హర్ష భోగ్లే | |
---|---|
జననం | హైదరాబాదు | 1961 జూలై 19
విద్య | ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు IIM అహ్మదాబాదు |
వృత్తి | TV వ్యాఖ్యాత, ప్రెజెంటరు |
భార్య / భర్త | అనితా భోగ్లే |
హర్ష భోగ్లే (జననం 1961 జూలై 19) భారతీయ క్రికెట్ వ్యాఖ్యాత, పాత్రికేయుడు.[1] భోగ్లే క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్ ఇండస్ట్రీలో ప్రపచవ్యాప్తంగా ఖ్యాతి పొందాడు.
భోగ్లే హైదరాబాద్‌లో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. అతను ఫ్రెంచ్ భాషలో ప్రొఫెసరైన AD భోగ్లే, సైకాలజీ ప్రొఫెసర్ అయిన షాలినీ భోగ్లేల కుమారుడు. ది గ్రేడ్ క్రికెటర్ పోడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భోగ్లే, తన తల్లి కుటుంబం లాహోర్‌కు చెందినదని, 1947 మధ్యలో విభజన సమయంలో ఆమె చిన్నతనంలో భారతదేశానికి వలస వచ్చిందని చెప్పాడు. అతను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. తరువాత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుండి PGDM అందుకున్నాడు. అతను ఒక ప్రకటనల ఏజెన్సీలో చేరాడు, అందులో రెండు సంవత్సరాలు పనిచేశాడు, ఆ తర్వాత అతను స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీలో మరో రెండేళ్లు పనిచేశాడు.
ప్రారంభంలో భోగ్లే, హైదరాబాద్‌లో ఎ డివిజనులో క్రికెట్ ఆడాడు. రోహింటన్ బరియా టోర్నమెంట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. 19 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్‌లో ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యానించడం ప్రారంభించాడు. 1991-92లో అతను, 1992 క్రికెట్ ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాలో భారత సిరీస్ సమయంలో ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ అతన్ని కామెంటేటరుగా ఆహ్వానించింది. అలా ఆహ్వానం పొందిన మొదటి భారతీయ వ్యాఖ్యాత హర్ష. అతను ఆస్ట్రేలియాలో భారత పర్యటనల సమయంలో ABC రేడియో గ్రాండ్‌స్టాండ్ కోసం పనిచేశాడు. 1996, 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లలో వ్యాఖ్యాన బృందంలో భాగంగా ఎనిమిది సంవత్సరాలు BBC కోసం పనిచేశాడు.
1995 నుండి, అతను ESPN స్టార్ స్పోర్ట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైవ్ క్రికెట్‌ను ప్రదర్శిస్తున్నాడు. 'ఫ్యూ గుడ్ మెన్' వ్యాఖ్యాతల జట్టులో భాగంగా ఉన్నాడు. కొన్ని సీజన్లలో రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, అలన్ విల్కిన్స్‌లతో పాటు జెఫ్ బాయ్‌కాట్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆ తరువాత, ఇయాన్ చాపెల్, సంజయ్ మంజ్రేకర్‌లు ఆ వృందంలో ఉండేవారు.
అతను ఆస్ట్రేలియాలో 2011-12 సిరీస్‌ను పూర్తిగా ABC రేడియో కోసం కవర్ చేశాడు.
భోగ్లే 2009 నుండి అన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లను కవర్ చేస్తున్నాడు. 2016 ఏప్రిల్‌లో భారత ఆటగాళ్ల నుండి వచ్చిన విమర్శల కారణంగా BCCI అతనిని కామెంటరీ టీమ్ నుండి తొలగించింది.
అతను ESPN, స్టార్ స్పోర్ట్స్ కోసం హర్ష ఆన్లైన్, హర్ష అన్ప్లగ్డ్, స్కూల్ క్విజ్ ఒలింపియాడ్ వంటి టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించాడు.
భోగ్లే పేరు మీద ఒక టెలివిజన్ కార్యక్రమం కూడా ఉంది. "హర్ష కి ఖోజ్" (హర్ష అన్వేషణ) ఇది భారతదేశంలో ప్రసార పరిశ్రమకు అవసరమైన ప్రతిభను కనుగొనడానికి ఈ కార్యక్రమం ద్వారా కృషి చేసారు.
యూట్యూబ్‌లో అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ హర్షా భోగ్లే ను ప్రసారం చేయడం ద్వారా భోగ్లే తన ఆన్లైన్ ఉనికిని విస్తరించాడు.[2]
ప్రపంచవ్యాప్త పోల్ ఆధారంగా క్రిక్ఇన్ఫో వినియోగదారులు భోగ్లేను తమకు ఇష్టమైన టీవీ క్రికెట్ వ్యాఖ్యాతగా ఎంపిక చేసారు. [3] భోగ్లే BBC వారి ట్రావెల్ ఇండియా, బిజినెస్ టుడే వారి అక్యుమెన్ బిజినెస్ క్విజ్ కార్యక్రమాలకు, డిబేట్ పోటీలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
భోగ్లే 2008 IPL కోసం ముంబై ఇండియన్స్‌కు సలహాదారుగా ఉన్నాడు.[4]
భోగ్లే మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర రాసాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు రాసిన అవుట్ ఆఫ్ ది బాక్స్ - వాచింగ్ ది గేమ్ వియ్ లవ్ కాలమ్‌లో రాసిన వ్యాసాలతో ఒక పుస్తకం వేసాడు. అనేక ఇతర పుస్తకాలను రచించి, ప్రచురించాడు. భోగ్లే రచించిన "హిటింగ్ హార్డ్" పేరుతో ది హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వారు ప్రచురించే "ది స్పోర్ట్‌స్టార్"కి కాలమ్ రాసాడు (2009). భోగ్లే డిస్కవరీ ఛానెల్, TLC లో ట్రావెల్ ఇండియా: విత్ హర్షా భోగ్లే అనే కార్యక్రమాన్ని అందించాడు.
భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో జరిగిన 2011 ప్రపంచ కప్‌లో, అతను సైమన్ హ్యూస్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గవాస్కర్, టోనీ గ్రేగ్, సౌరవ్ గంగూలీలతో ప్రీ అండ్ పోస్ట్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
2013లో, సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్టు ఆడినప్పుడు చివరి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఇయాన్ బిషప్, అతనికి వ్యాఖ్యానం పెట్టెలో సీటు ఇచ్చాడు. [5]
భోగ్లే ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమయ్యే "దిస్ వీక్ స్పెషల్" అనే వీక్లీ షోను నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమం వీక్షకులను గతకాలపు క్రికెట్ జ్ఞాపకాలను తిరిగి పొందేలా చేస్తుంది. మొదటి ఎపిసోడ్ 2015 అక్టోబరు 1 న ప్రసారం చేయబడింది. 2016 ఏప్రిల్ 10 న వ్యాఖ్యాతగా అతని IPL ఒప్పందం రద్దు చేసారు. లీగ్ ప్రచార వీడియోలలో ప్రదర్శించబడిన సీజన్ 9 డ్రాఫ్ట్ వేలాన్ని అతను నిర్వహించాడు, వ్యాఖ్యాతల 51-రోజుల డ్యూటీ రోస్టర్‌లో ఉన్నాడు, అతని విమానం టిక్కెట్టు కూడా బుక్ అయింది. అయినప్పటికీ కాంట్రాక్టు రద్దు చెయ్యడం అతణ్ణి ఆశ్చర్యపరిచింది. బోర్డు (BCCI) అధికారులు మాట్లాడుతూ, తలుపు తెరవాలని కోరుతూ వేదిక వద్ద ఉన్న క్రికెట్ అధికారితో భోగ్లేకి వాగ్వాదం జరిగింది. ఇది నాగ్‌పూర్‌కు చెందిన BCCI అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు చేరింది. భోగ్లేను తప్పించడానికి ఈ ఘటనే కారణమని తెలిసిన వారు చెప్పారు. [6]
అతను 2016 నుండి టైమ్స్ గ్రూప్ అనుబంధ సంస్థ క్రిక్‌బజ్‌లో భాగంగా ఉన్నాడు. వ్యాసాలు వ్రాస్తాడు అలాగే వారితో వీడియో విశ్లేషణలు చేస్తాడు.
భోగ్లే ప్రస్తుతం ఉదయపూర్ IIM గవర్నర్ల బోర్డులో సభ్యుడు. [7]
2019 మే 16 న, ఇంగ్లండ్, వేల్స్‌లలో జరిగిన 2019 ICC ప్రపంచ కప్ కోసం 24 మంది వ్యాఖ్యాతలలో అతను స్థానం పొందాడు. [8]
బంగ్లాదేశ్ భారత పర్యటనలోని 2వ టెస్టులో, భారత, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల 1వ D/N టెస్టులో, కొంతమంది బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు పింక్ బాల్‌తో దెబ్బలు తగిలించుకున్నారు. భోగ్లే బంతి సరిగ్గా కనబడడం లేదేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. అతని సహచర వ్యాఖ్యాత అయిన సంజయ్ మంజ్రేకర్, భోగ్లే లాంటి క్రికెట్ ఆడని వ్యక్తులు మాత్రమే ఆ స్థాయిలో అలాంటి ప్రశ్నలు అడుగుతారని బదులిచ్చాడు. లైవులో జరిగిన ఈ మాటల యుద్ధం విన్నవారు ఆశ్చర్యపోయారు
భోగ్లే, అతని భార్య అనిత క్రీడా ప్రపంచంలో వారి వ్యాపార పరిజ్ఞానం ఆధారంగా ది విన్నింగ్ వే, ది విన్నింగ్ వే 2.0 అనే పుస్తకాలు రాశారు.[9] హర్ష, మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్రను కూడా రచించాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే పుస్తకంలో తన వ్యాసాల సంకలనాన్ని ప్రచురించాడు.
భోగ్లే IIM అహ్మదాబాద్‌లోని తన క్లాస్మేట్ [10] అనితను వివాహం చేసుకున్నాడు. వారు ఇద్దరు కొడుకులతో ముంబైలో నివసిస్తున్నారు. [11] భోగ్లే 17 సంవత్సరాల వయస్సు నుండి శాకాహారి. [12]
ఈ జంట ప్రోసెర్చ్ అనే క్రీడాధారిత కమ్యూనికేషన్ కన్సల్టెన్సీని నడుపుతున్నారు. [13]
{{citation}}
: CS1 maint: bot: original URL status unknown (link)