాలను బోధించాడు. వారు అధ్యయనం తర్వాత ఆలయంలో వేద పూజలు చేస్తుండేవారు.[3]
స్వర్గద్వారి నేపాల్ ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని జాతీయ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.1996-2006 నేపాల్ అంతర్యుద్ధం తరువాత, ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు తగ్గిపోయాయి, స్వర్గద్వారి వద్ద నివసించే పశువులు ఆకలితో చనిపోయే ప్రమాదం ఏర్పడింది. 2009 నాటికి, ఆలయ నిర్మాణ పనులు కొంత ప్రారంభమై ఆలయ నిర్మాణం జరిగింది.[4] [5]
ఇది ప్రసిద్ధ హిందువుల ప్రదేశాలలో ఒకటి. ఇది ప్యూతాన్ జిల్లా దక్షిణ భాగంలో ఉంది. ఈ ప్రాంతానికి ప్రధాన సందర్శకులు నేపాలీలు, భారతీయులు. స్వర్గద్వారి ట్రెక్కింగ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. కాలినడకన అక్కడికి చేరుకోవడానికి రెండు రోజులు పడుతుంది. జూన్-జూలైలో స్వర్గద్వారిలో సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ప్రదేశాన్ని రెండు మార్గాల నుండి చేరుకోవచ్చు; భింగ్రీ నుండి, ఘోరాహి నుండి. భింగ్రీ నుండి స్వర్గద్వారి చేరుకోవడానికి సుమారు 4 గంటలు పడుతుంది. ఘోరహి డాంగ్ నుండి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. కానీ ఈ మార్గాలు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. భింగ్రీ రహదారితో పోలిస్తే డాంగ్ నుండి వచ్చే మార్గం చాలా ప్రమాదకరమైంది. ఈ రహదారి మెరుగుదల, సురక్షితమైన ప్రయాణం కోసం ఇటీవల దారి మార్చబడింది. ఇది పైన్ అడవితో చుట్టుముట్టబడిన కొండ పైభాగంలో ఉంది. ఈ దారిలో పెద్ద సంఖ్యలో రోడోడెండ్రాన్ చెట్లు ఉన్నాయి.[6]