హిందూ రైట్స్ యాక్షన్ ఫోర్స్, అనే సంస్థ సంక్షిప్త నామమే హింద్రాఫ్ (హింద్రాఫ్). ఇది మలేషియాలో హిందూ మతానికి చెందిన క్రియాశీలక మితవాద ప్రభుత్వేతర సంస్థ (NGO). మక్కల్ శక్తి లేదా కువాసా రక్యాత్ దాని ప్రఖ్యాత నినాదం. ప్రజా శక్తి అని దానికి అర్థం.[1] బహుళజాతి మలేషియాలో హిందూ సమాజ హక్కులు, వారసత్వ పరిరక్షణకు కట్టుబడి ఉన్న 30 హిందూ సంస్థల సంకీర్ణంగా ఈ సంస్థ ప్రారంభమైంది.[2][3]
2007 హింద్రాఫ్ ప్రదర్శన నిర్వహించడంతో మలేషియా రాజకీయ దృశ్యంపై హింద్రాఫ్ ప్రభావం కనబడింది.[4] 2007 నవంబరులో హింద్రాఫ్ నిర్వహించిన భారీ ప్రదర్శన తరువాత సంస్థలోని అనేకమంది ప్రముఖ సభ్యులను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసారు. అభియోగాలను కోర్టులు కొట్టివేశాయి. అంతర్గత భద్రతా చట్టం (ఐఎస్‌ఎ) కింద ఐదుగురిని అరెస్టు చేసి విచారణ లేకుండా నిర్బంధించారు.[5] 2000ల చివరలో, సమూహం మైనారిటీ భారతీయులకు సమాన హక్కులు, అవకాశాలను సంరక్షించడానికీ, పొందడానికీ విస్తృత రాజకీయ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. మలేషియా ప్రభుత్వ విధానాలలోని జాత్యహంకార అంశాలపై దృష్టిని కేంద్రీకరించి, దాన్ని కొనసాగించడంలో ఇది విజయవంతమైంది.[6]
2019 జూలై 15 న మలేషియా రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ (RoS) హింద్రాఫ్ నమోదును రద్దు చేసింది.[7]
2006 ఏప్రిల్ నుండి మే మధ్య కాలంలో, మలేషియాలోని సిటీ హాల్ అధికారులు చట్టబద్ధంగా ఉన్న అనేక హిందూ దేవాలయాలను కూల్చివేశారు.[8][9] 2006 ఏప్రిల్ 21 న, కౌలాలంపూర్‌లోని మలైమెల్ శ్రీ సెల్వ కాళియమ్మన్ ఆలయాన్ని బుల్‌డోజర్‌లతో కూలదోసారు.[10][11]
హిందూ రైట్స్ యాక్షన్ ఫోర్స్ లేదా హింద్రాఫ్, అనేక హిందూ సంస్థల సంకీర్ణం. ఇది కూల్చివేతలను నిరసిస్తూ అప్పటి మలేషియా పాలక బారిసన్ నేషనల్ (BN) పాలక కూటమికి చెందిన ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేసింది. కానీ ఎటువంటి స్పందన రాలేదు.[12] ఇది, మలేషియాలో దేవాలయాలను ఒక పద్ధతి ప్రకారం నిర్మూలించే ప్రణాళిక అని అనేక హిందూ సమూహాలు నిరసన తెలిపాయి.[13] ఆ ఆలయాలు అక్రమంగా నిర్మించబడ్డాయని మలేషియా ప్రభుత్వం అధికారిక కారణంగా చెప్పింది. అయితే, వాటిలో అనేక దేవాలయాలు శతాబ్దాల నాటివి.[12] హింద్రాఫ్ తరపు న్యాయవాది ప్రకారం, మలేషియాలో ప్రతి మూడు వారాలకు ఒక హిందూ దేవాలయం కూల్చివేయబడుతుంది. [9][10][14]
అక్టోబరు 30న, కౌలాలంపూర్‌లో హిందూ మందిరాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ 2007లో హింద్రాఫ్ చేసిన ప్రదర్శనలో పాల్గొన్నందుకు నలుగురు హింద్రాఫ్ ఉద్యమ కార్యకర్తలు M. మనోహరన్, P. ఉతయకుమార్, P. వైతా మూర్తి, V. గణబత్తిరావులను అరెస్టు చేసి నిర్బంధించారు.[15] అయితే, రెచ్చగొట్టడం, దేశద్రోహానికి పాల్పడినట్లు ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేశారు.[16][17]
హిందూ మానవ హక్కుల గురించి అవగాహన పెంచడానికి మలేషియా అంతటా హింద్రాఫ్, శాంతియుతంగా వారాంతపు చర్చా వేదికలు నిర్వహించింది. హింద్రాఫ్ ప్రకారం, సెంట్రల్ కౌలాలంపూర్ సమీపంలో గతంలో జరిగిన ఫోరమ్‌కు రాయల్ మలేషియా పోలీసులు అంతరాయం కలిగించారు.[18][19]
తదనంతరం, భవిష్యత్ ఫోరమ్‌లు శాంతియుతంగా జరిగేలా చూసేందుకు హింద్రాఫ్ నేరుగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP)కి విజ్ఞప్తి చేసింది.[20]
2007 నవంబరు 23 న, ముగ్గురు హింద్రాఫ్ కార్యకర్తలు, P. ఉతయకుమార్, P. వైతా మూర్తి. V. గణబతిరావులను దేశద్రోహ చట్టం కింద అరెస్టు చేసి, అభియోగాలు మోపారు.[21][22] అయితే, పదేపదే చేసిన అరెస్టులు, విడుదలల పరంపరలో, వారు జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టారని కోర్టులు నిరూపించలేకపోయాయి. వారికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక సాక్ష్యం అటార్నీ-జనరల్ ఛాంబర్స్ సమర్పించిన భాషా మలేషియాలోకి అనువదించిన వారి తమిళ ప్రసంగాలు. ఈ అనువాదాలు కోర్టులు ధ్రువీకరించలేనివి అని కోర్టులు భావించాయి. చివరికి, ఏదైనా తప్పు లేదా నేరానికి సంబంధించిన సాక్ష్యాలేమీ లేకపోవడం వల్ల వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.[16]
2007 ఆగస్టు 31 న, మలేషియా స్వాతంత్ర్య 50వ వార్షికోత్సవం సందర్భంగా, హింద్రాఫ్ న్యాయవాది, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లండన్‌లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో US$4 ట్రిలియన్లకు (ఒక్కొక్క మలేషియా భారతీయుడికి ఒక US$1 మిలియన్) క్లాస్ యాక్షన్ దావా వేశాడు. "స్వాతంత్ర్యం ఇచ్చి, వెనక్కి వెళ్ళిపోతూ, భారతీయులను రక్షణ లేకుండా, మైనారిటీ భారతీయులుగా మా హక్కులను కాలరాసిన మెజారిటీ మలయ్-ముస్లిం ప్రభుత్వ దయకు వదిలివేయడం" అనేవి ఆ దావా లోని ఆరోపణలు.[23][24]
దావా కేవలం 4 ట్రిలియన్ బ్రిటిష్ పౌండ్స్ పరిహారంగా కోరడమే కాక, మలయ్ ఆధిపత్యాన్ని గుర్తించే మలేషియా రాజ్యాంగంపు ఆర్టికల్ 153 ను కొట్టివేయాలని కోరింది. మలేషియా భారత-ముస్లిం సంతతికి చెందిన మలయ్ అయిన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మహాతీర్ మొహమ్మద్ ప్రకటించినట్లు ముస్లిము రాజ్యం కాదనీ, ఒక లౌకిక రాజ్యమని కోర్టు ప్రకటించాలనీ కోరింది.[25]
ప్రధానంగా మలేషియా లోని శ్రామిక వర్గ భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సమూహం, కోర్టు రుసుములను భరించలేనందున, తమ కేసును వాదించడానికి ఒక న్యాయవాదిని నియమించమని కోరుతూ క్వీన్ ఎలిజబెత్ II కి సమర్పించడానికి 1,00,000 సంతకాలతో ఒక పిటిషన్ను పంపిణీ చేసింది. కౌలాలంపూర్‌లోని బ్రిటిష్ హైకమిషన్‌కు 1,00,000 సంతకాలతో అభ్యర్థనను అందజేయడం ర్యాలీ ఉద్దేశం.[24]
