హీరాలాల్ జెకిసుందాస్ కనియా | |
---|---|
![]() | |
మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 1950 జనవరి 28 – 1951 నవంబరు 6 | |
Appointed by | బాబూ రాజేంద్ర ప్రసాద్ |
అంతకు ముందు వారు | పదవి ప్రారంభం |
తరువాత వారు | ఎం. పతంజలి శాస్త్రి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1890 నవంబరు 3 సూరత్, గుజరాత్ |
మరణం | 1951 నవంబరు 6 న్యూఢిల్లీ | (వయసు: 61)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (1923 - 1926) |
జీవిత భాగస్వామి | కుసుమ్ మెహతా |
సంతానం | రుక్మిణి షా |
సర్ హీరాలాల్ జెకిసుందాస్ కనియా (1890, నవంబరు 3 - 1951, నవంబరు 6) భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి. 1950 నుండి 1951 వరకు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కనియా, 1951లో కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనే మరణించాడు.[1]
కనియా 1890 నవంబరు 3న గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. కనియా 1910లో సమల్దాస్ కళాశాల నుండి బిఏ పట్టా పొందాడు, ఆ తర్వాత 1912లో బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి ఎల్.ఎల్.బి., 1913లో ఎల్ఎల్ఎం పట్టాలను పొందాడు. 1915లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.
కనియా తాత బ్రిటీష్ ప్రభుత్వంలో గుజరాత్‌లో రెవెన్యూ అధికారిగా పనిచేయగా, తండ్రి జెకిసుందాస్ కనియా సంస్కృత ప్రొఫెసర్ గా, భావ్‌నగర్ రాచరిక రాష్ట్రంలోని సమదాస్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. అన్న కొడుకు మధుకర్ హీరాలాల్ కనియా 1987లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. బొంబాయి గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన సర్ చునీలాల్ మెహతా కుమార్తె కుసుమ్ మెహతాతో కనియా వివాహం జరిగింది.[2]
కొంతకాలం ఇండియన్ లా రిపోర్ట్స్‌కి యాక్టింగ్ ఎడిటర్‌గా పనిచేశాడు. 1930లో బాంబే హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేసి, 1931 జూన్ నెలలో అదే కోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితుడై 1933 మార్చి వరకు పనిచేశాడు. 1933 జూన్‌లో అసోసియేట్ జడ్జిగా పదోన్నతి పొందాడు.[3]
కనియా 1944 మే-సెప్టెంబరు, 1945 జూన్-అక్టోబరు వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 1946 జూన్ 20న సర్ పాట్రిక్ స్పెన్స్ (తరువాత లార్డ్ స్పెన్స్) నేతృత్వంలోని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అసోసియేట్ జడ్జిగా పదోన్నతి పొందాడు. 1947 ఆగస్టు 14న స్పెన్స్ పదవీ విరమణచేయగా కనియా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాడు. 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత, కనియా భారత సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో ప్రమాణం చేయించాడు.
1951 నవంబరు 6న తన 61వ ఏట అకస్మాత్తుగా గుండెపోటుతో కార్యాలయంలోనే మరణించాడు.[4]