This article includes a list of references, related reading or external links, but its sources remain unclear because it lacks inline citations. (2023 అక్టోబరు) |
కొల్లి ప్రత్యగాత్మ | |
---|---|
జననం | ముదునూరు , కృష్ణా జిల్లా | 1925 అక్టోబరు 31
మరణం | 2001 జూన్ 6 హైదరాబాదు | (వయసు 75)
వృత్తి | దర్శకుడు |
పిల్లలు | కె.వాసు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కొల్లి హేమాంబరధరరావు (సోదరుడు) |
కె. ప్రత్యగాత్మ అనే పేరు తో ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 – జూన్ 6, 2001) తెలుగు సినిమా దర్శకుడు. ఇతను 1925 అక్టోబరు 31న గుడివాడలో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. జర్నలిస్ట్‌గా వ్యవహరించి, సినీరంగంలోకి ప్రవేశించి, కథా రచయితగా, అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసి, దర్శకుడై, తరువాత చిత్ర నిర్మాతగా కొనసాగారు. ప్రత్యగాత్మ. హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగానూ వ్యవహరించిన ఇతను బాలీవుడ్‌లో కె.పి. ఆత్మగా సుపరిచితులు.
కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని ముదునూరులో 1925వ సంవత్సరంలో కొల్లి కోటయ్య వర్మ, అన్నపూర్ణ దంపతులకు జన్మించిన ప్రత్యగాత్మ తొలుత కమ్యూనిస్ట్ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న కారణంగా కొంతకాలం అండర్‌గ్రౌండ్‌లోనూ ఉన్నారు. ఈయన భార్య అన్నపూర్ణ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత ఉద్యమంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపాధి ఎంచుకునే దశలో జర్నలిస్ట్‌గా కెరీర్ ఎంపిక చేసుకుని 'జ్వాల' పత్రికను ఏప్రిల్ 1952లో ప్రారంభించి కొంతకాలం నిర్వహించారు. 'ఉదయని' పత్రికకు కూడా వ్యాసాలు రాసేవారు.
మద్రాసు చేరి, తాతినేని ప్రకాశరావు వద్ద కథా రచయితగా, సహాయదర్శకుడుగా పనిచేసారు. 1954లో తొలిసారి సమకూర్చిన కథ నిరుపేదలు చిత్రానికి. ఆ తరువాత జయం మనదే, ఇల్లరికం, చిత్రాలకు కథ సమకూర్చారు. పి.ఎ.పి వారు నిర్మించిన ఇల్లరికం చిత్రానికి సెకండ్ యూనిట్ డైరక్టర్‌గా 1959లో వ్యవహరించారు.
కృష్ణకుమారి, అక్కినేని ప్రధానపాత్రలు పోషించిన భార్యాభర్తలు చిత్రంతో 1961లో దర్శకుడుగా మారారు. ఇది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకాన నిర్మితమయింది. ఎ.వి.సుబ్బారావు ఈ చిత్ర నిర్మాత. తొలి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ తరువాత అక్కినేని హీరోగా పలు చిత్రాలను రూపొందించారు ప్రత్యగాత్మ. భార్యాభర్తలు చిత్రంలో పాటలు కూడా హిట్. ఈ చిత్రానికిగాను రజిత కమలం దక్కింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి చేతులమీదుగా.
చక్కని కుటుంబ కథకు, సెంటిమెంట్లు జోడించడం, మంచి డ్రామా పండించగల నేర్పు, హిట్ అయ్యే పాటలను ఎంపిక చేయడం అనేవి ప్రత్యగాత్మలోని ప్రత్యేకతలు. సహజంగా ఉన్న ఊహాశక్తి, తాతినేని ప్రకాశరావు వద్ద చేరడంతో మరింత మెరుగులు దిద్దుకుంది. మంచి దర్శకుడుగా ఎదుగుతాడని తొలిదశలోనే తాతినేని ప్రకాశరావు, ఎ.వి.సుబ్బారావులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు కూడా తలచారు. తొలి తలపులకు అనుగుణంగానే ఇటు తెలుగు చిత్రసీమలోనూ, అటు హిందీ చిత్రసీమలోనూ రాణించారు ప్రత్యగాత్మ. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ ఆత్మ ఆర్ట్స్ ప్రారంభించాడు. కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు మమతలు, ఆదర్శకుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ అక్కినేని హీరోగా ప్రత్యగాత్మ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించాయి. అమ్మకోసం, ముగ్గురు అమ్మాయిలు, మా వదిన, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు, గడుసు అమ్మాయి, కన్నవారి ఇల్లు, కమలమ్మ కమతం తదితర చిత్రాలు ప్రత్యగాత్మ రూపొందించినవే. 1980లో దర్శకత్వం వహించిన నాయకుడు - వినాయకుడు ఈయన చివరి చిత్రం.
కృష్ణంరాజును హీరోగా పరిచయం చేస్తూ 'చిలకా గోరింక' చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించారు 1966లో. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ ఏడాదే హిందీ చిత్ర రంగంలోకి కె.పి. ఆత్మగా ప్రవేశించి 'ఛోటా భాయి' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'రాజా ఔర్ రంక్' కి సంజీవ్ కుమార్ హీరోగా, 'తమన్నా' చిత్రాన్ని పూజాభట్, శరద్ కపూర్‌లతో, 'ఎక్ నారి ఏక్ బ్రహ్మచారి' చిత్రాన్ని జితేంద్ర, మంతాజ్‌లతో 'బచ్‌పన్' దో లడకియా! చిత్రాల్ని సంజీవ్ కుమార్ తో, మెహమాన్, చిత్రాన్ని బిశ్వజిత్‌తో రూపొందించారు.
చక్కని చిత్రాలు డైరక్ట్ చేసిన కె. హేమాంబరధరరావు ఈయన సోదరుడే. హాస్య చిత్రాల దర్శకుడు కె.వాసు, ప్రత్యగాత్మ పెద్దకుమారుడు.
చిత్ర పరిశ్రమల్లో వచ్చిన మార్పులు జీర్ణించుకోలేకనో, ఆరోగ్యం సహకరించకనో 1980 తర్వాత నుంచి దర్శకత్వంకి దూరమై జూన్ 6, 2001 వ సంవత్సరంలో హైదరాబాదులో స్వర్గస్తులయ్యారు. గొప్ప దర్శకుడుగా రాణిస్తారని ఆదుర్తిని స్ఫురింపచేసే లక్షణాలున్న వ్యక్తి అని అక్కినేని భావించేవారు.
ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు.
ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు