రీయూజబుల్ లాంచ్ వెహికల్ హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్‌పెరిమెంట్ లేదా RLV HEX అనేది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వారి RLV టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ కార్యక్రమంలో మొదటి టెస్ట్ ఫ్లైట్. ఈ ప్రదర్శన పరీక్షలు రెండు-దశలలో కక్ష్య లోకి (TSTO) వెళ్ళే పునర్వినియోగ ప్రయోగ వాహనం కోసం మార్గం సుగమం చేస్తాయి. LEX పరీక్షను 2023 ఏప్రిల్ 2 న జయప్రదంగా నిర్వహించారు.[1][2][3][4]
2009లో, ఎయిర్‌ఫ్రేమ్ ఇంజనీరింగ్ మోడల్, గ్రాఫైటైజేషన్ (CC) తర్వాత యాక్సిసిమెట్రిక్ ప్రోటో నోస్ క్యాప్, స్లో బర్న్ రేట్ ప్రొపెల్లెంట్ పూర్తయ్యాయి. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST)లో సాంకేతిక ప్రదర్శన వాహనం యొక్క ఏరోడైనమిక్ క్యారెక్టరైజేషన్ పూర్తయింది. గ్రౌండ్ టెస్టింగ్‌లో కంప్యూటేషనల్ ఫ్లో సిమ్యులేషన్, సూపర్‌సోనిక్ దహనం కూడా పూర్తయ్యాయి.
RLV-TD ఒక ఫ్యూజ్‌లేజ్ (బాడీ), ముక్కు టోపీ, డబుల్ డెల్టా రెక్కలు, ఒక జత నిలువు చుక్కానిలు ఉంటాయి. ఇందులో ఎలెవాన్‌లు, రడ్డర్లు అనే క్రియాశీలక నియంత్రణ ఉపరితలాలు ఉంటాయి.[4] చుక్కానిల జతను పక్కనబెడితే, ఇది ఒక చిన్న స్పేస్ షటిల్ ఆర్బిటర్‌ను పోలి ఉంటుంది.
TDV లో 600 లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణ నిరోధక సిలికా పలకలు, ఫ్లెక్సిబుల్ ఎక్స్‌టర్నల్ ఇన్సులేషన్‌ను ఉపయోగిస్తారు, నోస్-క్యాప్‌ను SiC పూత కలిగిన కార్బన్-కార్బన్ మిశ్రమంతో తయారు చేసారు. జంట చుక్కానిల లీడింగ్ అంచులను ఇన్‌కోనెల్-718 తో తయారుచేయగా, వింగ్ లీడింగ్ అంచులను 15CDV6 తో చేసారు. [5] [6] [7] [8] [9] [10]
భారతదేశం అభివృద్ధి చేసిన పునర్వినియోగ ప్రయోగ వాహనపు మొదటి టెస్ట్ ఫ్లైట్ HEX. ఈ పరీక్ష లక్ష్యాలు: [11]
హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్‌పెరిమెంట్, లేదా HEX, RLV టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ ప్రోగ్రామ్‌లో మొదటి టెస్ట్-ఫ్లైట్. RLV-TD వాహనం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుండి 2016 మే 23 న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:00 గంటలకు HS9 రాకెట్ బూస్టరుకు అమర్చి ప్రయోగించారు. [12]
జయవంతంగా గాల్లోకి లేచాక,91.1 సెకండ్లలో 56 కి.మీ. ఎత్తుకు వెళ్ళింది. అక్కడ RLV-TD, 9 టన్నుల HS9 బూస్టర్ నుండి వేరు పడి, దాదాపు 65 కి.మీ. ఎత్తుకు చేరుకుంది. అక్కడి నుండి అది దిగడం మొదలుపెట్టింది. అవరోహణను దాదాపు మాక్ 5 (ధ్వని వేగం కంటే ఐదు రెట్లు) వద్ద ప్రారంభించింది. వాహనం నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ వ్యవస్థలు ఈ దశలో వాహనాన్ని నియంత్రిత స్ప్లాష్‌డౌన్ కోసం, శ్రీహరికోట నుండి దాదాపు 450 కి.మీ. దూరంలో బంగాళాఖాతంపై నిలబెట్టిన ల్యాండింగ్ స్పాట్ వరకు ఖచ్చితంగా నడిపించాయి. తద్వారా దాని మిషన్ లక్ష్యాలను నెరవేరాయి.
శ్రీహరికోటలోని గ్రౌండ్ స్టేషన్ల నుండి, ఓడపై ఉన్న టెర్మినల్ నుండీ ఫ్లైట్ సమయంలో వాహనాన్ని ట్రాక్ చేసారు. లాంచ్ నుండి స్ప్లాష్‌డౌన్ వరకు మొత్తం ఫ్లైటు వ్యవధి 773.6 సెకండ్లు. రీ ఎంట్రీ వాహనాన్ని పైకి తెచ్చేందుకు ప్లాన్ చేయలేదు. [13] [14] ఇస్రో "సమీప భవిష్యత్తులో" శ్రీహరికోట ద్వీపంలో 4 కి.మీ. కు మించి పొడవైన ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించాలని యోచిస్తోంది.[15] అటానమస్ నావిగేషన్, గైడెన్స్ & కంట్రోల్, రీయూజబుల్ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, డిసెంట్ మిషన్ మేనేజ్‌మెంట్ వంటి క్లిష్టమైన సాంకేతికతలు ఈ విమానంలో ధృవీకరించబడ్డాయి.