హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ | |||
| |||
పదవీ కాలం 1952 – 1957 | |||
ముందు | none | ||
---|---|---|---|
తరువాత | కొమర్రాజు అచ్చమాంబ | ||
నియోజకవర్గం | విజయవాడ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఏప్రిల్ 2, 1898 హైదరాబాదు, భారతదేశం | ||
మరణం | జూన్ 23, 1990 ముంబై, భారతదేశం | ||
జీవిత భాగస్వామి | కమలాదేవి ఛటోపాధ్యాయ | ||
సంతానం | ఒక కుమారుడు | ||
మతం | హిందూ మతం |
హరీన్ బెంగాలీయుడే అయితేనేం ఆంధ్రులకు మాత్రం ఆప్తులు. అందుకు నిదర్శనం- 1952లో కమ్యూనిస్టుల మద్ధతుతో విజయవాడ నుండి పార్లమెంటుకు ఎంపిక కావడమే. హరీన్ 1940లో 'సునీతా ఆర్ట్ సెంటర్' అనే ఒక ప్రదర్శనాబృందాన్ని ఏర్పరిచారు. ఆ ప్రదర్శనలో పలు అభ్యుదయ గీతాలను వ్రాసి పాడేవారాయన. షురూ హువాహై జంగ్ హమారా అనే పాటను బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఇంకా ఆ పాట రాసి పాడినందుకు ఆయనను జైలులో పెట్టింది.
హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ బెంగాళీ ఆంగ్ల కవి, హిందీ సినిమా నటుడు, సరోజినీ నాయుడి సోదరుడు, లోక్ సభ సభ్యుడు. రవీంద్రనాథ్ టాగూర్ ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించాడు.ఆయన గొప్ప కవి మాత్రమే కాదు. గాయకుడుగా, నటుడుగా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటకరచయితగా ఇలా ఒకటేమిటి సృజనాత్మక కలలన్నింటిలోనూ తనదైన ముద్రతో గొప్పవాడుగా వెలుగొందిన బహుముఖ ప్రతిభాశాలిగా స్వదేశంలోనే గాక విదేశాల్లో సైతం యశస్సు పొందాడు
హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ అఘోరనాథ్, వరద సుందరీదేవి దంపతులకు 1898, ఏప్రిల్ 2 న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన బాల్యం నుండి తమ ఇంట్లో వుండే సాహితీ సాంకృతిక వాతావరణంలో పెరిగారు. "అందూ సంస్కృతీ, విజ్ఞాన్ ప్రదర్శనశాల. ఆ ఇంటికి అందరూ అతిథులే అని హరీన్ హైదరాబాదులోని తమ ఇంటిని గురించి నేనూ-నాజీవితమూ అనే స్వీయచరిత్ర గ్రంథంలో వ్రాసుకున్నారు. ఆయన హైదరాబాదులోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.హరీన్‌ది ఇంద్రధనుస్సులాంటి వ్యక్తిత్వం. అతను ప్రపంచంలో ఈజీటెర్మ్స్ తో మెలిగేవాడు. అతని ఇల్లు, వేషం, వస్త్రధారణ ఒక పేదకవిలా అగుపించేవారు. బెజవాడలో సెవెల్లీరోజ్ టెయిలర్స్ సూట్ వేసుకొని రిఫ్రిష్‌మెంట్ రూమ్‌లో ఈజీ చెయిర్లో పడుకొని హెవెన్నా సిగార్ కాల్చుతూ ఇంగ్లీషు మానర్డ్ ప్రౌనాన్సియేషన్‌తో కనబడేవారు. పరిచయమైన కొత్తవారితో కొద్దిసేపటిలోనే 'మన హరీన్' అనేంత ఆప్తుడైపోయేవారాయన. ఆయనకు డబ్బులు దాచుకోవడమంటే ఏమిటో తెలిసేది కాదు. ఆయనలో 'ఇదినాది' అనే భావన వుండేది కాదు. ఊరూరా తిరుగుతూ నాటకాలు వేస్తూ పోగుచేసుకున్న డబ్బును అక్కడే ఖర్చుపెట్టుకుంటూ తిరిగిన సందర్భాలెన్నో.
స్వాతంత్ర్యోద్యమంలో నిర్బంధం వున్న ఆ రోజుల్లో అతను బొంబాయిలో ఒక నాయకుడిగా వుండి జైలుకెళ్ళాడు.
