స్వెమా

స్వెమా
తరహా
స్థాపన1931
ప్రధానకేంద్రముషోస్త్కా
పరిశ్రమఛాయాచిత్రకళ, ఆడియో
ఉత్పత్తులుఫిలిం, ఆడియో/వీడియో టేప్, X-ray ఫిలిం
వివిధ రకాల స్వెమా ఫిలిం చుట్టలు

స్వెమా (ఆంగ్లం: Svema) ఉక్రెయిన్ కు చెందిన షోస్త్కా రసాయన కార్మాగారం (Shostka Chemical Plant) చే తయారు చేయబడే ఫోటోగ్రఫిక్ ఫిలిం చుట్ట యొక్క పేరు. రష్యన్/ఉక్రెయిన్ భాష లో స్వెమా (Свема) యొక్క పూర్తి రూపం Светочувствительные Материалы (స్వీతొచువ్స్త్వీతెన్యే మెటీరియాలి) అనగా కాంతిని గుర్తించు పరికరాలు (Light Sensivitive Materials) అని అర్థం.[1] ఈ రెండు పదాలలో మొదటి అక్షరాల కలయికే, Sve, Ma. ఒకనాటి సోవియట్ యూనియన్ లో స్వెమా ఫిలిం తయారీదారుగా వర్థిల్లింది. ప్రాథమికంగా ఫిలిం ను తయారు చేసినను, సంబంధిత ఇతర ఉత్పత్తులను కూడా స్వెమా తయారు చేసినది. కానీ 90వ దశకంలో సోవియట్ యూనియన్ వేర్పాటు వలన ఉక్రెయిన్ లో ఏర్పడ్డ పరిస్థితులు స్వెమా ఉత్పత్తులకు ప్రతికూలమయ్యాయి. పాశ్చాత్య ఉత్పత్తుల హోరులో స్వెమా తల్లడిల్లింది. అయినా 2004 వరకు స్వెమా తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటుకొంటూనే ఉండటం గమనార్హం. కార్మాగారం ఉత్పత్తి ఆపివేయటంతో తర్వాతి కాలంలో, కనుమరుగైంది. ఉత్పత్తి ఆగిపోయినను, అప్పట్లో తయారు అయ్యి ఇప్పటికి గడువు తీరినను, ఆ ఫిలిం (expired film) పై ఛాయాచిత్రాలను తీసి, సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేసి, స్వెమా అభిమానులు దాని లక్షణాలను కొనియాడుతూ, వాటిని ఆస్వాదిస్తూ మురిసిపోతుంటారు.[2]

ఉత్పత్తులు

[మార్చు]

2000 సంవత్సరం నాటికి స్వెమా ఉత్పత్తులు:

  • బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫిక్ ఫిలిం
  • ఫోటోగ్రఫిక్ కాగితం
  • బ్లాక్ అండ్ వైట్, కలర్ సినీ ఫిలిం
  • టేప్ రికార్డర్లలో వినియోగించే ఆయాస్కాంతపు టేప్ (magnetic tape)

ఫోటోగ్రఫిక్ ఫిలిం యొక్క లక్షణాలు

[మార్చు]
  • సులభతరమైన వినియోగం
  • దురుసుగా వినియోగించినా తట్టుకోగల ధృడత్వం
  • ఛాయాచిత్రాలు ఒకింత మసకగా రావటం

ఈ లక్షణాల వలన ఇంట్లోనే ఫిలిం ను సంవర్థన చేయటం, ఛాయాచిత్రాలను ముద్రించటం చేసే యువ ఔత్సాహికులు దీనిని బాగా ఇష్టపడేవారు.

సోవియట్ వేర్పాటు ప్రభావం

[మార్చు]

1991లో సోవియట్ యూనియన్ వేర్పాటుతో ఉక్రెయిన్ కు స్వాతంత్రం సిద్ధించింది. ఉక్రెయిన్ లో సినీ పరిశ్రమ దెబ్బ తిన్నది. చాలా సినిమా ప్రదర్శనశాలలు మూతబడ్డాయి. 90వ దశకం చివరిలో సంవత్సరానికి విడుదలయ్యే చలన చిత్రాలు వ్రేళ్ళపై లెక్క పెట్టగలిగే దీనావస్థకు చేరుకుంది. అనుభవం గల వారు క్రొత్త సినిమాలు తీయటానికి సాంఘిక/ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. క్రొత్త వారు సినిమాలు తీయటానికి, ఉక్రెయిన్ లో అప్పటికే ఫిలిం ఎడ్యుకేషన్ ఛిద్రమైంది.

స్వాతంత్రం తర్వాత ఉక్రెయిన్ లో పరిశ్రమలు కుంటుపడ్డాయి. స్వెమా సైతం ఈ పరిస్థితులకు ఏ మాత్రం మినహాయింపు కాలేదు. ఫిలిం తయారీని స్వెమా ఆపివేసిననూ, ఫిలిం స్కూలు ఫిలింను కొనటం మానేయటంతో, కార్మాగారంలో గుట్టలుగా తయారయ్యి పడి ఉన్న ఫిలిం కదలలేదు. పైగా వాటిని వినియోగించవలసిన గడువు సమయం (expiry date) కూడా దాటిపోయింది. ఫిలిం ను ఫ్యాక్టరీ నుండి కదల్చటానికి యాజమాన్యం నిర్ణయించుకొంది. ఫిలిం స్కూల్ విద్యార్థులకు ఫిలిం ను అమ్మటం మొదలుపెట్టింది.

