హెచ్.ఎమ్.రెడ్డి

హెచ్. ఎం. రెడ్డి
జననం
హనుమప్ప మునియప్ప రెడ్డి

1882[1]
బెంగళూరు
మరణం1960(1960-00-00) (వయసు 77–78)
మద్రాసు
వృత్తిదర్శకుడు, నిర్మాత, పోలీసు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తొలి తెలుగు టాకీ సినిమా దర్శకుడు

హెచ్. ఎం. రెడ్డి గా పేరు గాంచిన హనుమప్ప మునియప్ప రెడ్డి తెలుగు సినిమా తొలినాళ్ళలో ప్రముఖ దర్శకుడు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.[2] బ్రిటీషు వారి క్రింద పనిచేయటం ఇష్టంలేక ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు.

ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.

1930లో ఇంపీరియల్‌ కంపెనీకి విజయకుమార్‌, 1931లో ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ఆలం ఆరా అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక భక్తప్రహ్లాదని ఆయనకు అప్పజెప్పారు. అలాగే కాళిదాసు కూడా తమిళంలో తీశారు రెడ్డి.

హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, పితామహుడు అనిపించుకున్నారు.

రెడ్డిగారిని టైగర్‌ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ఇది తెలుగు ఇది తమిళం అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. తర్వాత సీతాస్వయంవరం (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి కొల్హాపూర్‌లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు. హెచ్‌.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి - తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ప్రహ్లాద నుంచి కొన్ని చిత్రాల వరకు ఎల్.వి.ప్రసాద్ సహాయకుడుగా పనిచేశారు.

రోహిణి పిక్చర్స్‌ పేరిట బి.ఎన్.రెడ్డి, నటి కన్నాంబ లాంటి వారిని కలుపుకుని, రంగూన్ రౌడీ అనే నాటకం ఆధారంగా గృహలక్ష్మి (1938) తీసి సాంఘిక పతాకం ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి వాహిని పిక్చర్స్ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు నిర్దోషి (1951) తీసిన తర్వాత మద్రాసులో రోహిణి స్టూడియో కట్టారు. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్‌.ఎమ్‌.దిట్ట. అంతవరకూ విలన్‌ వేషాలే వేస్తున్న ముక్కామలని నిర్దోషిలో హీరోని చేశారు. వాంప్‌ వేషాలు ఎక్కువగా వేసిన అంజలీదేవిని నిర్దోషి (1951) తో హీరోయిన్‌ని చేశారు. నిర్దోషిలో ఓ చిన్నవేషంలో కనిపించిన కాంతారావుని ప్రతిజ్ఞతో హీరోని చేశారు. అలాగే ప్రతిజ్ఞలో విలన్‌ రాజనాలకు అదే తొలిచిత్రం.

కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.

హెచ్.ఎమ్.రెడ్డి 1960, జనవరి 14న గజదొంగ సినిమా చిత్రీకరిస్తూనే అప్పటి మద్రాసు నగరంలో మరణించాడు.

వనరులు

[మార్చు]
  1. గ్రేట్ డైరెక్టర్స్ పుస్తకం (May 2013 ed.). కిన్నెర పబ్లికేషన్స్. p. 11.
  2. Encyclopaedia of Indian Cinema By Ashish Rajadhyaksha, Paul Willemen పేజీ.185