హ్యాపీ డేస్ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
---|---|
నిర్మాణం | శేఖర్ కమ్ముల |
కథ | శేఖర్ కమ్ముల |
చిత్రానువాదం | శేఖర్ కమ్ముల |
తారాగణం | కమలినీ ముఖర్జీ తమన్నా వరుణ్ సందేశ్ నిఖిల్ వంశీ కృష్ణ సోనియా గాయత్రీరావు మోనాలి రాహుల్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
సంభాషణలు | శేఖర్ కమ్ముల |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | అమిగోస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | అక్టోబర్ 2, 2007 |
భాష | తెలుగు |
హ్యాపీ డేస్, 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అదే పేరుతో మళయాళంలోకి కూడా విడుదలయ్యింది. రెండు భాషలలోనూ గొప్పవిజయం సాధించింది. పరిమితమైన బడ్జెట్‌తో, చిన్నపాటి తారా గణంతో నిర్మించబడిన ఈ చిత్రం కాలేజీ విద్యార్థుల జీవితం ఇతివృత్తంగా తీయబడింది.
ఇదే దర్శకుని ఇతర సినిమాలు (ఆనంద్, గోదావరి) లాగానే ఈ సినిమా సమకాలీన సమాజంలోని ఒక సామాన్యమైన సంఘటనలతో కూర్చిన కథ. కాలేజీలో నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిల మధ్య జరిగే స్నేహం, ప్రేమ, బాధ్యత వంటి మానసిక సంబంధాలగురించినది.
ఈ చిత్రానికి తగిన తారాగణం కోసం శేఖర్ కమ్ముల Big FM, idlebrain.com ద్వారా విస్తృతంగా వెతికాడు. చివరకు 7గురిని ఎన్నిక చేసుకొన్నాడు. 8వ పాత్రధారిగా తమన్నాను ఎంపిక చేశారు. "సినిమాలో పాత్రకు తగిన నటీనటులు" అన్న విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు కాని డాన్సింగ్, డైలాగులు వంటి విషయాలకు కాదు.[1] ఇంటర్నెట్‌ద్వారా ముఖ్యపాత్రధారులను ఎంపిక చేసిన చిత్రం ఇదే మొదటిది కావచ్చును.
సినిమాలో కొంత భాగం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MGIT), చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) ఆవరణలలో తీయబడ్డాయి. అందుకు ఆ కాలేజీ మేనేజిమెంటును ఒప్పించడానికి శేఖర్ కమ్ముల చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది.[2]
సినిమా నిర్మాణ వ్యయం తగ్గించడానికి నిర్మాత చాలా జాగ్రత్తలు తీసికొన్నాడు. క్రొత్త తారాగణం పారితోషికాలు కూడా తక్కువే. 50 రోజుల పైగా షూటింగ్ కాలేజిలోనే జరిగింది. "పాంటలూన్ గ్రూప్"తో అవగాహన ద్వారా దుస్తుల వ్యయం తగ్గింది. [3] తారల బస కూడా కాలేజీకి సమీపంలో ఏర్పాటు చేశారు.
"హ్యాపీ డేస్" చిత్రం 2007 సెప్టెంబరు 28న భారత దేశంలోనూ, అక్టోబరు 2న అమెరికాలోనూ విడుదలయ్యింది. సంచలన విజయం సాధించింది. యువతరాన్ని విశేషంగా ఆకర్షించింది. చాలా చోట్ల వందరోజులు పైగా ఆడింది. మళయాళంలో 24 ప్రింటులతో విడుదలై మంచి విజయం సాధించింది.[4]
సినిమాకు మంచి సమీక్షలు లభించాయి.[5][6][7][8]
చిత్రంలోని 7 పాటలకు మంచి స్పందన లభించింది.