స్వెమా ఫిలిం లక్షణాలకు అంతర్జాతీయ గుర్తింపు

[మార్చు]

ఫిలిం కు ఇరువైపులా ఉండవలసిన రంధ్రాలు (perforations), కార్మాగారం ఇంకా వేయకపోవటం, గడువు సమయం దాటిపోవటం వంటి వాటి తో ఫిలిం పై వర్ణాలు సరిగా నమోదు అవుతాయో లేదోనన్న సందేహం విద్యార్థులను వెంటాడింది. కాబట్టి కలర్ ఫిలిం బదులుగా విద్యార్థులు బ్లాక్ అండ్ వైట్ ఫిలిం ను కొనుగోలు చేయటానికి మొగ్గు చూపారు. ఈ ఫిలిం తో తీసిన చలన చిత్రాలలో సాంకేతిక కారణాల వలన వచ్చిన అవాంచిత పురాతన శైలి అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకొంది. గడువు తీరిన స్వెమా ఫిలిం పై చలన చిత్రాలు చిత్రీకరించి మెప్పించటం భావి సినీదర్శకులకు మైలు రాయి అయ్యింది. Light Sensitive Materials వెలుగు-నీడలను చిత్రీకరించే తీరును అర్థం చేసుకొని సత్ఫలితాలను పొందటం, సినీ పరిశ్రమలో అప్పటి వరకు ఉన్న ప్రధాన సిద్ధాంతాల ధిక్కారం, ఈ అహేతుబద్ధ భావనలు కలిగిన దర్శకులకు గడువు తీరిన స్వెమా ఫిలిం కల్పతరువు అయ్యింది.

తలలు పండిన సినీ పండితుల, ఛాయాచిత్రకారుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా, దేశంలో నెలకొన్న విషాదకర పరిస్థితులను, నైరాశ్యాన్ని, నగ్న సత్యాలను చిత్రీకరించటానికి గడువు తీరిన స్వెమా ఫిలిం యే సరియైన మాధ్యమం అనే అభిప్రాయం ఏర్పడింది. ఉక్రెయిన్ దేశపు పౌరాణిక గాథలను చిత్రీకరించటానికి ప్రభుత్వం కావలసిన నిధులను సమకూర్చినా, సత్యదూరం అయిన వాటిపై ప్రజలు ఆసక్తి కనబరచలేదు. ప్రేక్షకుల నాడిని కనుగొన్న యువతరం దర్శకులు స్వెమా ఫిలింతో విజృంభించారు. అప్పటి వరకు చలనచిత్రాలకు మాత్రం ఉపయోగించబడుతోన్న గడువు తీరిన స్వెమా ఫిలిం, ఇక అప్పటి నుండి ఛాయాచిత్రకళలోకి కూడా ఉపయోగించబడింది.

చలన చిత్రానికి, లఘు చిత్రానికి మధ్య ఉన్న గీతను స్వెమా ఫిలిం చెరిపివేసింది. కొన్ని చలనచిత్రోత్సవాలలో గడువు తీరిన స్వెమా ఫిలిం పై చిత్రీకరించిన చలనచిత్రాలను లఘచిత్ర విభాగం లో ప్రదర్శించటం విశేషం.

స్వెమా ఫిలిం లక్షణాలు

[మార్చు]

ఉక్రెయిన్ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదలలో మమేకమైన స్వెమా

[మార్చు]

రచ్చ గెలిచి ఇంట గెలిచిన ఉక్రెయిన్ ఫిలిం విద్యార్థులు

[మార్చు]

ఫిలిం స్కూల్ విద్యార్థులకు విమర్శలు తప్పలేదు. పాతచింతకాయ పచ్చడి వంటి సాంకేతికతను వాడుకొంటూ, సంఘంలో ఉన్న చెడును మాత్రమే చిత్రీకరిస్తున్నారంటూ వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో వీరికి లభించిన ప్రశంసలు విమర్శకుల నోళ్ళు మూయించాయి. ఫిలిం స్కూల్ విద్యార్థులు రచ్చ గెలిచి ఇంట గెలిచారు. 2007 నాటికి వ్యర్థం అవుతోందనుకొన్న ఫిలిం కాస్తా సద్వినియోగపడటమే కాక గడువు తీరిన ఈ ఫిలిం పై సినిమా/ఛాయాచిత్రాల చిత్రీకరణే సంప్రదాయిక ఆలోచనల అసమ్మతికి కొలమానంగా నిలిచింది.

కనుమరుగైన స్వెమా ఫిలిం

[మార్చు]

2004 నాటికి స్వెమా నష్టాలలో కూరుకుపోయింది. 2005 లో పునర్వవస్థీకరణ మొదలైంది.

నవంబరు 2007 లో షోస్త్కా నగర పాలిక సంస్థ స్వెమా ఫిలిం పునురుద్ధరణలో పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రణాళిక మొదలుపెట్టిననూ, ఇది కాగితాల వరకే పరిమితమైంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]