బ్రిటీష్ హైకమిషన్‌లో పిటిషన్‌ను సమర్పించేందుకు 2007 నవంబరు 25 న హింద్రాఫ్ ర్యాలీని నిర్వహించింది.[4] ర్యాలీకి ఒకరోజు ముందు, పోలీసులు ముగ్గురు హింద్రాఫ్ న్యాయవాదులను అరెస్టు చేశారు; ఉతయకుమార్, వైతా మూర్తి, గణబత్తిరావుపై దేశద్రోహ అభియోగాలు మోపారు. ఉదయకుమార్, గణబతిరావు ఒక్కొక్కరు 800 మలేషియా రింగిట్‌ల బెయిల్‌ని సమర్పించారు. అయితే వైతా మూర్తి నిరసన సూచనగా బెయిల్‌ను తిరస్కరించారు.[26][27]
ర్యాలీకి అనుమతిని ఇవ్వడానికి మలేషియా పోలీసులు నిరాకరించారు.[28] సిటీ సెంటర్‌లోకి ప్రవేశించే వాహనదారులను పరీక్షించడానికి, "ఇబ్బందులను సృష్టించేవారిని" గుర్తించడానికీ ర్యాలీకి దారితీసే రహదారుల వెంట క్లాంగ్ వ్యాలీలో రోడ్‌బ్లాక్‌లను ఏర్పాటు చేశారు.[29] ర్యాలీలో పాల్గొనవద్దని వారు ప్రజలకు సూచించారు. ముగ్గురు హింద్రాఫ్ నాయకులను అరెస్టు చేశారు. ప్రదర్శన వల్ల ఇబ్బంది కలుగుతుందనే భయంతో కౌలాలంపూర్ చుట్టుపక్కల ఉన్న అనేక దుకాణాలు సూర్య KLCCతో సహా ఆ రోజు మూసివేసారు.
కౌలాలంపూర్ నగరం అంతటాను, శివార్లలోనూ భారీ ట్రాఫిక్ జామ్‌లను సృష్టించడానికి ప్రదర్శనకు వారం ముందు పోలీసుల రోడ్‌బ్లాక్‌లు ప్రారంభమయ్యాయి.[30] డెమోక్రటిక్ యాక్షన్ పార్టీ (డిఎపి)కి చెందిన మలేషియా ప్రతిపక్ష నాయకుడు లిమ్ కిట్ సియాంగ్, పోలీసుల ఈ చర్య అనవసరమని, ఇది ప్రతి ఒక్కరికీ పెద్ద అసౌకర్యాన్ని కలిగించిందని ఎత్తి చూపాడు.[31]
ప్రదర్శన నాటి ఉదయం, కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ ట్విన్ టవర్స్ దగ్గర దాదాపు ఇరవై వేల మంది ప్రజలు గుమిగూడారు. తమ నిరసన యొక్క అహింసా స్వభావాన్ని సూచించడానికి క్వీన్ ఎలిజబెత్ II, మహాత్మా గాంధీ జీవిత-పరిమాణ చిత్రాలను ప్రదర్శించారు. ఐదు వేల మంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగిని ప్రయోగించారు.[4] 136 మందిని అరెస్టు చేశారు.[24][32]
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసు అధికారులు బాష్ప వాయువును ఉపయోగించినట్లు అల్ జజీరా చేసిన సంఘటన ప్రసారంలో కనబడింది.[4][33] కొన్ని వందల మంది నిరసనకారులు, ముగ్గురు పోలీసు అధికారులూ గాయపడ్డారు.[17][19]
బటు గుహల వద్ద జరిగిన నిరసన ఫలితంగా హిందూ దేవాలయం దెబ్బతిన లేదు గానీ, స్వల్ప ఆస్తి నష్టం జరిగింది.[34]
ఆ తర్వాత హింద్రాఫ్, బ్రిటిష్ హైకమిషన్ సిబ్బందికి తమ పిటిషన్‌ను ఫ్యాక్స్‌లో పంపినట్లు పేర్కొంది. అయితే, నవంబరు 28 నాటికి, బ్రిటిష్ రాయబారికి హింద్రాఫ్ నుండి ఇంకా ఎటువంటి పిటిషనూ అందలేదు. అయితే వారు ఫ్యాక్స్ ద్వారా కొంత పేర్కొనబడని సమాచారం అందుకున్నారని చెప్పారు.[24]