కవిగా ఆయన ఆంగ్లంలో, హిందీలో వ్రాసిన పాటలెన్నో వున్నాయి. సూర్య అస్త్ హోగయా-గగన్ మస్త్ హోగయా అనే పాట పద్దెనిమిది భాషల్లోకి అనువాదమైందంటే ఆయన కవితా పాండిత్యాన్ని అంచనా వేయవచ్చు. ఇంకా 'తరుణ అరుణసే రంజిత ధరణి సభ్లోచన్ హైలాల్ భయ్యా, రాగజగత్ కా ఝూఠా రేబారు-తాళ్ జగత్ కా టూటా అనే గేయాలు బహుళ జనాదరణకు పాత్రమయ్యాయి. 1941లో బందరులో వున్నప్పుడు ఆయన రచించి అభినయించిన 'కర్డ్ సెల్లర్' అనే వ్యంగ్య విమర్శనాత్మక రచన ఆయన ప్రోగ్రాంలో పెద్ద హైలైట్.
హరీన్ వామపక్ష భావాలను అభిమానించి ఆచరించాడు. ఆంధ్రదేశంలో అభ్యుదయ రచయితల సంఘంతో హరీన్‌కు అత్యంత సాన్నిహిత్యం వుండేది. ఆయనకు విశ్వనాథ, కృష్ణశాస్త్రి, అబ్బూరి, శ్రీశ్రీ వంటి కవులతో స్నేహం కుదిరింది. హరీన్ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్సిఫిరేషన్" అని శ్రీశ్రీ గారు ప్రశంసించారు. తెలంగాణా సాయుధపోరాటానికి స్ఫూర్తినిస్తూ సుదీర్ఘ కవితను రాశారాయన. అలాగే ఆంధ్రలో కమ్యూనిస్టులపై జరిగిన పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్పందించారు. యలమర్రు-కాటూరుల్లో పోలీసులు గాంధీజీ విగ్రహం చుట్టూ ప్రజలను బట్టలు విప్పి ప్రదర్శించినప్పుడు హరీంద్రనాథ్ ఆగ్రహావేశాలతో గొంతెత్తి ఖండిస్తూనే ఆ రెండు గ్రామాలనూ తన రెండు చేతులా పొదుపుకున్నాడు. ఆయన కవితకు ఆరుద్ర అనువాదమిలా వుంది:
అచ్చంపేటా నీవొక/ అసామాన్య కుగ్రాం
తెలంగాణా పల్లెలన్నీ/ మిళితమాయే నీలోనే
నీ గ్రామపు సంగ్రామం/ నిజముగా ఏకాకిగాదు
కొరియాలో మలాయాలో/ కొరకరాని వియత్నామున
బర్మా, ఇండోనేషియా/ పల్లెలు నీ చెల్లెళ్ళు
ఈ నేపథ్యంలో 'ఫీస్ట్ ఆఫ్ ట్రూత్', 'ది మ్యూజిక్ ట్రీ', 'పెర్ప్యూమ్ ఆఫ్ ఎర్త్', 'అవుటాఫ్ ది డీప్', 'ది విజార్డ్', 'మాస్క్ ది డిలైన్', 'క్రాస్‌రోడ్స్', 'నాగాలాండ్ కర్డ్ సెల్లర్' వంటి పుస్తకాలు రచించారాయన.
హరీన్ 1940లో 'సునీతా ఆర్ట్ సెంటర్' అనే ఒక ప్రదర్శనాబృందాన్ని ఏర్పరిచారు. ఆ ప్రదర్శనలో పలు అభ్యుదయ గీతాలను వ్రాసి పాడేవారాయన. షురూ హువాహై జంగ్ హమారా అనే పాటను బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఇంకా ఆ పాట రాసి పాడినందుకు ఆయనను జైలులో పెట్టింది.
హరీన్ చటో రంగస్థల నటుడుగానే గాక 'మొహబూబా', 'పెంచ్ బీబీ ఔర్ గులాం', 'ఆశీర్వాద్', 'సోనార్ కెల్లా' వంటి సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు పాటలందించారు. 'ఆడోస్-పడోస్' టి.వి. సీరియల్లో నటించాడు. ఫిలిం డివిజన్ ఆయనపై ఒక డాక్యుమెంటరీని తీసింది కూడా.
హరీంద్రనాథ్ 1951లో విజయవాడ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఈయనకు వామపక్ష రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. ఈయన సమీప ప్రత్యర్థి అయిన రాజ్యం సిన్హా పై 74,924 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు.[1]
భారత ప్రభుత్వం ఆయనను 'పద్మభూషణ్'తో గౌరవించింది. 1952లో గుంటూరు హిందూ కాలేజీలో, 1981లో రవీంధ్రభారతిలో ఘనంగా సన్మానించారు. అన్నింటినీమించి అందరికీ ఆత్మీయుడుగా జీవించిన హరీన్ 1990 జూన్ 23 న బొంబాయిలోని హిందూజా ఆస్పత్రిలో ఆఖరి శ్వాస విడిచారు. బెంగాలీయుడిగా పుట్టి ఆంధ్రుల హృదయాల్లో ఆప్తుడుగా నిలిచిపోయిన బహుముఖ ప్రతిభాశాలి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ.