హాలుడు | |
---|---|
శాతవాహనులు | |
పరిపాలన | సుమారు 20 – 24 CE |
House | శాతవాహనులు |
హాలుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు. మత్స్యపురాణం అతనిని శాతవాహనుల వంశంలో 17వ రాజుగా పేర్కొంది.[1]
హాలుడు అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానమును పరిపాలిస్తూ ఉన్నాడని ప్రాకృతంలో రచింపబడిన లీలావతి కావ్యం చెబుతుంది. పరిపాలించినది ఆరేళ్ళే అయినప్పటికీ, శాతవాహన వంశపు రాజులందరిలోకీ హాలుడు జగత్ప్రసిధ్ధుడు కావడానికి కారణం ఆ మహారాజు సంకలనం చేసి ప్రపంచానికి అందించిన గాథా సప్తశతి అనే గ్రంథం.
హాలుడు సా.శ.69 నుండి 74 వరకు 5 ఏళ్ళు పాలన చేసెను. ఇతడు సింహళరాజు కుమార్తెను పరిణయమాడాడు. ఇతడు విద్యాభిమాని, విద్యారసికుడు. ఇతడు విద్వాంసులను, కవులను ఆదరించి తాను కూడా కవియై ఉన్నాడు. హాలుని కాలమున రాజపోషణము లభించుట వలన దేశభాషలు బాగుగా అభివృద్ధి చెందాయి.
ప్రాచీన మహారాష్ట్ర ప్రాకృతములో హాలుడు సప్తశతి అను నీతిశృంగారకావ్యమును రచించాడు. అందు మనోహరమైన అలంకారములు ఉన్నాయి. ఉదా:చంద్రుడను కలహంస ఈరాత్రి భాగమున ఆకాశమున నిర్మల కాసారమునందు విడివిడియున్న నక్షత్రపద్మముల నడుమ సుఖప్రయాణము కావించుచున్నది.....
హాలుని సప్తశతిని బాణుడు తన హర్షచరిత్రములో పొగిడాడు. "కావ్య ప్రకాశిక" లో, "సరస్వతీ కంఠాభరణము" లో, "దశరూపకవ్యాఖ్యానము" లో సప్తశతి పద్యములుదహరింపబడి ఉన్నాయి.
హాలుని మంత్రి గుణాఢ్యపండితుడు. పైశాచీ భాషలో "బృహత్కథ"ను, "కాతంత్ర వ్యాకరణము"ను ఇతడు రచించాడు. హాలుని ఆస్థానములో సకల విద్యలు నెలకొని ఉండేవని తెలుస్తున్నది. గుణాఢ్యుడు హాలుని మంత్రి కాడని మరికొందరు ఆంధ్రచరిత్రకారుల అభిప్రాయము. హాలుడు, సాలనుడు, కుంతలుడు, శాలివాహనుడు- ఈ నాలుగు పేర్లు ఒక్కనివే అని హేమచంద్రుడు తన దేశకోశములో చెప్పాడు. సా.శ. 78 వసంవత్సరమునుండి లెక్కింపబడుచున్న శాలివాహన శకమునకు ఈ హాలశాతవాహనుడే కర్తయని కొందరి అభిప్రాయం.
హాలుని తరువాత మండలకుడు (సా.శ.74-79), పురీంద్రసేనుడు (సా.శ.79-84), సుందరస్వాతికర్ణుడు (సా.శ.84-85), చకోరస్వాతికర్ణుడు 6 మాసాలు క్రమముగా ఒకరి తరువాత ఒకరు రాజ్యమేలారు. వీరిలో చకోరస్వాతికర్ణి వాసిష్ఠీపుత్రుడు; అనగా ఇతనితల్లి వసిష్ఠగోత్రమువారి ఇంటి ఆడబడుచు. ఈ రాజు వద్ద నుండి తరువాతి రాజులందరును తమ తల్లి పేరును తమ పేరు ముందు వాడటం మొదలుపెట్టారు.