ప్రధానమంత్రి అబ్దుల్లా అహ్మద్ బదావీ ఆధ్వర్యంలోని BN ప్రభుత్వం మీడియా ద్వారా హింద్రాఫ్ ర్యాలీతో తీవ్రవాదాన్ని అంటు కట్టడానికి ప్రయత్నించింది.[17][35][36]
2007 డిసెంబరు 11 నాటికి, హింద్రాఫ్ నాయకులందరూ సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా విడుదలయ్యారు.[17] చెల్లుబాటు అయ్యే సాక్ష్యం-ఆధారిత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం వారిపై అభియోగాలు మోపలేనప్పుడు ఉద్యమాన్ని అరికట్టడానికి, 2007 డిసెంబరు 12న అబ్దుల్లా బదావి హింద్రాఫ్ నాయకులను ISA కింద రెండేళ్లపాటు ఖైదు చేయడానికి నిర్బంధ లేఖలపై వ్యక్తిగతంగా సంతకం చేశారు. వారి నిర్బంధ నిబంధనలు అనంతమైన పునరుద్ధరణకు లోబడి ఉంటాయి. హిండ్రాఫ్ నాయకత్వానికి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు, భారతదేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఈ అరెస్టుకు కారణంగా చెప్పారు.[37] హింద్రాఫ్ నాయకులను పట్టుకోవడానికి ISA ను ప్రయోగించడం, హింద్రాఫ్ ద్వారా ఉత్పన్నమైన ఊపును అడ్డుకోడానికి BN యొక్క యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ (UMNO) ప్రభుత్వపు వ్యూహాత్మక చర్యగా భావించబడింది.[5][17]
మలేషియాలో ఎక్కువగా మలేషియా చైనీస్ వెలికితీతలో BN వ్యతిరేక అంశాలను లక్ష్యంగా చేసుకున్న 1987 ఒపెరాసి లాలాంగ్ మాదిరిగానే UMNO నేతృత్వంలోని ప్రభుత్వం అత్యవసర చట్టం, ISA కింద భారీ అరెస్టులతో మలేషియా భారతీయ సమాజాన్ని బెదిరించింది. మలేషియా ఇండియన్ కమ్యూనిటీ ఛాంపియన్‌గా హింద్రాఫ్ జోరును మట్టుబెట్టడానికి పాలక BN లో భాగమైన మలేషియా ఇండియన్ కాంగ్రెస్ (MIC) వలన ఈ కఠినమైన విధానం కొంత మృదువుగా మారింది.[5][17]
మలేషియా జాత్యహంకార విధానాలను అందరికీ తెలిసేలా హింద్రాఫ్ నాయకులకు వ్యతిరేకంగా ISAని ఉపయోగిస్తామని ప్రధాన మంత్రి అబ్దుల్లా బదావీ బెదిరించడం ప్రారంభించినప్పటికీ, విదేశీ వార్తా సంస్థలు సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించడంలో అబ్దుల్లా బదావీ చొరవ తీసుకోకపోవడాన్ని విమర్శించాయి.[4][38][39] విచారణ లేకుండానే హింద్రాఫ్ నాయకులను నిర్బంధించడం వల్ల అబ్దుల్లా బదావీ ప్రభుత్వం ఈ సమస్య పట్ల వ్యవహరిస్తున్న పేలవమైన విధానం గురించి విదేశీ పత్రికలలో ప్రతికూల వ్యాఖ్యలు వచ్చాయి.[40]
హింద్రాఫ్ నాయకుల నిర్బంధాన్ని సవాలు చేస్తామని DAP ప్రతిజ్ఞ చేసింది.[41] అరెస్టులు జరిగినప్పటికీ, ప్రతిపక్షాలు, చాలా NGOలు మలేషియాలో UMNO చేస్తున్న ప్రజాస్వామ్య తిరోగమనాన్ని సవాలు చేస్తూనే ఉన్నాయి. ఈ తాజా రౌండ్ ISA అరెస్టులపై అమెరికా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది.[36][42]
హింద్రాఫ్ అధికారిక వెబ్‌సైట్ http://www.policewatchmalaysia.comని మలేషియా ISPలు క్లుప్త నిషేధం తర్వాత మళ్లీ అనుమతించారు. అయితే, ఈ సైట్ నిరంతరం లోపాలు, అంతరాయాలతో సతమతమౌతూ ఉంటుంది. నిషేధానికి ప్రతిస్పందనగా, అందుబాటులో ఉన్న అనేక బ్లాగ్‌లతో పాటు, ఈ ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు వెబ్‌సైట్‌లను రూపొందించారు. ఈ ఉద్యమం మలేషియాలో ప్రారంభమైంది, ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇప్పుడు UK, ఆస్ట్రేలియా, కెనడా, USAలో అనుచరగణం ఉంది.[43]
హింద్రాఫ్ ప్రచారంలో మానవీయ అంశాన్ని ప్రదర్శించేందుకు ప్రశాంతంగా, శాంతియుతంగా 'రోజ్ టు ది పీఎం' ప్రచారం ప్రారంభించారు. ప్రేమ, కరుణకు చిహ్నంగా వ్వైష్ణవి వాథ్యామూర్తి పార్లమెంటులో ప్రధానికి గులాబీని అందించడం ఈ ప్రచారంలో కేంద్రం. ఈ చర్య 2008 ఫిబ్రవరి 16 న చెయ్యాలని ప్రణాళిక చేసారు. 2008 ఫిబ్రవరి 13 న సాధారణ ఎన్నికల కోసం పార్లమెంటును రద్దు చేసారు.[44]
బదులుగా నాటకీయ బల ప్రదర్శన చేస్తూ, కౌలాలంపూర్ మధ్యలో శాంతియుతంగా గుమిగూడిన అనేక వందల జాతి తమిళులపై పోలీసులు బాష్పవాయువులను ప్రయోగించారు. నీటి ఫిరంగిని ప్రయోగించారు. భారతీయ దేవాలయం సమీపంలో పోలీసులు దాడి చేసి, 200 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.[44][45]
దేశపు ప్రస్థానంలో హింద్రాఫ్ ఒక పెద్ద మార్పుకు ట్రిగ్గర్‌లలో ఒకటిగా ఎలా మారిందో 2008 మలేషియా సార్వత్రిక ఎన్నికలు చూపించింది. UMNO పాలనపై సాధారణ అసంతృప్తి కొన్నేళ్లుగా ఏర్పడింది. 2007 నవంబరు 25 నాటి హింద్రాఫ్ ర్యాలీ మలేషియా రాజకీయాలలో ప్రతిపక్ష పాకటన్ రఖ్యాత్ (PR) కు అనుకూలంగా రాజకీయ సునామీ రావడానికి కారణమైంది.[4][46][47]
అబ్దుల్లా బదావీకి చెందిన అధికార UMNO-BN ప్రభుత్వం పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీని కోల్పోయింది. ఐదు రాష్ట్రాలను కూడా కోల్పోయింది . BN మలేషియా ద్వీపకల్పం నుండి పార్లమెంటులో కేవలం సగానికి పైగా సీట్లను మాత్రమే పొందింది. హింద్రాఫ్, కేవలం మూడు సంవత్సరాల పాటు ఉనికిలో ఉంది. 2007 ఆగస్టు వరకు దాని గురించి అంతగా తెలియదు. హఠాత్తుగా, భారతీయులు, హిందువులు మాత్రమే కాకుండా చైనీయులు, మలయ్‌లలో కూడా గణనీయమైన సంఖ్యలో ప్రజలను ఆకర్షించింది.[48][49][50][51]
మలేషియా ప్రభుత్వం అనేక హెచ్చరికల తర్వాత, 2008 అక్టోబరు 15న హింద్రాఫ్‌ను అధికారికంగా నిషేధించింది.[52][53][54] ఈ విషయాన్ని మలేషియా హోం మంత్రి సయ్యద్ హమీద్ అల్బర్ ధ్రువీకరించారు. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, సయ్యద్ హమీద్ హింద్రాఫ్ చట్టవిరుద్ధమైన ప్రయోజనాలకు, నైతికతకూ ముప్పు కలిగిస్తున్నట్లు చూపించిన వాస్తవాలు, సాక్ష్యాలతో మంత్రిత్వ శాఖ సంతృప్తి చెందిన నేపథ్యంలో హింద్రాఫ్ ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "సొసైటీస్ చట్టంలోని సెక్షన్ 5 (1) కింద ఉన్న అధికారాల ఆధారంగా, హింద్రాఫ్ నేటి నుండి చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించబడింది," అని ఆయన చెప్పాడు. సంస్థ ప్రారంభమైనప్పటి నుండి రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ (RoS), హోం మంత్రిత్వ శాఖ దాని కార్యకలాపాలను పర్యవేక్షించడం దర్యాప్తు చేయడం ఫలితంగా ఈ ఆర్డర్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పాడు.[55]
2008 అక్టోబరు 23న, ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారితో కూడిన బృందం ప్రధానమంత్రి కార్యాలయంలో మెమోరాండం అందజేయడానికి ప్రయత్నించినపుడు వారిని పోలీసులు అరెస్టు చేశారు. ISA కింద నిర్బంధంలో ఉన్న ఐదుగురు హింద్రాఫ్ నాయకులను విడుదల చేయాలని కోరింది.[17][56] పోలీసుల క్రూరత్వాన్ని ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం కూడా ఖండించారు.[57][58] అరెస్టయిన వారిలో హింద్రాఫ్ నాయకుడు పి.వైతమూర్తి ఆరేళ్ల కూతురు కూడా ఉన్నట్లు తెలిసింది.[59][60]
BN యొక్క కొత్త ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ప్రదర్శనకారులకు వ్యతిరేకంగా అవసరమైతే ప్రభుత్వం ISAని వాడుతుందని హెచ్చరించాడు. ప్రదర్శనకారులను మరింత విమర్శించాడు, తాను అందరి వాదనలనూ, అనుచితంగా మాట్లాడినా సరే, వింటానని వాగ్దానం చేశాడు.[58] ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పి.ఉతయకుమార్ నేతృత్వంలోని ఒరిజినల్ హిండ్రాఫ్ సభ్యులు 2009 జూలై 19న ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ పార్టీ మలేషియా (హెచ్‌ఆర్‌పి)ని రిజిస్టర్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ దాన్ని ప్రభుత్వం ఆమోదించలేదు.[61] పైగా 2009 అక్టోబరు 10 న, హింద్రాఫ్ వ్యతిరేకి, మాజీ కో-ఆర్డినేటర్ అయిన RS థానేంతిరన్ స్థాపించిన మలేషియా మక్కల్ శక్తి పార్టీని సమాన హక్కుల ఉద్యమానికి అనుసంధానం చేయడం ద్వారా నజీబ్, హింద్రాఫ్ని విభజించే ప్రయత్నం చేశాడు.[62][63]
2011 ఫిబ్రవరి 27న హింద్రాఫ్, కౌలాలంపూర్‌లో మలయ్ భాషా నవల ఇంటర్‌లోక్‌ను పాఠశాల పాఠ్యాంశాల్లో సెకండరీ 5లో మలయ్ సాహిత్యం సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా చదవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఒక ప్రదర్శనను నిర్వహించింది. ఇంటర్‌లోక్‌లో మలేషియా భారతీయులపై అవమానకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని. దాన్ని జాత్యహంకారంగా పరిగణించాలనీ హింద్రాఫ్ ఆరోపించింది. అక్రమ ప్రదర్శనలో పాల్గొన్న 109 మందిని పోలీసులు అరెస్టు చేశారు.[64]
హింద్రాఫ్పై విధించిన నిషేధాన్ని మలేషియా హోం మంత్రిత్వ శాఖ 2013 జనవరి 26 న ఎత్తివేసింది. తర్వాత 2013 మార్చి 8 న ఒకప్పుడు అక్రమమన్న మైనారిటీ హక్కుల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను RoS నిశ్శబ్దంగా ఆమోదించింది.[65][66][67][68][69] 2013 ఏప్రిల్ 18 న, మలేషియా సార్వత్రిక ఎన్నికలకు (GE13) కొద్ది వారాల ముందు, P. వైతమూర్తి నేతృత్వంలోని హింద్రాఫ్ వర్గాలు బారిసన్ నేషనల్ (BN)తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ద్వారా వారు స్థానభ్రంశం చెందిన ఎస్టేట్ కార్మికుల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తారు. దేశం లేని వ్యక్తుల సమస్యను పరిష్కరించి వ్యాపార అవకాశాలను అందించడం ద్వారా పేద భారతీయులను దేశ అభివృద్ధిలో ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేస్తారు.[69][70] వాథ్యామూర్తి సెనేటర్‌గా, BN ప్రభుత్వ ప్రధానమంత్రి విభాగంలో ఉప మంత్రిగా నియమితుడయ్యాడు. అయితే మలేషియా భారతీయ సమాజాన్ని ఉద్ధరించడంలో BN ప్రభుత్వం విశ్వాసాన్ని ఉల్లంఘించినట్లు, సంస్కరణల విషయంలో వైఫల్యాలను గుర్తించిన తర్వాత, 2014 ఫిబ్రవరి 8 న ఎనిమిది నెలలపాటు తాను నిర్వహించిన డిప్యూటీ మంత్రి పదవికి వైతా మూర్తి రాజీనామా చేశారు.[69][71][72]
PH ఇప్పటికీ పాలక ప్రభుత్వం అయినప్పటికీ, చట్టం ప్రకారం అవసరమైన విధంగా సంవత్సరానికి కనీసం ఎనిమిది సార్లు సమావేశాలు నిర్వహించడంలో కేంద్ర కమిటీ నాయకత్వం విఫలమైనందున హింద్రాఫ్‌ను రద్దు చేయాలని RoS 2019 జూలై 15న నిర్ణయించింది.[7] RoS డైరెక్టర్ జనరల్ 2019 సెప్టెంబరు 30న హింద్రాఫ్కి ఒక లేఖ పంపారు, వారి రిజిస్ట్రేషన్ రద్దు చేయబడిందని తెలియజేసారు. కొత్త ప్రధాన మంత్రి ముహిద్దీన్ యాసిన్ ఆధ్వర్యంలో కొత్త పెరికటన్ నేషనల్ (PN) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మలేషియన్ యునైటెడ్ ఇండిజినస్ పార్టీ ప్రభుత్వం లోంచి వైదొలగినపుడు PH 2020 మలేషియా రాజకీయ సంక్షోభంలో పడిపోయింది.[73] PN యొక్క హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 8న రిజిస్ట్రేషన్ రద్దును సమర్థించింది. తన నమోదును రద్దు చేసే రెండు నిర్ణయాలు చట్టవిరుద్ధమైనవని, అవి చెల్లవనీ హింద్రాఫ్ సంస్థ చట్టపరమైన డిక్లరేషన్‌ను కోరుతోంది. అలాగే న్యాయ సమీక్ష దరఖాస్తును పరిష్కరించడంలో పెండింగ్‌లో ఉన్న నిర్ణయాలను తాత్కాలికంగా బ్నిలిపివేయాలని ఆదేశించింది.[74][75]
{{cite web}}
: CS1 maint: unfit URL (link)
{{cite web}}
: |archive-date=
/ |archive-url=
timestamp mismatch; 10 అక్టోబరు 2012 suggested (help)
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) Daily Express, East Malaysia Independent Newspaper
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) The Standard Hong Kong
{{cite web}}
: |archive-date=
/ |archive-url=
timestamp mismatch; 10 అక్టోబరు 2012 suggested (help)
{{cite news}}
: |last=
has numeric name (help)